iDreamPost

ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. టికెట్ ధరలపై భారీ రాయితీలు!

  • Author singhj Published - 09:32 AM, Mon - 14 August 23
  • Author singhj Published - 09:32 AM, Mon - 14 August 23
ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. టికెట్ ధరలపై భారీ రాయితీలు!

భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 76 ఏళ్లు పూర్తవుతున్నాయి. ఈ ఆగస్టు 15న 77వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోబోతున్నాం. భరతమాత స్వేచ్ఛా సంకెళ్లను తొలగించడానికి, భారతీయులను బ్రిటిషర్ల అరాచక పాలన నుంచి విముక్తి గావించడానికి ఎందరో సమరయోధులు తమ ప్రాణాలను కూడా త్యాగం చేశారు. బ్రిటిషర్ల తుపాకీ తూటాలకు అసువులు బాసిన అమరులను పంద్రాగస్టు రోజు గుర్తుచేసుకుంటాం. అలాంటి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్​ఆర్టీసీ) తమ ప్రయాణికులకు ప్రత్యేక రాయితీలను ప్రకటించింది.

టీఎస్​ఆర్టీసీ పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణించే సీనియర్ సిటిజన్స్​తో పాటు హైదరాబాద్ నగరంలోని సాధారణ ప్యాసింజర్లకూ టికెట్ ధరలో భారీ రాయితీలను కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తిరిగే పల్లె వెలుగు సర్వీసుల్లో వెళ్లే వృద్ధులకు టికెట్ ధరలో ఏకంగా 50 శాతం రాయితీని ఇస్తూ డెసిజన్ తీసుకుంది. అలాగే హైదరాబాద్ సిటీలో టీ-24 టికెట్​ను కేవలం రూ.75కే ఇవ్వాలని నిర్ణయించింది. అయితే పిల్లలకు ఇదే టికెట్​ను కేవలం రూ.50కే అందివ్వడం విశేషం. ప్రయాణికులకు టికెట్ ధరలో తాము కల్పిస్తున్న రాయితీలు స్వాతంత్ర్య దినోత్సవం రోజున మాత్రమే వర్తిస్తాయని టీఎస్​ఆర్టీసీ యాజమాన్యం స్పష్టం చేసింది.

ఇకపోతే, టీఎస్​ఆర్టీసీలో ప్రస్తుతం సాధారణ ప్యాసింజర్లకు టి-24 టికెట్ ధర రూ.120గా ఉండగా.. మహిళలు, సీనియర్ సిటిజన్స్​కు రూ.100.. 12 ఏళ్ల లోపు పిల్లలకు రూ.80గా ఉంది. స్వాతంత్ర్య దినోత్సవం నేపథ్యంలో ఆ రోజు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారందరికీ టి-24 టికెట్​ను రూ.75కే సంస్థ ఇస్తుండగా.. పిల్లలకు రూ.50కే అందిస్తోంది. తెలంగాణలోని పల్లె వెలుగు బస్సుల్లో 60 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఒక్క రోజు టికెట్​లో 50 శాతం రాయితీని కల్పిస్తోంది టీఎస్​ఆర్టీసీ. ఈ సందర్భంగా సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ ఒక ట్వీట్ చేశారు. ఆర్టీసీ ప్రకటించిన ఫ్రీడమ్ డే ఆఫర్ వివరాలను ఆయన వివరించారు. ఈ ఆఫర్ పొందాలంటే ప్రయాణించే సమయంలో సీనియర్ సిటిజన్స్ తమ ఆధార్ కార్డును కండక్టర్లకు చూపించాలన్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి