iDreamPost

BJP ఇంత దయనీయ స్థితిలో ఉందా.. పవన్ ముందు ఇంత సాగిలపడాలా?

  • Published Oct 20, 2023 | 8:50 AMUpdated Oct 20, 2023 | 1:58 PM

బీజేపీలాంటి జాతీయ స్థాయి పార్టీ.. పవన్‌ను తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయవద్దని కోరడం చూసి.. ఆ పార్టీ కార్యకర్తలు మాత్రమే కాక.. జనాలు సైతం ఆశ్చర్యపోతున్నారు. పవన్‌కు మరీ ఇంత ప్రధాన్యత అవసరమా అనే చర్చ కూడా వినిపిస్తోంది.

బీజేపీలాంటి జాతీయ స్థాయి పార్టీ.. పవన్‌ను తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయవద్దని కోరడం చూసి.. ఆ పార్టీ కార్యకర్తలు మాత్రమే కాక.. జనాలు సైతం ఆశ్చర్యపోతున్నారు. పవన్‌కు మరీ ఇంత ప్రధాన్యత అవసరమా అనే చర్చ కూడా వినిపిస్తోంది.

  • Published Oct 20, 2023 | 8:50 AMUpdated Oct 20, 2023 | 1:58 PM
BJP ఇంత దయనీయ స్థితిలో ఉందా.. పవన్ ముందు ఇంత సాగిలపడాలా?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాష్ట్ర రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ఎన్నికల్లో విజయం సాధించడం కోసం ప్రధాన పార్టీలన్ని.. వ్యూహాలు రచిస్తున్నాయి. మేనిఫెస్టో మొదలుకొని.. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల సెలక్షన్‌ వరకు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఇక అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ ఎన్నికల కదన రంగంలో ఓ అడుగు ముందే ఉంది. అభ్యర్థుల లిస్ట్‌ విడుదల మొదలు.. ప్రచారం వరకు ప్రతి అంశంలో.. మిగతా పార్టీలకన్నా ముందే ఉంది. ఇక కాంగ్రెస్‌ పార్టీ కూడా ఎన్నికల కోసం దూకుడుగా ముందుకు వెళ్తోంది. ఇప్పటికే తొలి విడత అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. 6 గ్యారేంటీల పేరుతో మేనిఫెస్టో విడుదల చేసింది. బస్‌ యాత్ర కూడా షురు చేసింది. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు ఎన్నికల్లో విజయం సాధించడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి.

ఇక అటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మాత్రం.. రాష్ట్రంలో అంత దూకుడుగా లేదు. ఎన్నికల నగరా మోగి 10 రోజుల పైనే అవుతోంది. కానీ ఇప్పటి వరకు బీజేపీలో ఎలాంటి దూకుడు కనిపించలేదు. ఇంకా అభ్యర్థుల లిస్టే ఫైనల్‌ కాలేదు. మిగతా పార్టీలన్ని ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతుండగా.. బీజేపీ మాత్రం ఇంకా అభ్యర్థులను వెతుక్కునే పనిలోనే ఉంది. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం చోటు చేసుకున్న ఓ సంఘటన కాషాయ పార్టీ కార్యకర్తలనే కాక.. సామాన్యులను సైతం షాక్‌కు గురి చేసింది. కేంద్రంలో చక్రం తిప్పుతున్న బీజేపీ పరిస్థితి.. రాష్ట్రంలో మాత్రం ఇంత దారుణంగా ఉంది.. అసలు రాష్ట్రంలో ఉనికిలో లేని పార్టీ అధ్యక్షుడి ముందు.. బీజేపీ పార్టీ పెద్దలు ఇంతలా సాగిలపడలా అనే మాటలు వినిపిస్తున్నాయి.

ఇంతకు ఏం జరిగింది అంటే.. రెండు రోజుల క్రితం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి, లక్ష్మణ్‌లు.. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ని కలిశారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన 32 స్థానల్లో పోటీ చేస్తుందనే ప్రచారం సాగుతున్న నేఫథ్యంలో వీరి భేటీ ప్రధాన్యతను సంతరించుకుంది. వీరి మీటింగ్‌ నేపథ్యంలో.. తెలంగాణలో బీజేపీ-జనసేన పొత్తు ఉంటుందని అందరూ భావించారు. కానీ అందుకు భిన్నంగా కాషాయ పార్టీ నేతలు.. జనసేన పార్టీని తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయవద్దని కోరారు. అందుకు పవన్‌ కళ్యాణ్‌ రెండు రోజుల్లో తన నిర్ణయం చెప్తానని చెప్పడం.. రాజకీయ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది.

బీజేపీ ఇంత దయనీయ స్థితిలో ఉందా..

ఈ భేటీపై రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. బీజేపీ లాంటి ఓ జాతీయ పార్టీ.. అసలు ఉనికిలో ఉందో.. లేదో కూడా తెలీని ప్రాంతీయ పార్టీ అయిన జనసేన ముందు ఇంతలా సాగిలపడటం అవసరమా అంటున్నారు విశ్లేషకులు. అసలు తెలంగాణలో జనసేన పార్టీ బలమెంత.. ఏ మేరకు ప్రభావం చూపగలదు అనే అంశాల గురించి బీజేపీకి కనీసం అవగాహన కూడా లేనట్టుంది అంటున్నారు. అ

సలు జనసేన పార్టీ తరఫున పోటీ చేయడానికి కనీసం అభ్యర్థులు కూడా దొరకడం లేదనే టాక్‌ వినిపిస్తున్న నేపథ్యంలో.. రాష్ట్ర బీజేపీ పెద్దలు పవన్‌ వద్దకు వెళ్లి.. ఏకంగా ఎన్నికల్లో పోటీ చేయవద్దని బతిమిలాడటం కాస్త వింతగానే ఉంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కేంద్రంలో చక్రం తిప్పుతున్న బీజేపీకి తన మీద ఆ మాత్రం విశ్వాసం లేదా.. కేవలం ఒక్క సామాజిక వర్గం కోసం మరీ ఇంత దిగజారాలా అనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక బీజేపీ నేతలు చేసిన పనిపై కాషాయ పార్టీ కార్యకర్తలు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట.

పవన్‌కు ఇంత ప్రాధాన్యత అవసరమా?

జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌.. ఇప్పటి వరకు తెలంగాణలో ఎలాంటి రాజకీయ కార్యక్రమాలు చేపట్టలేదు. ఇక్కడి ప్రజల సమస్యలపై పోరాటం కాదు కదా కనీసం మాట్లాడింది కూడా లేదు. చాలా మంది జనాలకు అసలు తెలంగాణలో జనసేన పార్టీ ఉంది అనే విషయం కూడా తెలియదు. అలాంటిది జనసేన 32 స్థానాల్లో పోటీ చేస్తాము అనగానే.. బీజేపీ మరీ ఇంతలా భయపడలా.. దీని కన్నా దారుణం మరోటి లేదు అంటున్నారు రాజకీయ పండితులు.

ఆఖరికి కేఏ పాల్‌ వంటి చిన్న చిన్న పార్టీలు, నేతలు సైతం ఒంటరిగా బరిలో దిగడానికి రెడీ అంటుంటే.. బీజేపీ ఎందుకు ఇంతలా భయపడుతుంది అని చర్చించుకుంటున్నారు ఆ పార్టీ కార్యకర్తలు. ఎన్డీఏలో ఉంటూ చంద్రబాబుకు అనుకూలంగా పని చేసే పవన్‌ కళ్యాణ్‌కు ఇంత ప్రాధాన్యత ఇవ్వడం అవసరమా అనే టాక్‌ వినిపిస్తోంది. మరి దీన్ని బీజేపీ నేతలు ఎలా సమర్థించుకుంటారో చూడాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి బీజేపీ చేసిన పనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి