iDreamPost

తెలంగాణ పూదోటలో గులాబీకి 22 ఏళ్లు

తెలంగాణ పూదోటలో గులాబీకి 22 ఏళ్లు

ఉద్యమ పార్టీగా అవతరించి.. దశాబ్దాల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చి.. అధికార పార్టీగా మారిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) నేటితో 21 ఏళ్లు పూర్తి చేసుకుంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర స్థాపనే ఏకైకలక్ష్యంగా 2001 ఏప్రిల్ 27న కొండా లక్ష్మణ్ బాపూజీ నివాసం జలదృశ్యం లో టీఆర్ఎస్ పార్టీ పురుడు పోసుకుంది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) అప్పటి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి పదవికి, శాసనసభా సభ్యత్వానికి, తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి ఈ పార్టీని ఏర్పాటు చేశారు. టీఆర్ఎస్ నేడు 22వ ఏట‌లో అడుగుపెట్ట‌బోతోంది.

తెలంగాణ రాష్ట్ర సమితి 2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌‌తో పొత్తు పెట్టుకుంది. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ కరీంనగర్‌లో ఏర్పాటుచేసిన స‌భ‌లో ప్రత్యేక తెలంగాణ ఇస్తామని ప్ర‌క‌టించారు. యూపీఏ కామన్ మినిమమ్ ప్రోగ్రాంలో తెలంగాణ అంశం చేర్చడంలో టీఆర్ఎస్ విజయం సాధించింది. తెలంగాణకు అనుకూలంగా దాదాపు 36 పార్టీలు లేఖ ఇచ్చాయి. కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో’ అంటూ కేసీఆర్ ఆమరణ నిరహారదీక్షకు దిగారు. ఆయన దీక్షతో తెలంగాణలో ఉద్యమం ఉధృతం అయింది. దీంతో దిగివచ్చిన యూపీఏ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటు దిశగా ప్రక్రియ ప్రారంభిస్తామంటూ 2009 డిసెంబర్ 9న ప్ర‌క‌టించింది.

కానీ.. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల నుంచి నిరసనలు వెల్లువెత్తడంతో డిసెంబర్ 23న ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. తెలంగాణ ఏర్పాటుపై అందరి అభిప్రాయాలను సేకరించేందుకు శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ దశలో టీఆర్ఎస్ మిగిలిన పార్టీలతో కలిసి తెలంగాణ పొలిటికల్ జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడింది. పొలిటికల్ జేఏసీ ప్రత్యేక తెలంగాణ కోసం కేంద్రంపై ఒత్తిడిని తీవ్రం చేసింది. 2010 డిసెంబర్‌ 16న వరంగల్‌లో టీఆర్‌ఎస్‌ తలపెట్టిన మహాగర్జనకు 20 లక్షలమంది హాజరు అయ్యారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక సమర్పణ త‌ర్వాత 2011 జనవరి నుంచి టీఆర్‌ఎస్‌ అనేక ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. తెలంగాణలోని సంఘాలు, విద్యార్థులు, రాజకీయ నేతల సహాయంతో ఉధృతంగా ఉద్యమం చేసి, ప్రత్యేక రాష్ట్రాన్ని టీఆర్ఎస్ సాధించింది. ఈ క్రమంలో ఎన్నో ఆటుపోట్లను చవిచూసింది. రాష్ట్రం కోసం పార్టీని స్థాపించిన ఉద్యమనేత కేసీఆర్‌ రెండుసార్లు అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఫక్తు రాజకీయ పార్టీగా మారింది.

బుధవారం హైదరాబాద్‌ మాదాపూర్‌ హైటెక్స్‌లో ప్రతినిధుల సభ (ప్లీనరీ) నిర్వహిస్తోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు మంగళవారం రాత్రి వరకు పూర్తయ్యాయి. బుధవారం నాటి ప్లీనరీ వేదికగా పార్టీ కేడర్‌కు టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు.. రాజకీయ, ప్రభుత్వపరమైన అంశాలపై దిశానిర్దేశం చేయనున్నారు. జాతీయ రాజకీయాల్లో టీఆర్‌ఎస్‌ పాత్రపై మరింత స్పష్టత ఇవ్వనున్నారు. తమ ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని, సర్కారుపై విపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపునివ్వనున్నారు. పార్టీ ఆవిర్భావం తర్వాత ఆరు నెలల వ్యవధిలో రెండోసారి ప్లీనరీ ఏర్పాటు చేయటం ఇదే తొలిసారి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి