iDreamPost

తోలు బొమ్మలాట

తోలు బొమ్మలాట

ఒకనాటి గ్రామీణ ప్రజల జీవితంలో భాగంగా ఉన్న తోలు బొమ్మలాట నేడు అవసాన దశకు చేరుకుని ఈ తరం ప్రజలు అసలు తోలు బొమ్మలాటంటే ఏంటి, అదెలా ఉంటుందని అడుగుతున్నారంటే ఒకనాటి మహోత్కృష్టమైన కళారూపం ధీనస్థితిని అర్థం చేసుకోవచ్చు. సినిమా, టీవీ, స్మార్ట్ ఫోన్లను అందుబాటులోకి తెచ్చుకున్న ప్రేక్షకుడు కదిలే బొమ్మల కబుర్లకు అలవాటు పడి ఈ తోలు బొమ్మల కదలికలను విస్మరిస్తున్నారు కాబోలు.

రామాయణంలోని కాండాలనో, భారతంలోని పర్వాలనో ఆధారంగా చేసుకుని అందులోని పాత్రలకునుగుణంగా జంతు చర్మంతో చేసి రంగులతో అలంకరించిన తోలు బొమ్మలను సందర్భానుసారంగా తెర వెనుక అటు ఇటూ కదిలిస్తూ తెర ముందు నుంచి చూసే ప్రేక్షకుడికి ఆ సన్నివేశాన్ని అవగతం చేయించే సుందరమైన కళే ఈ తోలు బొమ్మలాట. కథా స్వరూపం ఏదైనా గానీ ద్విపద పద్యరూపంలోనే ఉండటం ఈ కళకున్న మరో ప్రత్యేకత.

కథా వస్తువు ఏదైనా గానీ ప్రతి కథలోనూ కేతిగాడు, బంగారక్క, జుట్టు పోలిగాడు అనే విదూషక పాత్రలను గమనించవచ్చు. కథలో ఈ మూడు పాత్రలకు ఏ రకమైన సంబంధముండదు గానీ ప్రేక్షకుడిని ఉత్తేజపరచడానికి, కడుపుబ్బా నవ్వించడానికి మధ్య మధ్యలో అలా వచ్చి వెళ్తుంటాయి.

హార్మోనియం, మృధంగం పరికరాలు ప్రధాన సంగీత వాయిద్యాలుగా ఉంటూ స్టీలు డబ్బాలు మరియు రేకులు కూడా సందర్భానుసారంగా వాడబడతాయి.

ఒక్కో తోలుబొమ్మకూ ఒక్కో ప్రత్యకతుంటుంది. దేవుల్లు దేవతల రూపాలకు ఏంటిలోప్ చర్మాన్ని, భీష్మ, రావణ వంటి వీరుల ధీరుల రూపాలకు జింకల చర్మాన్ని, మిగతా పాత్రలకు మేక చర్మాన్ని వాడటం కూడా విశిష్టతను జోడిస్తుంది. పండుగ ఉత్సవాలకు, పెద్ద ఖర్మలకు, ఇతర శుభాకార్యాలకు విధిగా ప్రదర్శింపబడే ఈ కళారూపం దాదాపు అయిదారు గంటలపాటు ఏకబిగిన సాగుతుంది. ఉత్సవాల్లో ప్రదర్శనలు లేని సమయంలో కళాకారులంతా బృందంగా ఏర్పడి ఇల్లు విడిచి అయిదారు నెలల పాటు గ్రామ గ్రామానికి తిరుగుతూ ప్రదర్శనలిచ్చుకుంటూ గ్రామాలు, మండలాలు, జిల్లాలు దాటి రాష్ట్రాలు తిరిగి సందర్భాలు కూడా కోకొల్లలు. తోలు బొమ్మలాట కళాకారులు ఊర్లోకి అడుగు పెట్టారంటే పోటీ పడి మరీ మర్యాదలు చెయ్యబడే ఉన్నత స్థితి నుండి పూట భోజనానికి, టీకి కూడా యాచన చెయ్యాల్సిన పరిస్థితికి రావడం ఆ కళా రూపం యొక్క దీనస్థితికి మరో తార్కాణం.

కడప జిల్లా పోరుమామిళ్లలో నివాసముంటున్న కళాకారుల బృంద నాయకుడు షిండే నరసింహారావు మాటల్లో చెప్పాలంటే పాండ్యరాజుల కాలంలో విశ్వ బ్రాహ్మణ(కంసాలి) కులస్థుల ఆశ్రిత కళారూపమైన ఈ తోలు బొమ్మలాట కాలక్రమంలో మరాఠీల చేతుల్లోకి మారి వీరివద్దనే స్థిరపడిపోయింది. కడప జిల్లా పోరుమామిళ్లతో పాటు అనంతపురం జిల్లా ధర్మవరంలోనూ, గుంటూరు జిల్లా నరసారావుపేటలోనూ కొన్ని బృందాలు ఉన్నాయని వారి మాటల ద్వారా తెలిసింది.

ఎన్నో తరాలుగా ఆ కళారూపాన్నే నమ్ముకుని జీవితాన్ని నెట్టుకొచ్చిన చివరితరం కళాకారులు ప్రస్తుతం నిరాదరణకు గురవుతున్న కళను నమ్ముకోలేక పూర్తిగా విస్మరించి వేరే రంగం వైపు తరలలేక సంధి దశలో జీవిస్తున్నారు. వీరి పిల్లల్లో ఏ ఒక్కరే గాని ఈ రంగంలో కాక వ్యాపార ఉద్యోగ రంగాల్లో స్థిర పడడం ఈ కళ యొక్క అవశిష్ట దశకి ఒక తార్కాణం.

ఎన్నో సంక్షేమ జనాకర్షక పథకాలను ప్రవేశపెట్టి ప్రోత్సహించే ప్రభుత్వాలు తలుచుకుంటే అంతరించిపోతున్న ఈ గ్రామీణ కళారూపాన్ని కాపాడటం అంత కష్టమేమీ కాదు. రాష్ట్రం మొత్తం కలిపి పదుల సంఖ్యలో మాత్రమే ఉండే ఈ తోలు బొమ్మలాట కళాకారులను ప్రభుత్వం తరపున ఆదరించడం పెద్ద భారమేమీ కాకపోవచ్చు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి