iDreamPost

సినీకార్మికుల సమ్మె – నిర్మాతలకు ఝలక్

సినీకార్మికుల సమ్మె – నిర్మాతలకు ఝలక్

రేపటి నుంచి మెరుపు సమ్మెకు దిగబోతున్నట్టు సినీ కార్మికులు ప్రకటించారు. అన్ని క్రాఫ్ట్స్ కు సంబంధించిన వాళ్ళు ఇందులో పాల్గొంటారు. వీళ్ళ ప్రధాన డిమాండ్ వేతన సవరింపు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్ ఉన్న ఈ విషయాన్ని ఇప్పుడు తేల్చేయాలని కోరుతున్నారు. మెత్తగా అడిగితే పనులు జరగవు కాబట్టి షూటింగులను స్థంబింపజేయాలనే నిర్ణయం తీసుకున్నారు. ఇది నిర్మాతలకు పెద్ద ఝలక్. ఎందుకంటే చాలా సినిమాలు కీలక దశలో ఉన్నాయి. ఆర్టిస్టుల కాల్ షీట్స్ తీసుకుని షెడ్యూల్స్ ప్లాన్ చేసుకుని మొత్తం ప్రొడక్షన్ కాస్ట్ ని సిద్ధం చేసుకుని దానికి అనుగుణంగా ఉన్నారు. కానీ ఇప్పుడీ పరిణామం వల్ల తీవ్ర ఇబ్బందులు తప్పవు.

ఒకపక్క హిట్టు ఫ్లాపుతో సంబంధం లేకుండా హీరో హీరోయిన్లు తమ రెమ్యునరేషన్లు కోట్లలో పెంచేస్తున్నారు. నిర్మాతలు వందల కోట్ల బడ్జెట్ ని లెక్క చేయడం లేదు. టికెట్ రేట్లు అమాంతం పెరిగిపోతున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే పెరిగిన ధరలతో మధ్యతరగతి జీవితం అతలాకుతలం అయ్యింది. గ్యాస్, కరెంట్, బస్సు, కూరగాయలు ఇలా ఏది తీసుకున్నా కేవలం నెలల వ్యవధిలో వీటి ధరలు ఎక్కడికో వెళ్లిపోయాయి. ఈ నేపథ్యంలోనే తమ జీతాలను పెంచాలని వర్కర్స్ కోరుతున్నారు. అది ఎంత శాతం, ఏ మేరకు పెంపుని అడుగుతున్నారనేది నేరుగా ఫెడరేషన్ కు కార్మికులకు మధ్య జరిగే చర్చల్లోనే తేలనుంది.

రేపు బుధవారం ఫెడరేషన్ కార్యాలయాన్ని ముట్టడించబోతున్నారు. హైదరాబాద్ వేదికగా జరిగే ఈ సమ్మె కోసం అప్పటికప్పుడు ఏర్పాట్లు చేసుకున్నారు. అత్యవసరంగా దీన్ని వీలైనంత త్వరగా పరిష్కారం చేసుకోవాలి. లేదంటే కొత్త రిలీజులు కూడా ట్రబుల్ లో పడతాయి. ఎటొచ్చి దీని వల్ల చిక్కుల్లో పడేది నిర్మాతలే. ఈ రోజు సాయంత్రం మీటింగ్ జరిగే అవకాశం ఉంది. ఎవరెవరు పాల్గొంటారు లాంటి వివరాలు తెలియాల్సి ఉంది. ఎప్పుడో అరుదుగా వినిపించే సినిమా కార్మికుల సమ్మె మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత తెరపైకి వచ్చింది. చిరంజీవి, దిల్ రాజు, అల్లు అరవింద్. తమ్మారెడ్డి లాంటి పెద్దలు నగరంలోనే ఉన్నారు కాబట్టి ఏం చేస్తారో చూడాలి

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి