iDreamPost

ఒకవైపు మా ఎన్నికలు – మరోవైపు టికెట్ల చర్చలు

ఒకవైపు మా ఎన్నికలు – మరోవైపు టికెట్ల చర్చలు

ఎన్నడూ లేని విధంగా టాలీవుడ్ లో రెండు రసవత్తర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకటి మా ఎన్నికలు కాగా రెండోది ఏపిలో టికెట్ రేట్ల వ్యవహారంతో పాటు ఇటీవలి కాలంలో జరిగిన కొన్ని సినీ రాజకీయ సంఘటనలు. రెండింటికి సంబంధం లేకపోయినప్పటికీ వీటి తాలూకు వ్యవహారాలు చక్కదిద్దే పనిలో పెద్దలు చాలా బిజీగా ఉన్న మాట వాస్తవం. ముందుగా ఎలక్షన్ల సంగతి చూస్తే ఇది మా అంతర్గత వ్యవహారమని పైకి చెబుతూనే వీలు దొరికినప్పుడంతా ప్రెసిడెంట్ గా పోటీ చేస్తున్న ప్యానెల్ వర్గాలు మీడియా మైకుల ముందు ప్రెస్ మీట్లు పెడుతూనే ఉన్నాయి. ఏవో వ్యాఖ్యలు రెగ్యులర్ గా చేస్తూనే ఉన్నాయి. ఇందాక కూడా విష్ణు ఓ సమావేశం పెట్టారు.

సామాన్య జనానికి ఏ మాత్రం అవసరం లేని ఈ మా ఎలక్షన్ల గురించి మీడియాలో సైతం ఇన్నేసి కథనాలు రావడం, లైవ్ టెలికాస్ట్ లు జరగడం గత కొన్నేళ్లలో బాగా పెరిగిపోయింది. ఈసారి మంచు విష్ణు ప్రకాష్ రాజ్ ల మధ్య పోటీ ఏదో ఆషామాషీగా జరిగే సూచనలు తక్కువగానే ఉన్నాయి. నువ్వా నేనా అనే రీతిలో పరస్పర విమర్శలు చేసుకుంటూనే ఉన్నారు. అక్టోబర్ 10 ఎలక్షన్ డేట్ దాకా దీనికి శుభం కార్డు పడే సూచనలు లేనట్టే. ఇక గత కొద్దిరోజులుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ రేట్ల విషయంలో చేపట్టబోతున్న చర్యల క్రమంలో ఇవాళ ఇండస్ట్రీ పెద్దలు మరోసారి మంత్రి పేర్ని నానితో సమావేశం కావడం విశేషం.

కలెక్షన్లు, టికెట్ ధరలు, షోల అనుమతి లాంటివన్నీ మరోసారి డిస్కస్ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో భారీ బడ్జెట్ సినిమాలు విడుదలవుతున్న నేపథ్యంలో వీలైనంత త్వరగా క్లారిటీ తీసుకుంటే బెటరనే ఆలోచనలో ఈ మీటింగ్ జరుగుతోంది. ఆన్ లైన్ టికెటింగ్ వ్యవస్థకు సంబంధించిన ఏర్పాట్లు కూడా ఇందులో చర్చకు వచ్చే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్లను ఫిలిం ఛాంబర్ అతని వ్యక్తిగతమని చెప్పేసిన తరుణంలో మరోసారి ఈ విషయాన్నే స్పష్టం చేయబోతున్నట్టు తెలిసింది. దిల్ రాజు, డివివి దానయ్య, బన్నీ వాసు, సునీల్ నారంగ్, మైత్రి నవీన్ తదితరులు ఇందులో పాల్గొన్నారు. త్వరలోనే అన్నిటికి క్లారిటీ రాబోతోంది

Also Read : వివాదాస్పద గాయకుడి జీవిత కథ సినిమాగా

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి