iDreamPost

అనుమానం పెనుభూతంగా మారి.. కన్న పేగుల్ని కడతేర్చింది!

అనుమానం పెనుభూతంగా మారి..  కన్న పేగుల్ని కడతేర్చింది!

ఈ మధ్యకాలంలో అక్రమ సంబంధాల కారణంగా జరుగుతున్న నేరాల సంఖ్య బాగా పెరిగిపోయింది. పరాయి వారి మోజులో పడి.. భాగస్వామిని దారుణంగా మోసం చేస్తున్నారు. ఇంకా దారుణం ఏమిటంటే పరాయి వారితో పడక సుఖం కోసం జీవిత భాగస్వామిని హతమారుస్తున్నారు. ఇలా ఒకవైపు జరుగుతుంటే వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో మరికొన్ని ఘోరాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా తిరుపతి జిల్లాలో ఘోరం జరిగింది. ఓ మహిళ.. కన్నబిడ్డలను కడతేర్చి.. తాను ఆత్మహత్య చేసుకుంది.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…

తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలం ఈదులగుంట గ్రామానికి చెందిన బుజ్జయ్య, గంగమ్మ దంపతులు ఉన్నారు. వీరికి శివయ్య  అనే  కుమారుడు ఉండగా.. అతడు ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అయిదేళ్ల క్రితం శ్రీ సత్యసాయి జిల్లాలోని పుట్టపర్తి సమీపంలోని కొత్తచెరువుకు చెందిన నాగమ్మ కుమార్తె శివమ్మ(26)ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరి ప్రేమకు గుర్తుగా లోహితేశ్వర్(3), దేవ అనే 9 నెలల కుమారులు జన్మించారు. చాలా కాలం పాటు పిల్లలతో సంతోషంగా సాగుతున్న వీరి కాపురంలో అనుమానం అనే భూతం వచ్చి.. చేరింది.

భర్త శివయ్య తీరుపై శివమ్మకు అనుమానం పెరిగింది. మరో మహిళతో శివయ్య వివాహేతర సంబంధం కలిగి ఉన్నాడని అతడి భార్య అనుమానించింది. ఈ విషయంలో వారిద్దరి మధ్య గొడవలు జరుగుతుండేవి. తాజాగా గురువారం రాత్రి కూడా మరోసారి శివయ్య దంపతులు గొడవ పడ్డారు. ఈ క్రమంలోనే తీవ్ర మనస్తాపానికి గురైన శివమ్మ శుక్రవారం తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకుంది. అంతకంటే ముందు తన ఇద్దరు బిడ్డల మెడలకు ఉరితాడు బిగించి చంపేసింది. ఆ తరువాత తానూ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. విషయాన్ని గుర్తించిన మృతురాలి భర్త శివయ్య.. స్థానికుల సహకారంతో వారిని చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

అయితే తల్లిబిడ్డలను పరిశీలించిన వైద్యులు అప్పటికే వారు మృతి చెందినట్లు వెల్లడించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను  శ్రీకాళహస్తిలోని ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు.  మృతురాలి తల్లి నాగమ్మకు సమాచారం అందించారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే భార్యాభర్తల గొడవల్లో అభంశుభం తెలియని పిల్లలను బలిచేయడంపై అందరు ఆవేదన వ్యక్తం చేశారు. మరి.. ఈ ఘోరమైన ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి