iDreamPost

సందిగ్దంలో జనసేన, ఎటూ తేల్చూకోలేని పవన్ కళ్యాణ్‌

సందిగ్దంలో జనసేన, ఎటూ తేల్చూకోలేని పవన్ కళ్యాణ్‌

తిరుపతి ఉప ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్దమవుతున్నాయి. ఇప్పటికే అధికార, ప్రధాన ప్రతిపక్షాలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. సిట్టింగ్ సీటుని సునాయాసంగా గెలుచుకోగలమనే ధీమాలో ఉన్న వైఎస్సార్సీపీ ఈసారి కొత్త అభ్యర్థిగా విద్యావంతుడైన డాక్టర్ గురుమూర్తిని బరిలో దింపుతోంది. టీడీపీ మరోసారి మొన్నటి ఎన్నికల్లో ఓటమి పాలయిన మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మినే నమ్ముకుంది. ఇక బీజేపీ- జనసేన కూటమి మాత్రం మల్లగుల్లాలు పడుతోంది. ఎవరు పోటీ చేస్తారనే విషయంలోనే జనసేనను సందిగ్ధంలోకి నెడుతోంది. ఇప్పటికే తమ పార్టీ అభ్యర్థి పోటీ చేస్తారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు. దానికి తగ్గట్టుగా మాజీ ఐఏఎస్ దాసరి శ్రీనివాస్ నియోజకవర్గ వ్యాప్తంగా వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అదే సమయంలో తాము కూడా బరిలో దిగుతామని జనసేన ఆశిస్తోంది.

బీజేపీ అభ్యర్థి బరిలో ఉంటారని ప్రకటించి, దాదాపుగా దాసరి శ్రీనివాస్ పేరు ఖరారయిన తర్వాత కూడా జనసేన ఆశలు పెట్టుకోవడం ఆసక్తికరంగా మారుతోంది. తమను సంప్రదించకుండా ఏకపక్షంగా బీజేపీ నాయకులు పోటీపై ప్రకటన చేశారని జనసేన భావిస్తోంది. అయినప్పటికీ తమను ఖాతరు చేయని కమలనాథులకు ఖచ్చితంగా మద్ధతు ఇవ్వాల్సిన పరిస్థితుల్లో ఉన్నట్టు కనిపిస్తోంది. కానీ మేకపోతు గాంభీర్యంతో తాము కూడా బరిలో ఉంటామనే సంకేతాలను ఇస్తోంది. జనసేన కీలక నేతలు కూడా కొందరు ఇప్పటికీ తమ అభ్యర్థే పోటీ చేస్తారంటూ తిరుపతి శ్రేణులకు చెబుతుండడం విశేషమే. బీజేపీ ప్రచారంలో ఉండగా జనసేన పోటీ దాదాపు సాధ్యమయ్యే విషయం కాదన్నది అందరికీ తెలిసిందే. అయినప్పటికీ జనసేన మాత్రం తమకు ఇంకా ఆశ చావలేదని చెబుతుండడం విశేషం.

జనసేన అధినత పవన్ కళ్యాణ్‌ కూడా ప్రస్తుతం ఎటూ తేల్చుకోలేని స్థితిలో ఉన్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమ పార్టీని బీజేపీ పూర్తిగా దూరం పెట్టడం జనసైనికుల మనసుని గాయపరిచింది. చివరకు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నామినేషన్లు వేసిన తర్వాత కూడా ఉపసంహరించుకోవాల్సి రావడంతో ఆగ్రహంతో కనిపించారు. అమిత్ షా ర్యాలీలో జనసేన జెండాలు తొలగించాలని కొందరు బీజేపీ నేతలు చేసిన ప్రయత్నాలు చేసినా తమ అసంతృప్తిని అణిచిపెట్టుకుని సాగుతున్నారు. ఇలా అడుగడుగునా బీజేపీ తమను అవమానిస్తోందని పలువురు జనసేన కార్యకర్తల అభిప్రాయం. అయినప్పటికీ వారిని కాదని ముందడుగు వేయలేని పరిస్థితుల్లో ఉన్న పవన్ కళ్యాణ్‌ తీవ్రంగా సతమతమవుతున్నట్టు కనిపిస్తోంది. బీజేపీకి మద్ధతు ఇచ్చి ఎన్నికల ప్రచారంలో దిగితే ఎలాంటి ఫలితాలు వస్తాయోననే ప్రశ్న కూడా పవన్ ని వేధిస్తోంది. దాంతో చివరకు అనివార్యంగా కమలం పువ్వు వెంట సాగాల్సిన స్థితిలో జనసేన ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరమే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి