iDreamPost

సినిమాలకు మంచి రోజులు వచ్చేశాయా

సినిమాలకు మంచి రోజులు వచ్చేశాయా

రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు తెరుచుకునేందుకు ఇవాళ్టితో అన్ని అనుమతులు పూర్తయ్యాయి. కొన్ని చోట్ల 11 నుంచి తెరవబోతున్నారు. సినిమాలు లేకపోవడంతో వకీల్ సాబ్ నే మళ్ళీ వేయడానికి ప్లాన్ చేసుకున్నారు. జనం వచ్చినా రాకపోయినా కనీసం కాస్త మెయింటెనెన్స్ కోసమైనా రన్ చేయక తప్పదు. నిర్మాతల నుంచి ఇంకో మూడు నాలుగు రోజుల్లో ప్రకటనలు వస్తాయనే ఆశాభావంతో డిస్ట్రిబ్యూటర్లు ఎదురు చూస్తున్నారు. స్టార్ హీరోలవి ఇప్పటికిప్పుడు కాకపోయినా ముందు మీడియం బడ్జెట్ చిత్రాలైతే ఈ అవకాశాన్ని వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ రోజు నుంచి అనౌన్స్ మెంట్లు వచ్చే ఛాన్స్ లేకపోలేదు.

నిన్న హైదరాబాద్ లో తెలంగాణ ఫిలిం ఛాంబర్ తన సమావేశంలో ఏ నిర్మాతలు తమ సినిమాలను ఓటిటిలకు ఇవ్వొద్దని అక్టోబర్ దాకా వేచి చూసి ఒకవేళ అప్పటికి పరిస్థితిలో మార్పు రాకపోతే మీ ఇష్టమని విన్నపం చేసింది. టాప్ ప్రొడ్యూసర్లు సైతం డిజిటల్ వైపు మొగ్గు చూపడం భావ్యం కాదని పరోక్షంగా నారప్ప గురించి జరుగుతున్న ప్రచారాన్ని నేరుగా ప్రస్తావించకుండా ఇలా చెప్పుకొచ్చింది. ఒకవేళ తమ వినతిని కాదని ముందుకు వెళ్తే తమవైపు నుంచి ఏ పరిణామాలు ఉంటాయో గతంలో కొందరికి అనుభవమే అని కూడా హింట్ ఇచ్చింది. ఫైనల్ గా ఇంతకంటే ఎక్కువ మీటింగ్ లో జరిగింది ఏమి లేదు.

అక్టోబర్ దాకా ఆగండి అని చెప్పడం చూస్తే థర్డ్ వేవ్ తాలూకు సూచనలతోనే ఇలా ముందస్తుగా చెప్పారా అనే అనుమానం కూడా కలుగుతోంది. ఆంధ్రప్రదేశ్ లో ఇంకా సగం సీట్లతోనే పర్మిషన్లు ఉండటం, సెకండ్ షోలకు ఛాన్స్ లేకపోవడం లాంటి కారణాలు పెద్ద సినిమాలకు ఇబ్బందిగా మారొచ్చు. తెలంగాణలోనూ మునుపటిలాగా జనం థియేటర్లకు హాలు నిండేంత వస్తారా అంటే చెప్పలేని పరిస్థితి. సో ఏతావాతా తేలుతోంది ఏంటంటే సగటు ప్రేక్షకుడు కుటుంబంతో సహా థియేటర్ కు వచ్చే సినిమా రావాలంటే ఇంకో నెలపైగానే పట్టేలా ఉంది లవ్ స్టోరీ నెలాఖరుకు వస్తే తప్ప. అదే జరగాలని కోరుకుందాం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి