iDreamPost

సోషల్ మీడియా వినియోగంపై యువతకు పరిమితి ఉండాలి : హైకోర్టు

సోషల్ మీడియా వినియోగంపై యువతకు పరిమితి ఉండాలి : హైకోర్టు

ప్రస్తుతం చేతిలో మొబైల్.. ఇంటర్నెట్ వంటి సదుపాయాలు మస్తుగా అందుబాటులోకి వచ్చాక సోషల్ మీడియా వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. పొద్దున్న లేచిన దగ్గర నుండి రాత్రి నిద్రపోయేదాక సోషల్ మీడియాలోనే తలమునకలు అయిపోతున్నారు. ఎంటర్ టైన్ చేసే యూట్యూబ్, ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టా గ్రామ్, వాట్సప్ వంటి యాప్స్ పట్ల ఆకర్షితులవుతున్నారు. ముఖ్యంగా ఈనాటి యువతరం గురించి అయితే ఇక చెప్పనక్కర్లేదు. కొన్ని సార్లు అవసరానికి మించి సామాజిక మాధ్యమాలను వినియోగిస్తున్నారు. తాము చేస్తున్న ప్రతి పనిని అందులో పోస్టుల రూపంలో పొందు పరుస్తున్నారు. వీటి వల్ల అనార్థాలు జరిగిన సంఘటనలు ఉన్నాయి. వీటి వినియోగంపై యువతకు నియంత్రణ లేకపోవడంతో మంచి కన్నా చెడే ఎక్కువగా జరుగుతుందనేది సత్యం.

ఈ నేపథ్యంలో యువత సోషల్ మీడియా వాడకంపై కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. యువత సోషల్ మీడియాను వినియోగించడంపై పరిమితి విధించడం దేశానికి మంచిదని కోర్టు పేర్కొంది. ఓటు హక్కు పొందేందుకు వయస్సు ఉన్నట్లే.. సోషల్ మీడియాలో ప్రవేశించేందుకు ఓ వయో పరిమితి ఉండాలని తెలిపింది. అందుకు కనీస వయస్సు 18 లేదా 21 సంవత్సరాలు ఉండాలని పేర్కొంది. నిర్దిష్ట సోషల్ మీడియా ఖాతాలు, ట్వీట్లను బ్లాక్ చేయాలనే కేంద్ర ఆదేశాలను సవాలు చేస్తూ ప్రముఖ సంస్థ ఎక్స్ కార్ప్( గతంలో ట్విట్టర్) దాఖలు చేసిన రిట్ పిటిషన్ పై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది.

గతంలో కేంద్ర ప్రభుత్వంపై ఎక్స్ వేసిన పిటిషన్‌ను కొట్టి వేసిన కోర్టు.. తమ ఆదేశాలను పాటించనందుకు రూ. 50 లక్షల జరిమానా విధించింది. తాజా విచారణలో స్కూల్ కు వెళ్లే పిల్లలు సోషల్ మీడియాకు ఎంతగానో బానిసలయ్యారని, దాని వినియోగాన్నికట్టడి చేస్తేనే దేశానికి మంచిదని జస్టిస్ జి నరేందర్, విజయకుమార్ ఎ పాటిల్ లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. కొన్ని ఆన్ లైన్ గేమ్ యాక్సెస్ చేయాలంటే ఇప్పుడు యూజర్ ఆధార్, ఇతర పత్రాలను సబ్మిట్ చేయాల్సి ఉందని కేంద్ర ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలుపగా.. అటువంటి గుర్తింపు సోషల్ మీడియాకు ఎందుకు వర్తింపచేయడం లేదని ప్రశ్నించింది. కచ్చితంగా విద్యార్థులు, యువత పెడదోవ పట్టకుండా వయో పరిమితి అవసరమని సూచించింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి