Venkateswarlu
Venkateswarlu
ప్రముఖ బహుబాషా నటి అను గౌడపై హత్యాయత్నం జరిగింది. ఆమెపై ఇద్దరు వ్యక్తులు అతి దారుణంగా దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ అను ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. శివమొగ్గ జిల్లాలోని కాస్పాడి గ్రామంలో నటి అను గౌడకు పూర్వీకుల ఆస్తి ఉంది. ఆ ఆస్తికి సంబంధించిన విషయాలను అను అమ్మానాన్నలు చూసుకుంటూ ఉన్నారు. ఆమె అప్పుడప్పుడు బెంగళూరు నుంచి సొంతూరుకు వెళ్లి ఆస్తికి సంబంధించిన వ్యవహారాలను చూసుకునేది.
అయితే, ఆ విషయంలో అదే గ్రామానికి చెందిన నీలమ్మ, మోహన్‌లకు అను కుటుంబసభ్యులకు మధ్య గత కొంత కాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఎన్ని పంచాయతీలు జరిగినా ఆస్తి గొడవలు సద్దు మణగలేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా కూడా గొడవలు జరిగాయి. నీలమ్మ, మోహన్‌లు అనుపై దాడికి దిగారు. విచక్షణా రహితంగా ఆమెను చితక బాదారు. ఈ దాడిలో అను తలతో పాటు ఇతర శరీర భాగాలకు తీవ్రంగా గాయాలయ్యాయి. స్థానికులు నీలమ్మ, మోహన్‌లను అడ్డుకున్నారు. తీవ్రంగా గాయపడ్డ అనును హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
చికిత్స అనంతం నటి కోలుకున్నారు. ఇక, సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా, అను గౌడ పలు కన్నడ, తమిళ సినిమాల్లో నటించారు. కన్నడ స్టార్లు అయిన విష్ణువర్థన్, శివరాజ్ కుమార్, పునీత్ రాజ్‌కుమార్, సుదీప్ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పని చేశారు. తమిళంలో మౌన మాన నేరం, కలకల్, శంకర, ఆడాద ఆటెమల్ల వంటి చిత్రాల్లో నటించారు. మరి, ప్రముఖ నటి అను గౌడపై దాడి జరగటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.