Krishna Kowshik
ప్రేమకు హద్దులు కాదు సరిహద్దులు లేవని నిరూపిస్తున్నారు కొంత మంది ప్రేమికులు. ఇప్పుడు మరో జంట ఎల్లలు దాటి తమ ప్రేమను పండించుకుంది. అమ్మాయిది మన పొరుగు దేశం కాగా, అబ్బాయి తెలుగు వాసి
ప్రేమకు హద్దులు కాదు సరిహద్దులు లేవని నిరూపిస్తున్నారు కొంత మంది ప్రేమికులు. ఇప్పుడు మరో జంట ఎల్లలు దాటి తమ ప్రేమను పండించుకుంది. అమ్మాయిది మన పొరుగు దేశం కాగా, అబ్బాయి తెలుగు వాసి
Krishna Kowshik
అవధుల్లేని ప్రేమకు సరిహద్దులు కూడా అడ్డుకావని నిరూపిస్తున్నారు కొంత మంది యువత. జిల్లాలు, రాష్ట్రాలు, ఖండాంతరాలను దాటి పరాయి దేశ అమ్మాయిల్ని ప్రేమిస్తున్నారు ఇండియన్ పోరగాళ్లు. ఇక్కడ అబ్బాయిల ప్రేమకు ఫిదా అయిపోతున్నారు విదేశీ అమ్మాయిలు. లవ్ ప్రపోజల్ యాక్సెప్ట్ చేయడమే కాదు.. వీరి కోసం తమ దేశాన్ని, అవసరమైతే కన్నవారిని కాదని భారత్‌కు వచ్చి ప్రియుడ్ని మనువాడుతున్నారు. ఇటీవల కాలంలో ఇండియన్ అబ్బాయి.. ఫారన్ అమ్మాయి ప్రేమ కథలు, పెళ్లిళ్లు తరచుగా చూస్తూనే ఉన్నాం. అలాగే తెలుగు అబ్బాయిలు సైతం.. పరాయి దేశస్థురాలిని ప్రేమించి, పెళ్లి చేసుకుంటున్నారు.
తాజాగా తెలంగాణ అబ్బాయి.. శ్రీలంక అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. జగిత్యాలలోని భూపతిపూర్ రాయికల్‌లోని శ్రీలక్ష్మీనరసింహాస్వామి ఆలయంలో శుక్రవారం రాత్రి వీరి వివాహం జరిగింది. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు జోరిగే అశోక్. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం మూడుబొమ్మల మేడిపల్లి(పడమర)కి చెందిన అశోక్ ఉపాధి కోసం జోర్దాన్ దేశానికి వెళ్లాడు. అక్కడ శ్రీలంకకు చెందిన సమన్వి అలియాస్ మరియ పరిచయం అయ్యింది. అది ప్రేమకు దారి తీసింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే అశోక్‌కు తల్లిదండ్రులు లేకపోవడంతో తమ ప్రేమ కథను అక్కా బావ చేగంటి పూజిత, శేఖర్‌లకు చెప్పారు. వీరిద్దరూ అంగీకరించారు.
ఇక సమన్వి తల్లిదండ్రులు దుబాయ్‌లో ఉండగా.. అక్కడకు వెళ్లి తమ మనస్సులో మాట చెప్పారు. వారు అంగీకరించడంతో ఈ నెల 26న జగిత్యాలలో వీరి వివాహం జరిగింది. ఈ వివాహానికి ఇరు కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఎల్లలు దాటి వీరి ప్రేమ పండినందుకు అశోక్, సమన్వి ఆనందంలో మునిగిపోయారు. వీరి వివాహానికి జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ప్రేమకు కులం, మతంతో మాత్రమే కాదు.. దేశాలతో, సరిహద్దులతో పనిలేదని నిరూపించింది ఈ జంట. అలా రావణ లంక ప్రాంతానికి చెందిన అమ్మాయిని.. రాముడు నడయాడిన తెలంగాణ అబ్బాయి.. పెళ్లితో ఒక్కటి అయ్యారు. మరికొంత మందికి మార్గం చూపారు.