తెలంగాణ బీజేపీ నేత కిడ్నాప్‌.. ఆందోళనలో కుటుంబసభ్యులు!

తెలంగాణ బీజేపీలో కలకలం చోటుచేసుకుంది. పార్టీ కీలక నేత ఒకరు కిడ్నాప్‌కు గురయ్యారు. కొంతమంది దుండుగులు ఆయన్ని కిడ్నాప్‌ చేసి తీసుకెళ్లిపోయారు. ఎమ్మార్వో ఆఫీసులో పని ముగించుకుని బయటకు రాగా.. ఆయన్ని ఎత్తుకెళ్లిపోయారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. జనగామ జిల్లాకు చెందిన ముక్కెర తిరుపతి రెడ్డి బీజేపీలో కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. ఆయన హైదరాబాద్లోని కుషాయిగూడలో కుటుంబసభ్యులతో కలిసి నివాసం ఉంటున్నారు. శుక్రవారం ఆయన అల్వాల్‌లోని ఎమ్మార్వో ఆఫీసుకు పని మీద వెళ్లారు. పని ముగించుకుని బయటకు వచ్చిన ఆయన్ను కొంతమంది అగంతకులు చుట్టుముట్టారు.

ఆ వెంటనే తిరుపతి రెడ్డిని బంధించి అక్కడే ఉన్న వాహనంలో తీసుకుని వెళ్లిపోయారు. ఈ విషయం ఆయన భార్య సుజాతకు తెలిసింది. దీంతో ఆమె భర్త కిడ్నాప్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పని మీద ఎమ్మార్వో ఆఫీసుకు వెళ్లిన భర్త.. బయటకు వచ్చిన తర్వాత తనకు ఫోన్‌ చేయలేదని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. తమ ప్రత్యర్థులే ఆయన్ని కిడ్నాప్‌ చేసి ఉంటారని ఆరోపిస్తోంది. మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎమ్మార్వో ఆఫీసు దగ్గరలో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను కూడా పరిశీలిస్తున్నారు.

ఆయన కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. కాగా, తిరుపతి రెడ్డి కిడ్నాప్‌కు స్థల వివాదమే కారణంగా తెలుస్తోంది. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసే ఆయనకు అల్వాల్‌లో 5,929 గజాల స్థలం ఉంది. ఈ స్థలం విషయంలో ఆయనకు వేరే వ్యక్తులతో గొడవలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రత్యర్థులు ఆయన్ని కిడ్నాప్‌ చేసి ఉండొచ్చని కుటుంబసభ్యులు భావిస్తున్నారు. ఇక, తిరుపతి రెడ్డి కిడ్నాప్‌తో పార్టీలో ఒక్కసారిగా కలకలం రేగింది. ఆయన అభిమానులు, బీజేపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు. మరి, తిరుపతి రెడ్డి కిడ్నాప్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments