గుడ్ న్యూస్.. ఎయిర్ పోర్టు వరకు మెట్రో రైలు.. మరిన్ని ప్రాంతాలకు కూడా..!

హైదరాబాద్ నగరంలో ప్రయాణించాలంటే తల ప్రాణం తోకకు వస్తుందా. నగర శివార్లకు వెళ్లాలంటే.. గంటల గంటల సమయం పడుతుందా.. అయితే గుడ్ న్యూస్. నగరం నలుమూలలకు మెట్రో రైలును విస్తరిస్తోంది రేవంత్ రెడ్డి సర్కార్.

హైదరాబాద్ నగరంలో ప్రయాణించాలంటే తల ప్రాణం తోకకు వస్తుందా. నగర శివార్లకు వెళ్లాలంటే.. గంటల గంటల సమయం పడుతుందా.. అయితే గుడ్ న్యూస్. నగరం నలుమూలలకు మెట్రో రైలును విస్తరిస్తోంది రేవంత్ రెడ్డి సర్కార్.

హైదరాబాద్ మహా నగరంలోని ట్రాఫిక్ కష్టాలకు కాస్తంత ఉపశమనం కలిగిస్తోంది మెట్రో రైలు. ఆకాశ మార్గంలో నలుమూలలను కలుపుతూ పరుగులు పెడుతోంది. అయితే  కొన్ని ప్రాంతాల్లో ఇంకా ట్రాఫిక్ కష్టాలు తీరకపోవడంతో దీనిపై దృష్టా సారించింది రేవంత్ రెడ్డి సర్కార్. ఈ నేపథ్యంలో ఇటీవల రెండో దశ ప్రాజెక్టుకు ఓకే చేస్తూనే.. ఎయిర్ పోర్ట్ అలైన్ మెంట్ మారుస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు భాగ్యనగరిలో మూడు కారిడార్లు ఉన్నాయి. ఇప్పుడు తొమ్మిది కారిడార్లను ఏర్పాటు చేయనుంది. రెండో దశలో మొత్తం 116.2 కిలోమీటర్ల వరకు మెట్రో రైల్ నిర్మాణం చేపట్టనుంది. కారిడార్ -4లో భాగంగా నాగోల్-ఆర్జీఐఏ (శంషాబాద్ ఎయిర్ పోర్ట్) వరకు ఓ కారిడార్ ఉండబోతుంది. నాగోల్ నుండి శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు 36.6 కిలోమీటర్ల మార్గానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఆరాంఘర్, బెంగళూరు హైవే, కొత్త హైకోర్టు మీదుగా శంషాబాద్ విమానాశ్రయానికి మెట్రో ఖరారైంది.

ఈ లెక్కన రెండో దశలో ఫ్యూచర్ సిటీ వైపు మెట్రో రైలు పరుగులు తీయనుంది. ఈ మార్గంలో ఎయిర్ పోర్ట్ స్టేషన్‌‌తో సహా మొత్తం 24 మెట్రో స్టేషన్లు ఉండనున్నాయి. ఈ ఎయిర్ పోర్ట్ కారిడార్‌లో 1.6 కిలోమీటర్ల మెట్రో లైను భూగర్భం నుంచి వెళ్లనుంది. ఇక కారిడార్ -5లో భాగంగా రాయదుర్గ్- కోకాపేట్ నియోపోలీస్ వరకు అంటే సుమారు 11.6 కిలో మీటర్ల వరకు నిర్మాణం చేపట్టనున్నారు. బయో డైవర్సిటీ జంక్షన్, ఖాజాగూడ రోడ్, నానక్ రామ్ గూడ జంక్షన్, విప్రో సర్కిల్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్, కోకాపేట్ నియోపోలిస్ మీదుగా మెట్రో ప్రయాణించనుంది. ఇందులో దాదాపు 8 స్టేషన్లు ఉంటాయి. కారిడార్ -6లో ఎంజీబీఎస్ నుండి చాంద్రాయణ్ గుట్ట వరకు గ్రీన్ లైన్ పొడిగించనున్నారు. ఎంజీబీఎస్ నుంచి ఈ 7.5 కి.మీ లైన్, ఓల్డ్ సిటీ రోడ్ మీదుగా దారుల్‌ షిఫా జంక్షన్, శాలిబండ జంక్షన్, ఫలక్‌ నుమా మీదుగా మెట్రో రైలు పరుగులు పెట్టనుంది.

కారిడార్ 7లో మియాపూర్ నుండి పటాన్ చెరు వరకు విస్తరించనుంది. ఇది ముంబై హైవేపై రెడ్ లైన్‌కు అనుసంధానంగా నిర్మిస్తున్నారు. 13.4 కిలోమీటర్ల ఈ మార్గంలో 10 స్టేషన్లు ఉంటాయి. ఇక కారిడార్ 8లో విజయవాడకు వెళ్లే హైవేపై విస్తరించనుంది. ఎల్బీనగర్ నుండి హయత్ నగర్ వరకు 7.1 కిమీ వరకు రైలు మార్గాన్ని నిర్మించనున్నారు. ఈ కారిడార్‌లో ఆరు స్టేషన్లు రాబోతున్నాయి. ఇక కారిడార్ 9లో భాగంగా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం – ఫోర్త్ సిటీ (స్కిల్ యూనివర్సిటీ) వరకు 40 కి.మీ వరకు మెట్రో రైల్ నిర్మాణం చేయనున్నారు. 32 వేల 237 కోట్ల అంచనా వ్యయంతో రెండో దశ పనులు చేపట్టనున్నారు. రెండో దశ కూడా పూర్తయితే మొత్తం 9 కారిడార్లలో 185 కిలోమీటర్ల మెట్రో మార్గం అందుబాటులో ఉండనుంది. ఈ మేరకు కేంద్రం అనుమతుల కోసం రెండో దశ డీపీఆర్‌లను అధికారులు చకచకా పూర్తి చేస్తున్నారు. ఇవి చివరి దశకు చేరుకోనున్నాయని అధికారులు చెబుతున్నారు. దీంతో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. రెండవ దశ మెట్రో ప్రాజెక్టుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments