కోటి రూపాయలకు ఒంగోలు గిత్తలు అమ్మిన హైదరాబాద్‌ ఏసీపీ!

ప్రపంచ వ్యాప్తంగా ఒంగోలు గిత్తలకున్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు వ్యవసాయం కోసం ఈ ఎద్దుల్ని ఎక్కువగా పెంచేవారు. ఇప్పుడు వ్యవసాయంలో ఎద్దుల వాడకం చాలా వరకు తగ్గిపోయింది. ఇప్పుడు కేవలం పందేల కోసమే వాడుతున్నారు. పందేల కోసం వీటిని ప్రత్యేకంగా పెంచుతున్నారు. నెలకు లక్షలు ఖర్చు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వాటి ధర కూడా భారీ స్థాయిలో ఉంటోంది. తాజాగా, ఓ జత ఒంగోలు ఎద్దులు ఏకంగా కోటి రూపాయల ధర పలికాయి. ఆ ఎద్దులు హైదరాబాద్‌ ఏసీపీకి చెందినవి కావటం విశేషం.

ఆ పూర్తి వివరాల్లోకి వెళితే.. సుంకి సురేందర్‌ రెడ్డి హైదరాబాద్‌లో ఏసీపీగా పని చేస్తున్నారు. ఆయన వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. దీంతో ఆయనకు పశు పోషణపై మక్కువ ఎక్కువ. అందుకే సొంతూరులోని తన వ్యవసాయం క్షేత్రంలో ఎద్దులు, కోళ్లు, కుక్కలు ఇతర జంతువుల్ని పెంచుతున్నారు. ఎద్దుల్లో మేలు జాతికి చెందిన ఒంగోలు గిత్తల్ని కూడా ఆయన పెంచుతున్నారు. తాజాగా, ఆయన తన జత ఒంగోలు ఎద్దుల్ని కోటి రూపాయలకు విక్రయించారు.

ఈ ఎద్దుల్ని ఏపీలోని బాపట్ల జిల్లాలోని అనంతారం గ్రామానికి చెందిన రైతుకు అమ్మారు. ఈ ఎద్దులు అంత ధర పలకటానికి ఓ పెద్ద కారణమే ఉంది. భీముడు, అర్జునుడు అని పిలిచే ఈ ఎద్దులు పలు ఎద్దుల పందేల్లో పాల్గొని విజయం సాధించాయి. 40 పోటీల్లో పాల్గొంటే 34 సార్లు విజయం సాధించాయి. అందుకే ఆ రైతు ఇంత పెద్ద మొత్తం పెట్టి ఈ ఎద్దుల్ని కొన్నాడు. మరి, హైదరాబాద్‌ ఏసీపీ సుంకి సురేందర్‌ రెడ్డి ఎద్దులు కోటి రూపాయల ధర పలకటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments