iDreamPost
android-app
ios-app

తెలంగాణ, హైదరాబాద్‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు!

తెలంగాణ, హైదరాబాద్‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు!

రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో నిన్నటి నుంచి వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తోంది. ఇది వరకే భారత వాతావరణ శాఖ తెలంగాణకు ఆరెంజ్‌ అలెర్ట్‌ను జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌ వాతావరణ శాఖ ఓ కీలక అప్‌డేట్‌ ఇచ్చింది. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. దాదాపు మూడు,నాలుగు రోజుల పాటు ఈ వర్ష భీభత్సం కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది. అల్పపీడనం కారణంగా ఉపరితల ఆవర్తన ద్రోణి ఏర్పడటంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని స్పష్టం చేసింది.

ఈ రోజు ఖమ్మం, మహబూబ్‌నగర్‌, వరంగల్‌, హన్మకొండ, జనగాం జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ నాగరత్న తెలిపారు. దీంతో ఆయా జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌ జారీ చేశారు. కరీంనగర్‌, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ చేశారు. ఆదిలాబాద్‌, కుమ్రంభీం, ఆసిఫాబాద్‌తో పాటు పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేశారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది.

ఈ పరిస్థితులపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి మంగళవారం టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పలు జిల్లాల కలెక్టర్లతో మాట్లాడారు. అధికారులను అప్రమత్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలను ముందుగానే గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తూ ఉండాలన్నారు. కంట్రోల్‌ రూంలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో నీటిపారుదల శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.