World Cup 2023- Mohammed Shami: నేను చావడానికైనా సిద్ధం! ఆ తప్పు మాత్రం చేయను: మహ్మద్ షమీ!

నేను చావడానికైనా సిద్ధం! ఆ తప్పు మాత్రం చేయను: మహ్మద్ షమీ!

న్యూజిలాండ్ తో నాకౌట్ మ్యాచ్ లో హీరో ఎవరు అంటే అందరూ టక్కున మహ్మద్ షమీ పేరే చెప్తారు. ఒక్క మ్యాచ్ లో 7 వికెట్లు పడగొట్టి శభాష్ అనిపించాడు.

న్యూజిలాండ్ తో నాకౌట్ మ్యాచ్ లో హీరో ఎవరు అంటే అందరూ టక్కున మహ్మద్ షమీ పేరే చెప్తారు. ఒక్క మ్యాచ్ లో 7 వికెట్లు పడగొట్టి శభాష్ అనిపించాడు.

మహ్మద్ షమీ.. ప్రస్తుతం ప్రపంచక్రికెట్ లో ఈ పేరు మారుమోగుతోంది. ఒక్క మ్యాచ్ తో లెక్కలేనన్ని రికార్డులు బద్దలు కొట్టాడు. ఇప్పుడు ప్రతి ఒక్కరు షమీపై పొగడ్త వర్షం కురిపిస్తున్నారు. నిన్ను మించిన తోపు లేరు అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. అయితే ఇప్పుడు పొగిడిన చాలా నోర్లు.. ఒకప్పుడు తిట్లతో రెచ్చిపోయాయి. దేశద్రోహి షమీ అంటూ అతని వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ కామెంట్స్ చేశాయి. షమీ మాజీ భార్య చేసిన ఆరోపణలను ఆసరాగా తీసుకుని షమీని దేశద్రోహిని చేసి మాట్లాడారు. కానీ, ఎక్కడా కూడా షమీ తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. జట్టు నుంచి పక్కన పెట్టినా కూడా గుండెల నిండా దేశంపై ప్రేమను పెంచుకున్నాడు. దేశంపై తనకున్న అభిమానాన్ని ఓ ఇంటర్వ్యూలో వెల్లిబుచ్చాడు. ఆ మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

సాధారణంగా ప్రతి ఒక్కరి వ్యక్తిగత జీవితంలో ఒడిదొడుకులు, దంపతుల మధ్య పొరపొచ్చాలు ఉంటాయి. అయితే అవి ఒక స్థాయిని దాటిన తర్వాత కలిసి ఉండటం కంటే కూడా విడిపోవడమే మంచిదనే నిర్ణయానికి వస్తారు. షమీ కూడా అతని జీవితంలో అదే పని చేశాడు. తన భార్యతో కలిసి ఉండటం సాధ్యం కాదనే నిర్ణయానికి వచ్చిన తర్వాత ఆమెను దూరం పెట్టాడు. అయితే భర్త పరువును రోడ్డున పడేయాలి అనే లక్ష్యంతో ఆమె చాలానే పనులు చేసింది. కొన్ని వ్యక్తిగత ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం కూడా చేసింది. అక్కడితో ఆగకుండా అతడిపై దేశద్రోహి అనే ముద్ర వేసింది. “మీ అందరికీ తెలుసు షమీ తనని తాను చాలా పవర్ ఫుల్, పెద్ద క్రికెటర్ అని భావిస్తూ ఉంటాడు. క్రిమినల్స్, పెద్ద క్రికెటర్లు, బీసీసీఐ, బిజినెస్ మ్యాన్లు అతనికి సపోర్ట్ చేస్తున్నారు” అంటూ గతంలో చేసిన ఆరోపణలు అందరికీ తెలిసిందే. షమీపై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు సైతం వెల్లువెత్తాయి.

అదే ప్రశ్నను ఓ ఇంటర్వ్యూలో మీరు మ్యాచ్ ఫిక్సింగ్ కి పాల్పడ్డారా? అంటూ షమీని అడిగారు. అందుకు షమీ చెప్పిన సమాధానం వింటే ఇలాంటి వ్యక్తినా మనం అనుమానించాం, ఇతడినా మన మాటలతో కించపరిచాం అని పశ్చాతాపం కలగక మానదు. షమీ మాట్లాడుతూ.. “దేశానికి ద్రోహం చేయడం అనే ప్రశ్న వస్తే.. నేను ఎలాంటి వాడినో అందరికీ తెలుసు. నేను ఇప్పటివరకు ఏదైతే ఆడానో.. ఎదైతే సాధించానో అదంతా మనస్పూర్తిగా దేశం కోసం చేశాను. ఇకపై కూడా చేస్తూనే ఉంటాను. నేను అత్యధికంగా ఇండియన్ ఆర్మీని గౌరవిస్తాను. వాళ్లు 24 గంటలు దేశం బోర్డర్ లో పహారా కాస్తూ ఉంటారు. వాళ్లు దేశం కోసం ప్రాణం ఇవ్వగలిగితే మనం ఎందుకు చేయలేం. నేను ఇప్పుడే కాదు ఎప్పుడైనా దేశానికి ద్రోహం చేయాల్సి వస్తే.. దానికంటే ముందు ప్రాణాలు వదిలేయడానికే ఇష్టపడతాను” అంటూ షమీ చెప్పుకొచ్చాడు. అప్పుడు మాటల్లో చెప్పింది ఈ వరల్డ్ కప్ లో చేతల్లో చూపించాడు. హార్దిక్ పాండ్యాకి గాయం కావడంతో జట్టులోకి వచ్చాడు. అప్పటి నుంచి తాను వేసే ప్రతి బంతితో టీమిండియా విజయానికి దగ్గరవుతూ వచ్చింది.

న్యూజిలాండ్ తో జరిగిన నాకౌట్ మ్యాచ్ లో అయితే షమీ జట్టు మొత్తాన్ని ఒంటి చేత్తే విజయతీరాలకు చేర్చాడు. 9.5 ఓవర్లలో 57 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టాడు. తన కెరీర్ లోనే అత్యుత్తమ గణాంకాలను షమీ ఈ మ్యాచ్ లో నమోదు చేశాడు. ఈ ఒక్క మ్యాచ్ తో వన్డే వరల్డ్ కప్లో 50 వికెట్లు తీసుకున్న తొలి ఇండియన్ బౌలర్ గా నిలిచాడు. వన్డే వరల్డ్ కప్ చరిత్రలోనే వేగంగా 50 వికెట్లు తీసిన బౌలర్ గా షమీ హిస్టరీ క్రియేట్ చేశాడు. ఒక వన్డే మ్యాచ్ లో 7 వికెట్లు తీసుకున్న తొలి ఇండియన్ బౌలర్ గా షమీ నిలిచాడు. వన్డే వరల్డ్ కప్ హిస్టరీలో 4 సార్లు 5 వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు. ఐసీసీ నాకౌట్స్ మ్యాచ్ లో 5 వికెట్లు తీసిన తొలి ఇండియన్ బౌలర్ గా షమీ నిలిచాడు. ఇలాంటి ఎన్నో రికార్డులను తన కెరీర్ లో షమీ బద్దలు కొట్టాడు.. కొడుతూనే ఉన్నాడు. అలాంటి ఒక గొప్ప ఆటగాడిని, దేశ భక్తుడిని దేశద్రోహి అని ముద్ర వేయాలని చూసిన వాళ్లు ఇప్పటికైనా సిగ్గు పడాలి. కేవలం తమ అక్కసు తీర్చుకోవడానికి నిరాధార ఆరోపణలు చేసేముందు ఎవరిపై చేస్తున్నాం? ఎలాంటి వ్యక్తిపై చేస్తున్నాం? అనే ప్రశ్నలు గుర్తుంచుకుంటే బాగుంటుంది. మరి.. మహ్మద్ షమీ ప్రదర్శనపై అతని దేశభక్తిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments