నాడు తండ్రికి అవమానం! 27 ఏళ్లకు బదులు తీర్చుకున్న నెదర్లాండ్స్‌ బౌలర్‌

1996 వన్డే వరల్డ్‌ కప్‌ సందర్భంగా పాకిస్థాన్‌-నెదర్లాండ్స్‌ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ క్రికెటర్‌ టిమ్‌ డీ లీడే.. 19 బంతులాడి ఒక్క పరుగు కూడా చేయకుండా డకౌట్‌ అయ్యాడు. ఇది ఓ ఆటగాడికి చాలా పెద్ద అవమానం. అప్పట్లో ఈ విషయమై టిమ్‌ అనేక విమర్శలు సైతం ఎదుర్కొన్నాడు. పైగా టిమ్‌ సాధారణ బ్యాటర్‌ ఏం కాదు. మంచి బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్‌.. పైగా అతను భారీ హిట్‌లు కూడా కొట్టగలడు. కానీ, ఆ మ్యాచ్‌లో టిమ్‌ సింగిల్‌ కూడా కొట్టలేకపోయాడు. దీంతో.. పాక్‌తో జరిగిన ఆ మ్యాచ్‌ టిమ్‌కు ఓ పీడకలను మిగిల్చింది.

అయితే.. టిమ్‌ మళ్లీ ఎప్పుడు పాకిస్థాన్‌పై ఓ గొప్ప ఇన్నింగ్స్‌ బదులు తీర్చుకోలేదు. కానీ, 27 ఏళ్ల తర్వాత.. అంటే ఇప్పుడు తాజాగా టిమ్‌ డీ లీడే కుమారుడు బస్‌ డీ లీడే తన తండ్రికి జరిగిన అవమానానికి బదులు తీర్చుకున్నాడు. తాజాగా వన్డే వరల్డ్‌ కప్‌ 2023లో భాగంగా పాకిస్థాన్‌-నెదర్లాండ్స్‌ మధ్య హైదరాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియంలో మ్యాచ్‌ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో బస్‌ డీ లీడే ఏకంగా 4 వికెట్లతో సత్తా చాటాడు. ఆరంభంలోనే మూడు వికెట్లు కోల్పోయి.. తిరిగి గాడిన పడుతున్న పాక్‌ ఇన్నింగ్స్‌ను బస్‌ డీ లీడే కుప్పకూల్చాడు.

రిజ్వాన్‌, ఇఫ్తికార్, షదాబ్‌, హసన్‌ అలీలను అవుట్‌ చేసి.. పాకిస్థాన్‌ను చావు దెబ్బ కొట్టాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం 9 ఓవర్లలో 62 పరుగులిచ్చి 4 వికెట్లు తీసుకున్నాడు. పటిష్టమైన బ్యాటింగ్‌ లైనప్‌ ఉన్న పాక్‌పై 4 వికెట్లు తీయడమే కాకుండా ఆ జట్టును ఆలౌట్‌ చేయడం ద్వారా బస్‌ తన తండ్రికి 1996 వరల్డ్‌ కప్‌ సందర్భంగా పాక్‌తో మ్యాచ్‌లో జరిగిన అవమానానికి బదులు తీర్చుకున్నట్లు అయింది. కాగా, ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేయాల్సి వచ్చింది. 49 ఓవర్లలో 286 పరుగులు చేసి పాకిస్థాన్‌ ఆలౌట్‌ అయంది. బస్‌ డీ లీడే 4 వికెట్లతో లీడింగ్‌ వికెట్‌ టేకర్‌గా నిలిచాడు. మరి టిమ్‌ డీ లీడేకు జరిగిన అవమానానికి బస్‌ డీ లీడే సరైన రీతిలో బదులు తీర్చుకున్నాడని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: భారత్‌-పాక్‌ మ్యాచ్‌.. క్రికెట్‌ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్! వందే భారత్‌ రైళ్లలో..

Show comments