True Lover Telugu Movie Review & Rating: గుడ్ నైట్ మూవీతో అలరించిన హీరో మణికందన్ తమిళంలో చేసిన చిత్రం లవర్. తెలుగులో ‘ట్రూ లవర్‘ పేరుతో విడుదలైంది. మరి ఈ ట్రూలవర్ ఏ మేరకు ఆకట్టుకుందో తెలియాలంటే ఈ రివ్యూ చదవండి.
True Lover Telugu Movie Review & Rating: గుడ్ నైట్ మూవీతో అలరించిన హీరో మణికందన్ తమిళంలో చేసిన చిత్రం లవర్. తెలుగులో ‘ట్రూ లవర్‘ పేరుతో విడుదలైంది. మరి ఈ ట్రూలవర్ ఏ మేరకు ఆకట్టుకుందో తెలియాలంటే ఈ రివ్యూ చదవండి.
Krishna Kowshik
జై భీమ్, సైతాన్, గుడ్ నైట్ మూవీలతో అలరించిన నటుడు మణికందన్. జై భీమ్, సైతాన్ మూవీల్లో చిన్న పాత్రల్లో మెప్పించిన మణి.. గుడ్ నైట్ సినిమాతో హీరోగా మారాడు. ఈ చిత్రం తెలుగులో రిలీజ్ కాకపోయినా ఓటీటీలో మంచి వ్యూస్ రాబట్టుకుంది. ఈ సినిమాతో అతడికి మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పుడు తెలుగు వారిని పలకరిందుకు ట్రూ లవర్ అంటూ థియేటర్లలోకి వచ్చేశాడు. ఇది తమిళంలో ఫిబ్రవరి 4న విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. ఇందులో మ్యాడ్ మూవీలో నటించిన శ్రీ గౌరి ప్రియ హీరోయిన్. లవర్ చిత్రాన్ని బేబి నిర్మాత ఎస్కేఎన్, మారుతి తెలుగులోకి డబ్ చేసి అందిస్తున్నారు. ఫిబ్రవరి 10 నుంచి తెలుగు రాష్ట్రాల్లో సందడి చేస్తోంది. వాలంటైన్స్ డే వీక్ లో రిలీజైన ఈ ప్రేమకథా చిత్రం.. ఎలా ఉందో చూద్దాం.
అరుణ్ (మణి కందన్), దివ్య (గౌరి ప్రియ) కాలేజ్ డేస్ నుండి ప్రేమించుకుంటారు. అందరి ప్రేమలాగే.. వీరి ప్రేమ కూడా కొన్నాళ్ల పాటు అందంగా సాగిపోతుంది. అలా ఆరేళ్ల పాటు గడిచిపోతుంది. చదువు అయిపోయాక దివ్య సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తూ ఉంటుంది. అరుణ్‌కు మాత్రం వ్యాపారం చేయాలని ఉంటుంది. కేఫ్ పెట్టాలని ప్రయత్నాలు చేస్తుంటాడు. అరుణ్ పెంపకం, అభద్రత వల్ల దివ్యపై అనుమానం పడుతూ ఉంటాడు. దివ్య ఏం చేసినా, ఎక్కడికి వెళ్లాలన్నా తన అనుమతి తీసుకోవాలంటూ పట్టుబడుతుంటాడు. ఆమె అతడికి చెప్పకుండా ఏదైనా చేస్తే.. గొడవ పడుతుంటాడు. అలా పలుమార్లు గొడవలు పడి కలిసిపోతూ ఉంటారు. అయితే అరుణ్ తీరుతో విసిగిపోయిన దివ్య తన భవిష్యత్తుపై ఆందోళన చెందుతుంది. అతడిని వివాహం చేసుకుంటే.. తన జీవితం ఏంటని తికమక పడిపోతుంది. మరీ ఆమె ఏం చేసింది..? దివ్య.. అరుణ్ మళ్లీ కలిశారా..? అరుణ్ తన లక్ష్యానికి చేరుకున్నాడా అన్నది మిగిలిన కథ.
ఇప్పటి లవర్స్ మధ్య జరుగుతున్న సంఘటనలే తెరపైకి ఎక్కించాడు దర్శకుడు ప్రభురామ్ వ్యాస్. గతంలో లివిన్ అనే వెబ్ సిరీస్ చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు కూడా తనకు అచ్చొచ్చిన లవ్ స్టోరీనే ఎంచుకున్నాడు. ప్రేమికుల మధ్య సంఘర్షణ, అనుమానం.. అపార్థాలు ఈ మూవీలో చూపించాడు. అనుమానం వల్ల ప్రేమలో ఎన్ని సమస్యలు ఎదురౌతాయో చూపించడంలో సక్సెస్ అయ్యాడు. ఫస్ట్ హాఫ్‌లో అరుణ్, దివ్యల ప్రేమ కథ చాలా చక్కగా ప్రజెంట్ చేయగా.. బ్రేకప్ చెప్పుకోవడం.. తిరిగి కలిసిపోవడం నేటి తరం ప్రేమికులకు బాగా కనెక్ట్ అవుతాయి. అతడు అనుమానిస్తున్నాడని తెలిసి కూడా అతడ్ని హీరోయిన్ ఎందుకు భరిస్తుందా అన్న అనుమానం కలుగుతుంది సగటు ప్రేక్షకుడికి. వాటిని బలంగా చెప్పడంలో కాస్త తడబడ్డాడు దర్శకుడు.
సెకండాఫ్ అరుణ్ దివ్యల మధ్య రిలేషన్ షిప్లో వచ్చే సమస్యలు కనిపిస్తాయి. అరుణ్ తల్లిదండ్రుల మధ్య ఏర్పడ్డ సమస్యలను ఈ లవ్ స్టోరీతో ముడిపెట్టాడు. కథ కాస్త సాగదీతగా, కొత్తదనం కనిపించదు. కొన్ని సన్నివేశాలు బోరింగ్ అనిపిస్తుంటాయి కూడా. తల్లి, అరుణ్ మధ్య సీన్స్ బాగున్నాయి. ఇక క్లైమాక్స్ ఆకట్టుకుంటుంది. సహజ సిద్ధంగా ఉండేలా సన్నివేశాలు చిత్రీకరించినట్లు కనిపిస్తుంది. అక్కడక్కడ కొన్ని కామెడీ సీన్లు మెప్పిస్తాయి.
ఇక నటీనటులు ఎలా చేశారంటే.. మణికందన్ తన డైరెక్టింగ్, రైటింగ్ స్కిల్ కూడా నటనలోనే చూపించాడు. అనుమానపు ప్రేమికుడి పాత్రలో లీనమైపోయాడు. ఇక గౌరీ ప్రియ మంచి ఫెర్మామెన్స్ ఇచ్చింది. తెలుగులో మ్యాడ్ మూవీలో శృతి (రామ్ నితిన్ పెయిర్) పాత్రలో మెప్పించిన ఈ అమ్మడు.. ఇందులో సెటిల్డ్ ఫెర్ఫామెన్స్ సగటు అమ్మాయిగా ఆమె ఆలోచనలు కనిపిస్తుంటాయి. భవిష్యత్తుపై ఆమె గందరగోళం పడే పరిస్థితులు సహజంగా అనిపిస్తాయి. ఇక టెక్నికల్ వ్యాల్యూస్ విషయానికి వస్తే.. సినిమా బాగుంది. సీన్ రోల్డన్ మంచి బీజీఎం అందించాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి.
రేటింగ్: 2.75/5