SWAG Review: శ్రీవిష్ణు ‘స్వాగ్’ సినిమా రివ్యూ!

SWAG Movie Review, Rating In Telugu: శ్రీవిష్ణు- రీతువర్మ లీడ్ రోల్స్ ప్లే చేసిన స్వాగ్ చిత్రం థియేటర్లలో విడుదలైంది. సింగాని కలిసేందుకు తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూశారు. మరి.. ఆ ఎదురుచూపులకు స్వాగ్ సినిమా సరైన సమాధానం చెప్పిందా? ఈ రివ్యూ ద్వారా తెలుసుకోండి.

SWAG Movie Review, Rating In Telugu: శ్రీవిష్ణు- రీతువర్మ లీడ్ రోల్స్ ప్లే చేసిన స్వాగ్ చిత్రం థియేటర్లలో విడుదలైంది. సింగాని కలిసేందుకు తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూశారు. మరి.. ఆ ఎదురుచూపులకు స్వాగ్ సినిమా సరైన సమాధానం చెప్పిందా? ఈ రివ్యూ ద్వారా తెలుసుకోండి.

శ్వాగ్

04/10/2024, కామెడీ, 2h 40m U/A
U/A
  • నటినటులు:శ్రీవిష్ణు, రీతూవర్మ, మీరా జాస్మిన్, దక్ష నాగర్కర్, తదితరులు
  • దర్శకత్వం:హసిత్ గోలి
  • నిర్మాత:టీజీ విశ్వప్రసాద్
  • సంగీతం:వివేక్ సాగర్
  • సినిమాటోగ్రఫీ:వేదరామన్ సంకరన్

Rating

2.5

శ్రీవిష్ణు అంటే మినిమమ్ గ్యారంటీ హీరో అనే పేరు వచ్చేసింది. ‘సామజవరగమన’ ‘ఓం భీం బుష్’ వంటి సక్సెస్ లతో తన మార్కెట్ కూడా పెరిగింది. ఇప్పుడు హ్యాట్రిక్ లక్ష్యంగా ‘శ్వాగ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు శ్రీవిష్ణు. ప్రమోషనల్ కంటెంట్ తో బాగానే బజ్ క్రియేట్ చేసిన ఈ మూవీ రిజల్ట్ ఏంటో.. ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం.

కథ:

‘శ్వాగ్’ మూవీ.. 1550 కాలంలో మాతృస్వామ్యం, పితృస్వామ్య వ్యవస్థల మధ్య ఆధిపత్య పోరు చుట్టూ తిరుగుతుంది. భవభూతి మహారాజు(శ్రీవిష్ణు) తన సతీమణి(రీతువర్మ) వద్ద బానిసగా బతుకుతుంటాడు. ఆ రాజ్యంలో మళ్ళీ పితృస్వామ్య వ్యవస్థని తీసుకొని రావడానికి ఓ పథకం పన్నుతాడు. అక్కడ నుండి మళ్ళీ మగాళ్ల ఆధిపత్యం మొదలవుతుంది. ఇదే క్రమంలో తన రాజ్యంలో ఉన్న ఓ నపుంసకుడిని చంపేస్తాడు భవభూతి. కాలక్రమంలో ఈ పాపం శాపమై భవభూతి వంశంలో ఆడపిల్లలు లేకుండా పోతారు. ఆఖరికి మగ కవలలు పుట్టినా.. వారిలో ఒకరు నపుంసకుడిగా మారతాడు. మరొకరు తండ్రికి దూరం అవుతారు. దీంతో.. శ్వాగణిక వంశ వృక్షం యయాతి దగ్గరే ఆగిపోతుంది. ఇక వంశాన్ని వృద్ధి చేసే వారసుడు లేనిదే ఆస్తి దక్కదు. ఈ నేపథ్యంలోనే శ్వాగణిక వంశ వారసులుగా భవభూతి(శ్రీవిష్ణు), విభూతి (శ్రీవిష్ణు), యభూతి (శ్రీవిష్ణు), సింగ(శ్రీవిష్ణు), అనుభూతి(రీతూ వర్మ) తెరపైకి వస్తారు. మరి.. వీరికి శ్వాగణిక వంశానికి ఉన్న సంబంధం ఏంటి? ఎవరు నిజమైన వారసులు అన్నదే ఈ చిత్రం కథ.

విశ్లేషణ:

ఓ అద్భుతమైన కథ చెప్పాలంటే.. కథనం చాలా సరళంగా ఉండాలి. అప్పుడు మాత్రమే మనం చెప్పాలనుకున్న కథ ఆడియన్స్ వరకు రీచ్ అవుతుంది. ఇందుకు ఉదాహరణ చందమామ కథలే. ఇందులో ఒక్కో కథ.. ఎక్కువ ఊహాజనితంగా ఉంటూనే.. ఎంతో కొంత నీతిని బోధిస్తూ ఉంటాయి. అయినా గాని.. ఆ కథల్లో ఎక్కడా కన్ఫ్యూజన్ ఉండదు. చిన్నారులకి సైతం ఇట్టే అర్ధం అయిపోతాయి. కానీ.., శ్వాగ్ సినిమాలో చిక్కు ఇక్కడే వచ్చి పడింది. ఓ మంచి కథ. సమాజానికి అవసరమైన మంచి సందేశం. అద్భుతమైన మేకింగ్. అన్నీ ఉన్నా.. కథనంలో వచ్చిన కన్ఫ్యూజన్ వల్ల సినిమా అందరికీ నచ్చేలా కాకుండా.. కొందరికే నచ్చేలా తయారైంది. అలా అని శ్వాగ్ సినిమా బాగాలేదా అంటే.. అదేమీ లేదు.

సినిమా చాలా బాగుంది. కాకపోతే.. అందరికీ అర్థం అవ్వడం కష్టం అంతే. శ్వాగ్ మూవీ మొదలైన అరగంట వరకు అసలు కథ ఏమిటో అర్థం అవ్వదు. క్యారెక్టర్స్ అన్నీ ఎస్టాబ్లిష్ చేసుకుంటూ పోయాడు దర్శకుడు. కాకపోతే.. వీరందరిలో భవభూతి క్యారెక్టర్ కాస్త ఎంటర్టైన్ చేస్తుంది. ఇక ప్రీ ఇంటర్వెల్ నుండి ఇంటర్వెల్ వరకు వచ్చే ట్విస్ట్ లు ఆకట్టుకుంటాయి. కానీ.., ఇక్కడ కూడా గందరగోళం ఉంటుంది. కానీ.., ఓ మంచి ట్విస్ట్ తో ఫస్ట్ ఆఫ్ ముగియడంతో సినిమా ఓకే అనిపిస్తుంది. సినిమా సెకండాఫ్ కి వచ్చే సరికి ఎమోషనల్ టర్న్ తీసుకుంది. యభూతి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అంతా ఆకట్టుకుంటుంది. ఇక క్లైమ్యాక్స్ లో లింగ వివక్ష స్థాయిని చూపెట్టిన విధానం ఆలోచింపజేసే విధంగా సాగింది. దీంతో.. శ్వాగ్ మూవీ స్థాయి ఓ మెట్టు ఎక్కేసింది.

నటీనటుల పనితీరు, టెక్నీకల్ విభాగం:

శ్వాగ్ మూవీకి శ్రీవిష్ణు ప్రాణం పోసేశాడు. భవభూతి మహారాజు, యభూతి, భవభూతి, విభూతి, సింగ వంటి పాత్రలను అలవోకగా చేసి ఔరా అనిపించాడు. నటుడిగా ఇంతటి ప్రయత్నం చేసిన శ్రీవిష్ణు అన్నీ విధాలా అభినందనలకి అర్హుడు. రీతూ వర్మ, దక్ష, మీరా జాస్మిన్, శరణ్య ప్రదీప్ క్యారెక్టర్స్ బాగున్నాయి. ఇక రవిబాబుకి చాలా రోజుల తరువాత ఫుల్ లెంత్ రోల్ పడింది. సునీల్ ఉన్నంత సేపు ఆకట్టుకున్నాడు. టెక్నీకల్ గా మాత్రం శ్వాగ్ చాలా లోపాలు ఉన్నాయి . వివేక్ సాగర్ బ్యాగ్రౌండ్ బాగున్నా.. సాంగ్స్ అంతగా మెప్పించలేదు. విప్లవ్ ఎడిటింగ్ లో షార్ప్ నెస్ లేదు. స్క్రీన్ ప్లేలోనే కన్ఫ్యూజన్ ఉండటంతో.. విప్లవ్ చేతులు ఎత్తేసినట్టు అనిపించింది. సినిమాటోగ్రఫీ మాత్రం చక్కగా ఉంది. మేకర్ గా హసిత్ గోలీ ఓకే అనిపించుకున్నా.. కథనంపై ఇంకాస్త శ్రద్ద పెట్టి ఉంటే బాగుండేది.

ప్లస్ లు:

  • శ్రీవిష్ణు
  • సెకండ్ ఆఫ్
  • క్లైమ్యాక్స్

మైనస్ లు:

  • ఫస్ట్ ఆఫ్
  • కన్ఫ్యూజన్ స్క్రీన్ ప్లే
  • సాంగ్స్

రేటింగ్: 2.5/5

చివరి మాట: మంచి కథ.. ఇంకాస్త క్లారిటీగా చెప్పుంటే బాగుండేది.

(*ఈ రివ్యూ సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)

Show comments