నయనతార కెరీర్ లో 75వ చిత్రంగా వచ్చిన అన్నపూరణి సినిమా ఎలా ఉందో తెలియాలంటే ఈ రివ్యూని చదివేయండి.
నయనతార కెరీర్ లో 75వ చిత్రంగా వచ్చిన అన్నపూరణి సినిమా ఎలా ఉందో తెలియాలంటే ఈ రివ్యూని చదివేయండి.
Tirupathi Rao
నయనతార సినిమా అనగానే అభిమానుల్లో కొన్ని అంచనాలు ఉంటాయి. ముఖ్యంగా లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ కెరీర్ లో దూసుకుపోతోంది. అంతేకాకుండా లేడీ సూపర్ స్టార్ అనే బిరుదుని కూడా అందుకుంది. నయనతార తన కెరీర్లో 75వ చిత్రాలు పూర్తి చేసుకుంది. తన 75వ చిత్రం అన్నపూరణి ఇటీవలే విడుదలైంది. నెలరోజులు కూడా గడవకముందే ఓటీటీలోకి అడుగుపెట్టింది. ఈ మూవీ ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ సినిమా ఎలా ఉంది? అసలు అన్నపూరణి స్టోరీ ఏంటి? ప్రేక్షకులను మెప్పిస్తోందా? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఈ రివ్యూని పూర్తిగా చదివేయండి.
తమిళనాడులోని ఓ ప్రాంతంలో రంగరాజన్(అచ్యుత్ కుమార్) అనే వ్యక్తి రంగనాథునికి సేవలు చేస్తూ ఉంటాడు. రంగనాథునికి నైవేద్యం, ప్రసాదాలు చేస్తూ ఉంటాడు. ఆయనకు అన్నపూరణి(నయనతార) అనే కుమార్తె ఉంటుంది. తండ్రి వంటలు చూస్తూ పెరిగిన ఆమెకు చిన్నప్పటి నుంచే ఒక గొప్ప చెఫ్ కావాలనే కోరిక ఏర్పడుతుంది. అయితే ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి మాంసాహారాలు వండే చెఫ్ ఎలా అవుతావ్ అంటూ తండ్రి నిలదీస్తాడు. తన కోరికకు అడ్డుపడతాడు. ఎంబీఏ లాంటి కోర్సులు చేసుకోవచ్చు కదా అంటూ చెబుతాడు. అయితే అన్నపూరణికి తన స్నేహితుడు ఫర్హాన్(జై) తోడుగా నిలుస్తాడు. ఎంబీఏ, చెఫ్ రెండు కోర్సులు ఉండే కళాశాలలో చేరుతుంది. తండ్రికి తెలియకుండానే చెఫ్ అవ్వాలనుకున్న అన్నపూరణి కల నెరవేరుతుందా? తండ్రి చెప్పిన బాటలో ఎంబీఏ చేసుకుని పెళ్లి చేసుకుందా? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే మీరు ఓటీటీలో అన్నపూరణి సినిమా చూడాల్సిందే.
బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఒక అమ్మాయికి చెఫ్ అవ్వాలనే కోరిక కలగడాన్ని చాలామంది సమర్థించకపోవచ్చు. చాలామందికి అది కాస్త వింతగా కూడా అనిపించవచ్చు. అయితే ఆ పాయింట్ ని ఎవ్వరూ తప్పుబట్టడానికి లేదు. అయితే తన లక్ష్యాన్ని సాధించడం కోసం అన్నపూరణి పడిన కష్టాన్ని కళ్లకు కట్టినట్లు చూపించడంలో డైరెక్టర్ సక్సస్ అయ్యాడనే చెప్పాలి. అయితే ఈ సినిమాలో కొన్ని కాన్ ఫ్లిక్ట్స్ మిస్ అయిన భావన కలుగుతుంది. ఎక్కడన్నా ఒక వ్యక్తి అనుకున్న లక్ష్యాన్ని సాధించడం కోసం అవకాశాలు వెతుక్కోవాలి. కానీ, ఈ సినిమాలో అవకాశాలే నయనతారను వెతుక్కుంటూ వచ్చినట్లు కనిపిస్తుంది. ఈ మూవీలో చెఫ్ ఆనంద్ సుందరాజన్ పాత్రలో సత్యరాజ్ నటించడం మూవీకి బిగ్ అసెట్ అనే చెప్పాలి. తండ్రిని కాదని తన కల నెరవేర్చుకోవడానికి నయనతార పడే స్ట్రగుల్ ని ఆడియన్ ఫీలవగలుగుతారు. డైరెక్టర్ నీలేష్ కృష్ణ సినిమాలో మంచి డ్రామా, హైఇన్ టెన్స్ క్రియేట్ చేసే సీన్లను హ్యాండిల్ చేయడంలో సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. డ్రామాని చివరి వరకు ఆసక్తికరంగా కొనసాగించడంలో మంచి మార్కులే కొట్టేశాడు.
ప్రథమార్థంలో మాత్రం సాగదీత అనేది కాస్త ఇబ్బంది పెట్టచ్చు. అయితే అది కావాలని కాకపోయినా.. కథని ప్రేక్షకుడు ఓన్ చేసుకోవడం కోసం మాత్రమే చేసినట్లుగా అనిపిస్తుంది. కానీ, ఇంటర్వెల్ తర్వాత స్టోరీలో స్పీడు పెరుగుతుంది. అన్నపూరణి పాత్రకు బిగ్ సపోర్ట్ గా ఉండే ఫర్హాన్ పాత్రలో జై ఆకట్టుకుంటాడు. నయనతార కలను సాకారం చేసుకునేందుకు తన వంతు సపోర్ట్ ఇస్తూ ఉంటాడు. అయితే ఈ మూవీలో కొన్ని లాజిక్స్ మిస్ అయ్యే సీన్స్ ఉంటాయి. అందులో ప్రధానంగా టేస్టే చూడకుండా ఎలా ఉందో చెప్పేయడం ప్రేక్షకులకు కాస్త అతిగా అనిపిస్తుంది. బిర్యానీని సాంప్రదాయ వంటకంగా చూపించడం కూడా అందరూ రిసీవ్ చేసుకోలేకపోవచ్చు. కానీ, నాన్ వెజ్ లవర్స్ కు ఈ మూవీ పిచ్చ పిచ్చగా నచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. కొన్ని సీన్స్ అయితే బ్యాటిల్ గ్రౌండ్ లో ఉండే ఇన్ టెన్సిటీని కలిగిస్తాయి. ఇద్దరు చెఫ్ ల మధ్య జరిగే పోటీని ఒక యుద్ధంలా చూపిస్తారు. ఆ సీన్స్ అందరినీ అలరిస్తాయి. ఈ మూవీలో ఇంకో చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే.. ఎక్కడా కూడా అశ్లీల పదాలు, డబుల్ మీనింగ్ డైలాగ్స్, అశ్లీల దృశ్యాలు లేకుండా చాలా నీట్ గా తెరకెక్కించారు. ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా ఈ సినిమా చూడచ్చు.
ఈ మూవీ మొత్తాన్ని నయనతార తన భుజానికి ఎత్తుకుంది. తన కెరీర్ లో 75వ చిత్రం కావడంతో ఈ మూవీ మరింత స్పెషల్ అనే చెప్పాలి. తన పాత్రకు న్యాయం చేయడంలో నయన్ ఎక్కడా వెనుకాడలేదు. బాధ, సంతోషం, తపన వంటి ఎమోషన్స్ ని నయనతార ఎంతో చక్కగా పలికించింది. ఇంక చెఫ్ పాత్రలో కనిపించే సత్యరాజ్ యాక్టింగ్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. పాత్రకు సత్యరాజ్ బిగ్ అసెట్ అనే చెప్పాలి. జై కూడా ఫరహాన్ పాత్రలో ఆకట్టుకుంటాడు. ఫ్రెండ్ కన్నా ఎక్కువైన అన్నపూరణికి సాయం చేసేందుకు ఫర్హాన్ పడే తపన చూసి అందరూ కనెక్ట్ అయిపోతారు. సత్యరాజ్ కుమారుడిగా కార్తిక్ కుమార్ నటన కూడా ఆకట్టుకుంటుంది. నయనతారతో పోటీ పడే సన్నివేశాల్లో అతని నటన మెప్పిస్తుంది. మిగిలిన పాత్రలు కూడా వారి పరిధి మేరకు నటించి మెప్పించారు.
డైరెక్టర్ గా తొలి చిత్రం అయినా కూడా నీలేష్ కృష్ణ హ్యాండిల్ చేసిన విధానం మెప్పిస్తుంది. ఒక వ్యక్తి లక్ష్యం కోసం పడే కష్టాలు, చేసే పోరాటలను కళ్లకు కట్టినట్లు చూపించారు. ఎడిటింగ్ విషయంలో ప్రవీణ్ ఆంటోనీ పనితనాన్ని మెచ్చుకోవాలి. సత్యన్ సూరన్ సినిమాటోగ్రఫీ కూడా ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. తమన్ అందించిన సంగీతం అందరినీ మెప్పిస్తుంది. ముఖ్యంగా ఇన్ టెన్స్ సీన్స్ లో బీజీఎం ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటుంది. నిర్మాణ విలువలు కూడా ఎంతో బాగున్నాయి.
చివరిమాట: ఫ్యామిలీతో కలిసి సరదాగా ఒకసారి చూసేయచ్చు
రేటింగ్: 2.5/5