సీనియర్ నటుడు మమ్ముట్టి చేసిన సరికొత్త ప్రయోగం 'భ్రమయుగం'. మలయాళంలో మంచి టాక్ తెచ్చున్న ఈ చిత్రం తాజాగా తెలుగులో విడుదలైంది. మరి ఆ మూవీ ఎలా ఉందో.. ఈ రివ్యూలో చూద్దాం.
సీనియర్ నటుడు మమ్ముట్టి చేసిన సరికొత్త ప్రయోగం 'భ్రమయుగం'. మలయాళంలో మంచి టాక్ తెచ్చున్న ఈ చిత్రం తాజాగా తెలుగులో విడుదలైంది. మరి ఆ మూవీ ఎలా ఉందో.. ఈ రివ్యూలో చూద్దాం.
Somesekhar
మలయాళ సీనియర్ నటుడు మమ్ముట్టి సరికొత్త ప్రయోగాలు చేయడంలో ఎప్పుడూ ముందుంటాడు. కథ నచ్చాలేగానీ ఎలాంటి పాత్రలు చేయడానికైనా సిద్ధంగా ఉంటాడు ఈ స్టార్ హీరో. భ్రమయుగం అనే థ్రిల్లర్ మూవీతో తెలుగు ప్రేక్షకులను అలరించడానికి వచ్చాడు. ఫిబ్రవరి 14న మలయాళ వెర్షన్ విడుదల కాగా.. తాజాగా ఫిబ్రవరి 23(శుక్రవారం) తెలుగులో రిలీజ్ అయ్యింది. మరి మమ్ముట్టి సరికొత్త ప్రయోగం టాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించిందా? ఈ రివ్యూలో చూద్దాం.
కథ:
పోర్చుగీసు వాళ్లు ఇండియా బానిసల్ని దేశం దాటిస్తుండగా.. అందులో ఒక బానిస దేవన్(అర్జున్ అశోకన్) వారి నుంచి తప్పించుకుని ఓ పెద్ద భవంతిలోకి వెళ్తాడు. అంత పెద్ద ఇంట్లో తడుమన్ పోటీ(మమ్ముట్టి) అతడితో పాటుగా ఓ వంట మనిషి(సిద్దార్థ్ భరతన్) మాత్రమే ఉంటారు. అయితే రోజులు గడుస్తున్న కొద్ది తుడుమన్ మంచి వాడు కాదని, ఆ ఇంట్లో ఏదో మాయ ఉందని గ్రహిస్తాడు దేవన్. దీంతో ఆ ఇంట్లో నుంచి బయటపడటానికి ప్రయత్నిస్తాడు. కానీ ఎక్కడి వెళ్లినా.. మళ్లీ ఆ ఇంట్లోకే వచ్చి పడుతూ ఉంటాడు. అసలు తుడుమన్ ఎవరు? ఆ ఇంట్లో ఉన్న శక్తి ఏంటి? ఆ ఇంట్లో నుంచి దేవన్ బయటపడ్డాడా? లేడా? అన్నదే మిగతా కథ.
ఓ పెద్ద బంగ్లాలోకి వచ్చి పడ్డ హీరో.. అక్కడ అతడు ఎదుర్కొన్న సవాళ్లు, వాటిని ఎలా అడ్డుకున్నాడు. ఇలాంటి కథలతో ఎన్నో సినిమాలు వచ్చాయి. ఈ భ్రమయుగం కూడా అలాంటిదే. కానీ ఈ చిత్రం మాత్రం వాటికి భిన్నంగా ఓ ఊహా లోకంలోకి తీసుకెళ్తుంది. సీన్ సీన్ థియేటర్లలో ప్రేక్షకులను సీట్ ఎడ్జ్ లో కూర్చొబెట్టేలా ఉన్నాయి. భవంతిలోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి నెక్ట్స్ ఏం జరుగుతుందా? అన్న అటెన్షన్ ను క్రియేట్ చేయడంలో దర్శకుడు విజయం సాధించాడనే చెప్పాలి. ఇక తడుమన్ పాత్రలో మమ్ముట్టి విశ్వరూపం చూపాడు. ఈ పాత్రను తను తప్ప మరెవ్వరూ చేయలేరన్నంతగా జీవించేశాడు. ఒక్క నవ్వులో ఎన్నో అర్ధాలను వెతుక్కోవచ్చు. దేవన్ ఆ ఇంట్లో నుంచి బయటపడాలని చూడటం.. కానీ ఎన్ని విశ్వ ప్రయత్నాలు చేసినా.. మళ్లీ అదే ఇంట్లోకి రావడం లాంటి సీన్లు ఆశ్చర్యానికి గురిచేశాయి.
అయితే అన్ని హార్రర్ చిత్రాల్లో కనిపించే హడావిడి మాత్రం ఈ భ్రమయుగంలో కనిపించదు. అయితే ఇలాంటి మూవీలను మాత్రం ప్రేక్షకులు బాగానే ఆస్వాదిస్తారు. ప్రతీ సన్నివేశాన్ని దర్శకుడు అద్భుతంగా రాసుకున్నాడు. అయితే అక్కడక్కడ కొన్ని సీన్లు ల్యాగ్ అవ్వడంతో.. కాస్త బోరింగ్ గా అనిపిస్తుంది. కానీ సెకండాఫ్ లో స్క్రీన్ ప్లేలో వేగం పెంచాడు. కొన్ని సీన్లు లాజిక్కుతో సంబంధం లేకుండా ఉంటాయి. కానీ ఇలాంటి హర్రర్ మూవీస్ లో అవి పెద్దగా పట్టించుకోరు ప్రేక్షకులు. అయితే మూవీలో పెద్దగా ట్విస్టులు, మలుపులు లేకపోవడం నిరాశకు గురిచేస్తాయి. నటనను, సాంకేతిక వర్గం పనితీరును ప్రత్యేకంగా ఆస్వాదించే మూవీ లవర్స్ కు ఈ చిత్రం మంచి కిక్కిస్తుంది.
భ్రమయుగం మూవీకి సెంట్రాఫ్ అట్రాక్షన్ మమ్ముట్టి. తన నటనతో సినిమాను ఎక్కడికో తీసుకెళ్లాడు. ఈ ఏజ్ లో ఇలాంటి పాత్రలో చేయడం మమ్ముట్టి చేసిన సాహసమనే చెప్పాలి. కొన్ని కొన్ని సన్నివేశాల్లో ఆయన నటన చూస్తే.. ఆశ్చర్యపోకతప్పదు. ఒక్క నవ్వుతోనే హావభావాలు పలికించిన తీరు అద్భుతం. ఇక అర్జున్ అశోకన్, సిద్ధార్థ్ భరతన్ కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. టెక్నికల్ విభాగం గురించి ఎంత చెప్పినా తక్కువే. అంత అద్భుతంగా ఈ చిత్రం రావడానికి టెక్నికల్ టీమ్ పడిన కష్టం సినిమాలో ప్రతీ ఫ్రేమ్ లో కనిపిస్తుంది. ఒళ్లు గగుర్పొడిచే సన్నివేశాలు, విజువల్స్, సౌండ్ డిజైన్ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తాయి. డైరెక్టర్ రాహుల్ సదాశివన్ ప్రయోగం సక్సెస్ అయ్యిందనే చెప్పాలి. క్రిస్టో జేవియర్ సంగీతం కథకు తగ్గట్లుగా ఉంది. కెమెరామెన్ షెహ్నద్ జలాల్ భ్రమయుగానికి పెద్ద ప్లస్ పాయింట్. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్ర, రాత్రి లను చూపించిన తీరు అమోఘం. నిర్మాణ విలువలు కూడా ఎంతో బాగున్నాయి. అసలు ఇలాంటి కథను నమ్మి తీసిన ప్రొడ్యూసర్స్ కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఎడిటర్ కొన్ని సీన్స్ కత్తిరిస్తే బాగుండేది.
చివరిమాట: ‘భ్రమయుగం’ కొత్తదనం కోరుకునేవారికి కిక్కిస్తుంది
(గమనిక: ఈ రివ్యూ సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)