DJ Tillu Review : డీజే టిల్లు రివ్యూ

చిన్న సినిమానే అయినా అంచనాల విషయంలో ట్రేడ్ లోనూ ప్రేక్షకుల్లోనూ పెద్ద ఆసక్తి రేపిన సినిమా డీజే టిల్లు. భీమ్లా నాయక్ లాంటి భారీ చిత్రం నిర్మిస్తున్న బ్యానర్ కావడంతో పాటు ప్రమోషన్ విషయంలో టీమ్ తీసుకున్న శ్రద్ధ హైప్ రావడానికి దోహదపడింది. నిన్న రవితేజ ఖిలాడీకి మిక్స్డ్ రిపోర్ట్స్ రావడంతో ఎగ్జిబిటర్లు దీని మీదే నమ్మకంతో ఉన్నారు. సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొందిన ఈ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ కు తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కంపోజ్ చేయడం మరో ప్రధాన ఆకర్షణ. రెండు మూడు వారాలుగా థియేటర్లు నీరసంగా కనిపిస్తున్న నేపథ్యంలో ఈ డీజే టిల్లు తన సౌండ్ తో జనాన్ని మెప్పించాడా లేదా రివ్యూలో చూద్దాం

కథ

పెళ్లిళ్లకు ఫంక్షన్లకు డీజే సౌండ్ పెట్టి లైఫ్ ని జాలీగా గడుపుతుంటాడు బాలగంగాధర్ తిలక్ ఉరఫ్ డీజే టిల్లు(సిద్దు జొన్నలగడ్డ). ఓ రోజు పబ్బులో పాటలు పాడిన రాధికా(నేహా శెట్టి)మీద మనసు పారేసుకుంటాడు. దగ్గరయ్యే ప్రయత్నంలో త్వరగానే ప్రేమలో పడిపోతాడు. అంతా బాగుందనుకుంటున్న టైంలో అనుకోకుండా ఇద్దరూ ఓ హత్య కేసులో ఇరుక్కుంటారు. తప్పించుకునే ప్రయత్నంలో ఉండగా పోలీస్ ఇన్స్ పెక్టర్(బ్రహ్మాజీ), క్లబ్ లో ఉండే షాన్(ప్రిన్స్)తో పాటు మరికొందరు వీళ్ళ వెంటపడతాడు. సిద్ధూ జీవితంలో చిత్ర విచిత్రమైన మార్పులు చోటు చేసుకుంటాయి. అవేంటనేది స్క్రీన్ మీదే చూసి ఎంజాయ్ చేయాలి.

నటీనటులు

గత ఏడాది జాతిరత్నాలు ద్వారా నవీన్ పోలిశెట్టి లాంటి మంచి టైమింగ్ ఉన్న ఆర్టిస్టు దొరికినట్టు ఈ డీజే టిల్లు ద్వారా సిద్దు జొన్నలగడ్డ బయటికి వచ్చాడు. సిద్ధూ నటనపరంగా ఇండస్ట్రీకి కొత్త కాదు కానీ థియేట్రికల్ గా తనెప్పుడు ఈ స్థాయిలో ఎక్స్ పోజ్ కాలేదు.ఓటిటిలో వచ్చే పేరు పరిమితం. ఆ కొరత డీజే టిల్లుతో దాదాపు తీరిపోయినట్టే. ఓ మాములు కథలో హీరో క్యారెక్టర్ ని తన బాడీ లాంగ్వేజ్, ఎక్స్ ప్రెషన్లు, టైమింగ్ తో నిలబెట్టిన తీరు ఆకట్టుకుంటుంది. తెలంగాణ స్లాంగ్ ని సహజంగా పలికిన తీరు బాగా కనెక్ట్ అవుతుంది. గుర్తింపు రావడం కొంత లేట్ అయినా లేటెస్ట్ గా ఇంప్రెషన్ తెచ్చుకున్న సిద్ధూకి గ్యారెంటీ ఫ్యూచర్ ఉంది.

పాజిటివ్ నెగటివ్ అన్ని రకాల షేడ్స్ ని క్యారీ చేసిన నేహా శెట్టి రాధికా పాత్రకు పర్ఫెక్ట్ ఛాయస్. లిప్ లాక్ కిస్సులకు మొహమాటపడలేదు. బోల్డ్ నెస్ డిమాండ్ చేయలేదు కాబట్టి ఖుషిలో భూమిక లాగా నడుముతో సరిపెట్టింది. పెర్ఫార్మన్స్ పరంగా గొప్ప మార్కులు వేయలేం కానీ డీసెంట్ స్టాంప్ వేయొచ్చు. బ్రహ్మాజీకి ఈ మధ్య అన్నీ ఒకే తరహా పాత్రలు వస్తున్నాయి. ఇదీ అంతే. ప్రిన్స్ కొంచెం కొత్తగా ఉన్నాడు. నర్రా శ్రీనివాస్ కు స్పేస్ బాగానే దొరికింది. మరీ ఎక్కువ మెరుపులేం లేవు. సిద్ధూ తల్లితండ్రులు, మిగిలిన ఆర్టిస్టులు సహజంగా ఉండి తమవరకు ఇవ్వగలిగింది నీట్ గా ఇచ్చారు.

డైరెక్టర్ అండ్ టీమ్

డీజే టిల్లుని ముందుగా ఒక్క విషయంలో మెచ్చుకోవాలి. ఇందులో బూతు కంటెంట్ లేదు. డబుల్ మీనింగ్ డైలాగులు లేవు. బహుశా త్రివిక్రమ్ సలహాలు సూచనలు కారణం కావొచ్చు మూతి ముద్దు సీన్లు కూడా అవసరం లేదు కానీ అవి లేకుంటే యూత్ కి పూర్తిగా కనెక్ట్ కావేమో అనే అభిప్రాయం కావొచ్చు మరీ శృతి మించకుండా వాటిని సెట్ చేశారు. ఈ విషయంలో టిల్లు ప్రత్యేక ప్రశంస అందుకోవచ్చు. ఇక కథ గొప్పగా చెప్పుకునేది కాదు ఎన్నడూ చూడనిది కాదు.లీడ్ క్యారెక్టర్స్ సమాధి చేసిన ఒక శవం చుట్టూ పాత్రలన్నీ తిరగడం గతంలో చాలా సార్లు వచ్చిందే. ఆ కోణంలో చూస్తే స్టోరీ లైన్ లో ఎలాంటి ప్రత్యేకత లేదు.

ఉన్నదంతా ట్రీట్మెంట్ లోనే. దర్శకుడు విమల్ కృష్ణ సింపుల్ ప్లాట్ ని ఎక్కువ సాగదీయకుండా వీలైనంత టైం పాస్ చేయిస్తూ సిద్ధూ ఎనర్జీని ఎలా వాడుకోవాలా అని అలోచించి మరీ రాసుకున్నాడు. దానికి స్వయానా సిద్ధూనే రచనా సహకారం అందించడంతో న్యాచులారిటీ క్లియర్ గా స్క్రీన్ మీద కనపడింది. టిల్లుని ఫస్ట్ హాఫ్ లో ఎస్టాబ్లిష్ చేయడానికి కొంత టైం తీసున్నప్పటికీ త్వరగా మెయిన్ ప్లాట్ లోకి వెళ్లిపోవడం చాలా ప్లస్ అయ్యింది. ఎక్కడో ఇంటర్వెల్ దాకా సాగదీసి ట్విస్టు ఇవ్వకుండా హీరోయిన్ తాలూకు అసలు షేడ్ ని త్వరగా బయటపెట్టడం కూడా క్లిక్ అయ్యింది. అక్కడి నుంచి కథనం వేగంగానే పరుగులు పెట్టింది.

ఇలాంటి ఎంటర్ టైనర్స్ లో లాజిక్స్ ఉండవు. అలా అని విమల్ కృష్ణ ప్రతిదీ స్వంతంగా ఆలోచించాడని చెప్పలేం. జాతిరత్నాలు కోర్టు సీన్ ని పోలి ఉండే సన్నివేశం ఇక్కడ కూడా చూడొచ్చు. అందులో జడ్జ్ బ్రహ్మానందాన్ని ఇందులో ప్రగతితో రీ ప్లేస్ చేశారు అంతే. రెండింట్లోనూ సహజత్వానికి దూరంగా ఉండే సిల్లీనెస్ ఉంటుంది. ఆ ట్రాక్సే ఆడియన్స్ కి నచ్చి నవ్వించేశాయి. ఇలా జరగదు కదానే ప్రశ్న ఉత్పన్నం కాదు. చూసేవాడికి విసుగు వచ్చేలా స్క్రీన్ మీద సినిమా నడిస్తే అప్పుడు లాజిక్కులన్నీ బయటికి తీస్తాడు. అలా కాకుండా ఏదో సరదాగా సమయం గడిచిపోతున్నప్పుడు చూపిస్తున్న సంఘటనల తాలూకు సాధ్యాసాధ్యాలు ఆలోచించడు.

డీజె టిల్లులోనూ ల్యాగ్ లేకపోలేదు. ఫస్ట్ హాఫ్ ఉన్నంత రేసీగా రెండో సగం అనిపించదు. అంత గ్రిప్పింగ్ ఎలా నడిపించాలా అనే చిన్న అయోమయం కావొచ్చు అక్కడ కొంత నెమ్మదించింది. కానీ ప్రీ క్లైమాక్స్ ముందు నుంచి మళ్ళీ పరుగులు పెడుతుంది. పాటలు ఎక్కువ లేకపోవడం రిలీఫ్. కావాలంటే ఇంకో ఇరవై నిముషాలు పొడిగించే అవకాశం ఉన్నా విమల్ కృష్ణ అనవసరంగా ఆ రిస్క్ తీసుకోలేదు. త్వరగానే ప్యాక్ చేయడానికే ప్రాధాన్యం ఇవ్వడం కలిసి వచ్చింది. సినిమా పూర్తయ్యాక బయటికి వచ్చేటప్పుడు ఎక్కువ అసంతృప్తి లేకపోతే ఆ దర్శకుడు సక్సెస్ అయినట్టే. విమల్ కృష్ణ ఈ రకంగా చెప్పాలంటే డిస్టింక్షన్ కాదు కానీ ఫస్ట్ క్లాస్ తెచ్చుకున్నాడు.

అసలే చెప్పుకోదగ్గ సినిమాలు ఈ మధ్య రావడం లేదు. నానా వ్యయ ప్రయాసలు చేసుకుని థియేటర్ దాకా వెళ్లిన పబ్లిక్ ని రెండు గంటల పాటు కూర్చోబెట్టడం ఓటిటి ట్రెండ్ లో చాలా కష్టమైపోయింది. అందుకే కథ అంతంతంగా మాత్రంగా ఉన్న డీజే టిల్లు తన బలమంతా సంభాషణలు, హీరో టైమింగ్, ఆసక్తికరమైన మలుపులనే అస్త్రాలను వాడుకుని గట్టెక్కాడు. బాక్సాఫీస్ దగ్గర పెద్దగా పోటీ లేకపోవడం ఈ సినిమాకు కలిసి వచ్చేలా ఉంది. యూత్ కి ఈ మాత్రం ఉంటే చాలు కానీ ఫ్యామిలీ ఆడియన్స్ డీజే టిల్లు కోసం థియేటర్ దాకా వచ్చేంత మ్యాటర్ ఇందులో ఉందా అని అడిగితే కండీషన్స్ అప్లై అని చెప్పక తప్పదు. పరిమితులు దీనికీ ఉన్నాయి మరి.

శ్రీచరణ్ పాకాల అందించిన టైటిల్ సాంగ్ తో పాటు మరో రెండు పాటలు ఇప్పటికే ఆడియో పరంగా మంచి హిట్టు అందుకున్నాయి. విజువల్ గా కూడా బాగా కుదిరాయి. తమన్ ని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి తీసుకుని నిర్మాతలు చాలా తెలివైన పని చేశారు. ఇంత లైటర్ వీన్ సబ్జెక్టులో సీన్స్ ఎలివేట్ కావాలంటే అంత సులభం కాదు. ఇక్కడే తమన్ తన పనితనం చూపించాడు. మరీ అఖండ రేంజ్ లో ఊహించుకుంటే పిచ్చితనమవుతుంది కానీ టిల్లు కి సింక్ అయ్యే స్కోర్ ని పర్ఫెక్ట్ గా ఇచ్చాడు. సాయి ప్రకాష్ ఛాయాగ్రహణం, నవీన్ నూలి ఎడిటింగ్ రెండూ చక్కగా కుదిరాయి. రీజనబుల్ బడ్జెట్ లో సితార ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నాయి

ప్లస్ గా అనిపించేవి

సిద్ధూ జొన్నలగడ్డ నటన
సంభాషణలు
ఫస్ట్ హాఫ్ ట్విస్టులు
లైట్ కామెడీ

మైనస్ గా తోచేవి

కొంత సెకండ్ హాఫ్ ల్యాగ్
మరీ కొత్త కథేమీ కాదు
కొన్ని లాజిక్స్ వదిలేయడం

కంక్లూజన్

ఓ రెండు గంటలు థియేటర్ కు వెళ్లినందుకు కాసేపు నవ్వుకుని బయటికి వస్తే చాలనుకుంటే డీజే టిల్లుకి టికెట్ బుక్ చేసుకోవచ్చు. మరీ ఎక్కువ అంచనాలు పెట్టేసుకోకుండా మైండ్ బ్లోయింగ్ ట్విస్టులను ఎక్స్ పెక్ట్ చేయకుండా ఉంటామనే కండిషన్ తోనే సుమా. కాకపోతే ఈ మాత్రం సినిమా ఓటిటిలో అయితే బాగుండేది కదా అనే ఫీలింగ్ కూడా కొందరికి రావొచ్చు. కాకపోతే థియేటర్ లో డిజిటల్ లో రెండింటిలోనూ భరించలేని ఎన్నో సినిమాలను చూసి తట్టుకున్న ప్రేక్షకులకు డీజే టిల్లు ఓ మోస్తరు రిలీఫ్ లాంటిదే. మళ్ళీ 25 దాకా చెప్పుకోదగ్గ సినిమా ఏదీ లేకపోవడం ఈ మల్కాజ్ గిరి కుర్రాడిని హీరోగా నిలబెట్టేలా ఉంది

ఒక్క మాటలో – టైం పాస్ త్రిల్లు

Also Read : Khiladi Review : ఖిలాడీ రివ్యూ

Show comments