రేపు హ‌స్తిన‌కు జ‌గ‌న్.. స‌ర్వ‌త్రా ఆస‌క్తి..

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో నేడే స‌రికొత్త అధ్యాయానికి నాంది ప‌లికారు ముఖ్య‌మంత్రి వైఎస్.జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి. చెప్పిన‌ట్లుగానే వ‌డివ‌డిగా ఏర్పాటు ప్ర‌క్రియ పూర్తి చేశారు. ఇది సాహ‌సోపేత చ‌ర్య‌గా ప‌లువురు ప్ర‌ముఖులు జ‌గ‌న్ ను ప్ర‌శంసిస్తున్నారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా నూతనంగా 13 జిల్లాలను ఏర్పాటు చేయటం అభినందనీయమని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. పాలనా వికేంద్రీకరణలో భాగంగా సత్వర, సమగ్ర, సమాన, సర్వజన, సంపూర్ణ అభివృద్ధి లక్ష్యంగా చరిత్రలో నవశకానికి నాంది పలుకుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకోవటం అనుసరణీయమన్నారు. నూతన జిల్లాల ఏర్పాటుతో పునర్వ్యవస్థీకరించిన 26 జిల్లాల పాలన ప్రారంభం కావటం అన్ని ప్రాంతాల ఏకీకృత అభివృద్ధికి బాటలు వేస్తుందని విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.

ఇదిలా ఉండ‌గా.. జిల్లాల ఏర్పాటు రోజే జ‌గ‌న్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు సంబంధించిన ప్ర‌క‌ట‌న రావ‌డం రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ ఏడాది జ‌న‌వ‌రిలోనే ఆయ‌న రెండురోజుల పాటు ఢిల్లీలో ప‌ర్య‌టించారు. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ స‌హా ప‌లువురు ప్ర‌ముఖుల‌తో భేటీ అయ్యారు. అనంత‌రం రాష్ట్రానికి సంబంధించి కొన్ని కీల‌క ప్ర‌క‌ట‌న‌లు వెలువ‌డ్డాయి. కొన్ని ప్రాజెక్టులు ప్రారంభం కూడా అయ్యాయి. రెండునెల‌లు కూడా పూర్తి కాక‌ముందే.. రేపు మ‌రోసారి ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు సిద్ధం కావ‌డం.. ఆ రోజు సాయంత్ర‌మే ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ అపాయింట్మెంట్ ఇవ్వ‌డం ఆస‌క్తిని రేపుతోంది.

కొత్త జిల్లాల ఏర్పాటు గురించి వివరించి కొత్త జిల్లాల ఆధారంగా కేంద్రం నుంచి రాష్ట్రానికి అందాల్సిన సాయంపై చర్చిస్తారని తెలుస్తోంది. దీంతోపాటు రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపైనా ప్రధాని మోడీతో మాట్లాడతారని సమాచారం. కొత్త జిల్లాలు ఏర్పాటు చేశాక.. మంత్రివర్గం పునర్వ్యవస్థీకరణకు ముందు ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత ఏర్పడింది. రాష్ట్రానికి సంబంధించిన అంశాల్లో ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు, పునర్విభజన చట్టంలోని వెనుకబడిన జిల్లాలకు రావాల్సిన నిధులపై మోడితో చర్చించనున్నట్లు తెలుస్తోంది. అలాగే, కేంద్ర మంత్రి అమిత్‌షాతోనూ సీఎం భేటీకి సీఎంవో అపాయింట్‌మెంట్ కోరిన‌ట్లు స‌మాచారం. ఈ క్ర‌మంలో రేపు ఢిల్లీలో ఏం జ‌ర‌గ‌నుంది అనేది వేచి చూడాలి.

Show comments