Idream media
Idream media
మంగళవారం జరిగిన కేబినెట్ భేటీలో యాసంగి వరి కొంటున్నట్లు ప్రకటించిన తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మరో చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. ఇరవై ఆరు ఏళ్లుగా నానుతున్న సమస్యకు చెక్ పెట్టేశారు. అదే జీవో 111 ఎత్తివేత. ఈ జీవో ఎత్తేయడం మంచిదేనా, పాలకులు ఏం చెబుతున్నారు, ప్రజలు ఏం అంటున్నారు, పర్యావరణ వేత్తలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు.. ఈ అంశాలపై ఐడ్రీమ్ పోస్ట్ ఫోకస్.
హైదరాబాద్ నగరానికి తాగునీరు అందించేందుకు నిజాం పాలకుల హయాంలో జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌లను నిర్మించారు. చాలా ఏళ్లవరకు ఈ జలాశయాలే హైదరాబాద్ తాగునీటి అవసరాలు తీర్చాయి. కాగా, ఈ జలాశయాలను కలుషితం, కబ్జా కాకుండా కాపాడుకునేందుకు 1996లో అప్పటి సర్కారు జీవో 111 తీసుకొచ్చింది. దీని ప్రకారం.. ఆ పరిసర ప్రాంతాల్లోని భూమిని వ్యవసాయేతర అవసరాలకు ఉపయోగించడం నిషిద్ధం. అలాగే.. నిర్మాణాలపై కూడా ఆంక్షలు విధించారు. అయితే.. దీని వల్ల సికింద్రాబాద్ వైపు కంటోన్మెంట్ ప్రాంతం, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల పరిధిలో అభివృద్ధి విస్తరణకు, వికేంద్రీకరణకు ఆటంకం కలుగుతున్నదని పాలకులు అభిప్రాయ పడుతున్నారు. అలాగే చుట్టుపక్కల 84 గ్రామాల ప్రజలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ.. జీవో ఎత్తేయాలని ఎన్నో ఏళ్లుగా కోరుతున్నారు.
సుదీర్ఘకాలంగా వస్తున్న వినతుల మేరకు 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే జీవో 111ను రద్దు చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఆ తర్వాత ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో జీవో 111ని ప్రభుత్వం త్వరలోనే రద్దు చేస్తుందని కేసీఆర్ ప్రకటించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ జీవో అర్దరహితం అని పేర్కొన్నారు. “ఆ సమయంలో గ్రేటర్ హైదరాబాద్ ప్రాంత ప్రజల తాగునీటి అవసరాలను తీర్చిన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌లను రక్షించడానికి జీవో జారీ చేయబడింది. అయితే ప్రభుత్వం తాగునీటి సమస్యను అధిగమించడంతో ఆ జీవో నిరుపయోగంగా మారింది’ అని కేసీఆర్ అభిప్రాయం వ్యక్తం చేశారు
రెండురోజుల క్రితం జరిగిన తెలంగాణ కేబినెట్ కూడా ఇదే విధంగా అభిప్రాయపడింది. సికింద్రాబాద్ వైపు కంటోన్మెంట్ ప్రాంతం, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల పరిధిలో 111 జీవో ఉన్న కారణంగా అభివృద్ధి విస్తరణకు, వికేంద్రీకరణకు ఆటంకం కలుగుతోంది. ఇందుకోసం చీఫ్ సెక్రటరీ అధ్యక్షతన, పురపాలక శాఖ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ భాగస్వామ్యంతో కమిటీని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ కమిటీ ద్వారా రెండు జలాశయాల పరిరక్షణ కోసం నియమ నిబంధనలను, ప్రత్యేక ఉత్తర్వులను జారీ చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ రెండు జలాశయాలలోనూ మూసీ, ఈసా నదులలోనూ కాలుష్య జలాలు చేరడానికి వీలులేకుండా కొత్త జీఓ ను పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఆమోదం ద్వారా రూపొందించాలని ముఖ్యమంత్రి కమిటీని ఆదేశించారు. అనంతరం జీవోను ఎత్తేస్తున్నట్లు ప్రకటించారు.
కేసీఆర్ తాజా నిర్ణయంతో ఆ జీవో పరిధిలోని ప్రాంతాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. తమ 26 ఏళ్ల కల నెరవేరనుందని, అభివృద్ధికి అడ్డు తొలగిపోనుందని స్థానికులు చెబుతున్నారు. 84 గ్రామాల్లోని సుమారు లక్షా 32 వేల ఎకరాల భూమికి విముక్తి లభిస్తుందని అంటున్నారు. 111 జీవో ఎత్తివేతతో ఇక్కడ భూముల ధరలు పెరుగుతాయని, అభివృద్ధి జరుగుతుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ప్రభుత్వం ఈ జీవోను ఎత్తివేస్తూ తీసుకున్న నిర్ణయంతో ఈ ప్రాంత భూములన్నీ బంగారం కానున్నాయి. ధరలు రెండు, మూడు రెట్లు పెరగనున్నాయి. వాస్తవానికి ఈ ప్రాంతంలోని భూములను వ్యవసాయ రుణాలు తప్ప మిగతా అవసరాలకు తనఖా కూడా పెట్టుకోవడం లేదు. ఇపుడు జీవో ఎత్తివేతతో పరిస్థితి పూర్తిగా మారిపోనుంది. స్థానిక ప్రజల జీవన ప్రమాణాలు అనూహ్యంగా మెరుగుపడతాయి.
111 జీవో ఎత్తివేతతో ప్రభుత్వం కూడా భారీగానే లబ్ధిపొందనుంది. జీవో అమల్లో ఉన్న ఏడు మండలాల పరిధిలో ప్రభుత్వ, అసైన్డ్, భూదాన్, సీలింగ్ భూములు కలిపి 31,483 ఎకరాలు ఉన్నాయి. ఇప్పుడు వీటి విలువ అమాంతంగా పెరగనుంది. ఎంతలేదన్నా విలువ రూ.2 లక్షల కోట్లకుపైనే ఉంటుంది. ఇందులో అత్యధికంగా 18,332 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా 9235 ఎకరాల అసైన్డ్, 2660 ఎకరాల వ్యవసాయ సీలింగ్, 1256 ఎకరాల భూదాన్ భూములు ఉన్నాయి. అత్యధికంగా శంషాబాద్ మండలంలో 5233 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. తరువాత మొయినాబాద్‌లో 1546 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. వివిధ ఆర్ధిక అవసరాల కోసం ప్రభుత్వం ఇటీవల విలువైన ప్రభుత్వ భూములను వేలం వేస్తున్న విషయం తెలిసిందే. ఇపుడు ఈ జీవో సడలింపు వల్ల స్థానికులతో పాటు ప్రభుత్వానికి భారీగా లబ్ధిచేకూరనుంది.
అయితే జీవో 111ను రద్దు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకోవడాన్ని పలువురు పర్యావరణ, సామాజిక కార్యకర్తలు తప్పుబడుతున్నారు. దీనిని అప్రజాస్వామిక, చట్టవిరుద్దమైన చర్యగా వారు చెప్పారు. కేబినెట్ తీసుకున్న ఈ నిర్ణయం హైకోర్టు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ ఆదేశాలను ధిక్కరిస్తుందని వారు చెబుతున్నారు. ఈ అంశంపై తదుపరి నిర్ణయం తీసుకునే ముందు నిపుణుల కమిటీ నివేదికను సమర్పించాలని ఎన్జీటీ, హైకోర్టు స్పష్టం చేశాయని గుర్తు చేస్తున్నారు. ఇది ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయమని వారు విమర్శిస్తున్నారు. పర్యావరణంపై ప్రభావం చూపే ఏదైనా చర్య తప్పనిసరిగా ఒక నిర్దిష్ట ప్రక్రియ ద్వారా ముందుకుసాగాలని వారు కోరుతున్నారు.