ఓ సీఎం అన్నయ్యా అని పిలిచినా పట్టించుకోరు.. మరో సీఎం చెల్లెమ్మా అంటూ పరిగెత్తుకొస్తారు..!

‘‘తెలంగాణ, పుదుచ్చేరి ముఖ్యమంత్రులతో పని చేస్తూ రాటుదేలిపోయాను. చిల్లరమల్లర బెదిరింపులకు భయపడే వ్యక్తిని కాను. రెండు రాష్ట్రాల్లో రెండు రకాల ముఖ్యమంత్రులతో పనిచేయడం అరుదైన భాగ్యంగా భావిస్తున్నాను. ఓ సీఎంను నేను అన్నయ్యా అని పలకరించినా పట్టించుకోరు. మరో సీఎం ‘చెల్లెమ్మా’ అంటూ పరిగెత్తుకొస్తారు. ఇలా రెండు రకాల సీఎంల వద్ద గవర్నర్‌గా వ్యవహరించి బాగా రాటుదేలిపోయాను. ఈ అనుభవంతో మరింత ఉన్నత పదవి ఇచ్చినా సమర్థంగా నిర్వహిస్తాను’’ అని గవర్నర్‌ తమిళిసై అన్నారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన వ్యక్తికి ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టనందుకే తనపై కక్ష పెంచుకున్నారని, ఆ సీఎం చెబితే కళ్లు మూసుకుని ఫైలుపై సంతకం పెట్టే రబ్బరు స్టాంపును కాదని అన్నారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ ఇంట పెళ్లికి వెళ్తే కేంద్ర ప్రభుత్వం తనను పదవి నుంచి తొలగించనున్నదంటూ వదంతులు వ్యాపింపజేశారని, కొన్ని పత్రికలు సైతం దుష్ప్రచారం చేశాయని మండిపడ్డారు. రెండేళ్లపాటు తెలంగాణ గవర్నర్‌గా పనిచేసిన అనుభవాలతో ‘ఎ ఇయర్‌ ఆఫ్‌ పాజిటివిటీ’ పేరుతో రచించిన పుస్తకాన్ని మంగళవారం చెన్నైలోని ఓ హోటల్లో తమిళిసై ఆవిష్కరించారు. ఆమె భర్త డాక్టర్‌ సౌందరరాజన్‌ తొలి ప్రతిని స్వీకరించారు. ఈ సందర్భంగా తమిళిసై మాట్లాడుతూ తెలంగాణ రాజ్‌భవన్‌ను ప్రజాభవన్‌గా మార్చానని, ప్రజలతో సోదరిగా మెలుగుతున్నానని పేర్కొన్నారు. అధికారం చెలాయిస్తున్నానని వస్తున్న విమర్శలను పట్టించుకోనని, తానెన్నడూ అధికారం చెలాయించలేదన్నారు.

రెండు రాష్ట్రాల ప్రజలపై ప్రేమాభిమానాలను మాత్రమే ప్రదర్శిస్తున్నానని వ్యాఖ్యానించారు. సమ్మక్క జాతరకు వెళ్తే తెలంగాణ ప్రభుత్వం ప్రొటోకాల్‌ ఇవ్వలేదని, ఎస్పీ, కలెక్టర్‌ అక్కడినుంచి జారుకున్నారని తమిళిసై అన్నారు. అయినా వెనుకంజ వేయకుండా వేడుకల్లో పాల్గొన్నట్లు చెప్పారు. తాను ధైర్య సాహసాలు ప్రదర్శించే ధీర వనితనని, ఏ పదవిచ్చినా న్యాయం చేకూర్చడమే ప్రధాన విధి అని స్పష్టం చేశారు. తనకంటే సమర్థంగా పనిచేయగల గవర్నర్‌ ఎవరూ లేరని, మహిళలు తలచుకుంటే ఏవైనా సాధించి, ఉన్నత స్థితికి చేరుకోగలరన్నారు.

Show comments