Idream media
Idream media
దశాబ్దాల చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీ కేవలం మూడేళ్లలో మరుగునపడే స్థితికి చేరుకుంది. ప్రభుత్వ వ్యతిరేకత చర్యలంటూ కొన్ని అంశాలపై ప్రచారం చేస్తున్నా.. అవి ప్రజలను ఆకట్టుకోవడం లేదు. బాదుడే.. బాదుడు వంటి కార్యక్రమాలు పెద్దగా కలిసి రావడం లేదు. ప్రభుత్వ వ్యతిరేకతా ఎక్కడా కనిపించడం లేదు. దీంతో ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ రాజకీయాలు ప్రస్తుతం పండడం లేదు. ఎవరూ టీడీపీ వైపు అంతగా చూడడం లేదు. ఈ క్రమంలో వైసీపీ సర్కారు తాజాగా చేపట్టిన మంత్రివర్గ విస్తరణపై ఎవరు అసంతృప్తితో ఉన్నారా.. అని ఆ పార్టీ పెద్దలు భూతద్దం పెట్టి వెదుకుతున్నారు.
మంత్రుల జాబితా ప్రకటించిన రోజు.. ఒకటి, రెండు చోట్ల అసంతృప్తి పేరిట ఆందోళనలు కనిపించినా అవన్నీ కూడా ఓ వర్గం మీడియా సృష్టి అంటూ ఇటీవల కొందరు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు కొట్టి పారేశారు. దీంతో ఆ పార్టీ ఆశలు నీరుగారిపోయాయి. అయినప్పటికీ ఇతర పార్టీల వైపు చూసే వైసీపీ నేతల కోసం జల్లెడ పడుతున్నారు. కానీ.. ఇప్పటివరకు అయితే టీడీపీ వైపు ఎవరూ చూడడం లేదు. ఈ పరిణామాలన్నీ పార్టీ పెద్దలను కలవరపాటుకు గురి చేస్తున్నాయి. ప్రజల్లో వ్యతిరేకత లేదు.. అధికార పార్టీ నేతల్లోనూ వ్యతిరేకత కనిపించడం లేదు.. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీని క్షేత్రస్థాయిలో మళ్లీ ఎలా బలోపేతం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు.
ఇలాంటి సందర్భంలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యలు టీడీపీలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. మంత్రి పదవులు ఇవ్వలేదని దిష్టిబొమ్మలు దగ్ధం చేయడం ఇప్పుడే చూస్తున్నామంటూ తాజాగా గంటా స్పందించారు. కొద్ది కాలంగా మౌనంగా ఉన్న ఆయన అనూహ్యంగా వైసీపీపై విమర్శలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బీసీలు ఎప్పుడూ టీడీపీ పక్షమేనని గంటా ఉద్ఘాటించారు. ఎన్ని కుతంత్రాలకు పాల్పడినా టీడీపీకి బీసీలను ఎవరూ దూరం చేయలేరని వ్యాఖ్యానించారు. ఎన్నికలకు ఐదారు నెలల ముందు నుంచి పొత్తులు, సర్దుబాట్లు ఉంటాయని వెల్లడించారు. ఎన్నికల సమయం దగ్గరపడేకొద్దీ టీడీపీలోకి వలసలు ఎక్కువవుతాయని గంటా పేర్కొనడం హాట్ టాపిక్ గా మారింది. దీంతో ఊహల పల్లకిలో టీడీపీ ఊగిసలాడుతోంది.