Idream media
Idream media
అధికార, విపక్ష సభ్యుల మధ్య వాద, ప్రతివాదాలు, వాగ్వాదాలు మామూలే. కానీ.. ఒకరి తీరును మరొకరు ఎండకట్టే క్రమంలో ఒక్కోసారి చేసే కార్యక్రమాలు చర్చనీయాంశం అవుతాయి. తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇప్పుడు అలాగే అందరి దృష్టినీ ఆకర్షించారు. ప్రత్యర్థి పై మాటల యుద్ధం చేయడమే కాదు.. దేవుడా.. జేసీ ప్రభాకర్ రెడ్డికి మంచి బుద్ధి ప్రసాదించాలని మీడియా సాక్షిగా దేవుడిని వేడుకోవడం హాట్ టాపిక్ గా మారింది.
ఇటీవల జేసీ ప్రభాకర్‌రెడ్డి తరచూ విలేకర్లు, పోలీసులు, అధికార పార్టీ నాయకులపై ఆరోపణలు చేస్తూ మీడియా సమావేశాలు ఏర్పాటు చేయడాన్ని ఎమ్మెల్యే తప్పుపట్టారు. మున్సిపల్ ఎన్నికల్లో ఏడుపులు, పెడబొబ్బలు, అలవిగాని హామీలు ఇచ్చి చైర్మన్ పీఠం దక్కించుకున్నాడన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి దయ, పోలీసుల చొరవతో చైర్మన్ అయ్యాను అని చెప్పిన జేసీకి ఇప్పుడు పోలీసులు దుర్మార్గుల్లా కనిపిస్తున్నారా? అని ప్రశ్నించారు. మున్సిపల్ చైర్మన్‌గా జేసీ ప్రభాకర్ రెడ్డి తీరును ఆయన ఆక్షేపించారు. ఆయన మున్సిపాల్టీకి చైర్మన్ గా ఉన్నారా, లేక పెన్నానది ఒడ్డున ఉన్న మున్సిపల్ పార్కుకు మాత్రమే చైర్మన్‌గా ఉన్నారా? అని ఎమ్మెల్యే నిలదీశారు.
మున్సిపల్ పార్కులో ఆదివారం శ్రీరామనవమి ఉత్సవాలను వైభవంగా నిర్వహించడాన్ని జీర్ణించుకోలేని జేసీ ప్రభాకర్‌రెడ్డి.. సోమవారం సాయంత్రం పార్కులో చెత్తసేకరణ కార్యక్రమం ద్వారా ప్రజలను తప్పుదోవపట్టించే ప్రయత్నం చేశాడన్నారు. గతంలో ప్రభుత్వం బీడీ కార్మికులకు ఇచ్చిన పట్టాలను తన అనుచరుల వద్ద ఉంచుకొని, ఇప్పుడు పంపిణీ చేస్తామని చెప్పడం హాస్యాస్పదమన్నారు. స్వార్థ రాజకీయాలకోసం మాయమాటలు చెప్తున్న జేసీ ప్రభాకర్‌రెడ్డిని నమ్మొద్దని ప్రజలకు పెద్దారెడ్డి సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన పేదలను గుర్తించి పట్టాలు ఇవ్వడంతో పాటు ఇళ్లు కూడా నిర్మిస్తోందన్నారు.
అలాగే.. జేసీ సోదరులు అధికారంలో ఉన్నప్పుడు తాడిపత్రి ప్రాంతంలో చేయని దాష్టీకాలు లేవని ఎమ్మెల్యే విమర్శించారు. తాడిపత్రి ప్రాంతంలోని పోలీస్ స్టేషన్లకు వెళ్లి అధికారులను అసభ్యంగా మాట్లాడుతూ స్టేషన్లకు తాళాలు వేసిన సంస్కృతి జేసీ సోదరులదేనన్నారు. దౌర్జన్యంగా షాపులను మూసి వేయించడం, మట్కా కేంద్రాలు నిర్వహించడం లాంటివి చేసిన జేసీ ప్రభాకర్‌రెడ్డి.. మీడియా ముందుకొచ్చి అన్యాయాలు, అక్రమాలపై మాట్లాడడం సిగ్గుచేటన్నారు. అన్యాయాలు, అక్రమాలపైన పోలీసు స్టేషన్‌సర్కిల్‌లో బహిరంగ చర్చకు సిద్ధమా అని ఎమ్మెల్యే సవాల్ విసిరారు.