Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి, సంక్షేమాన్ని రెండుకళ్లుగా భావిస్తున్నారు.నిత్యం అధికారులతో సమీక్షిస్తూ పథకాల అమలు, అభివృద్ధి పనుల తీరును పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడ, ఏ విధమైన ఇబ్బందులు ఎదురవుతున్నా వాటి పరిష్కారానికి నేరుగా దృష్టి పెడుతున్నారు. అలాగే పాలనాపరమైన అడ్డంకులను ఎప్పటికప్పుడు తొలగిస్తున్నారు. మరోవైపు కేంద్ర పెద్దలతో కూడా చర్చిస్తూ రాష్ట్రాభివృద్ధికి అక్కడి నుంచి రావాల్సిన నిధులు, చేయాల్సిన విధులను ఎప్పటికప్పుడు గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం కొద్ది రోజులుగా జగన్ జిల్లా పర్యటనలతో బిజీ బిజీగా గడుపుతున్నారు. మంత్రి వర్గ విస్తరణకు ముందు ఢిల్లీ లో పర్యటించిన ఆయన.. ఆ తర్వాత జిల్లాల్లో తిరుగుతూ అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నారు.
మంత్రివర్గ విస్తరణ అనంతరం తొలిసారిగా జగన్ విశాఖ జిల్లాకు వెళ్లారు. అక్కడి ఓ ప్రైవేటు రిసార్ట్స్ లో ప్రకృతి చికిత్స చేయించుకుంటున్న హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. అనంతరం ఈ నెల 21న గురువారం తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించారు. బిక్కవోలు మండలం బలభద్రపురంలో గ్రాసిం ఇండస్ట్రీ కోర్ ఆల్కలీ యూనిట్‌ను బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లాతో కలిసి ప్రారంభించారు. గత ప్రభుత్వం ఎన్నికలకు రెండు నెలల ముందు గ్రాసిమ్ సంస్థకు ప్రాజెక్ట్ అప్పగించింది. గత ప్రభుత్వం సమస్యలు పరిష్కారం కాకుండా సంతకాలు చేసింది. వైసీపీ ప్రభుత్వం వచ్చాక అన్ని సమస్యలను పరిష్కరించి కంపెనీ పనులు ముందుకు సాగేలా చేసింది. ప్రారంభోత్సవం సందర్భంగా జగన్ మాట్లాడుతూ అవరోధాలను ఒక్కొక్కటిగా తొలగించి ప్రాజెక్టును నెలకొల్పామని అన్నారు.
ఆ మర్నాడే అంటే నేడు జగన్ ఒంగోలు లో పర్యటించనున్నారు. ఒంగోలు వేదికగా వైఎస్సార్ సున్నావడ్డీ పథకం మూడో విడత పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను వివరిస్తూ.. విపక్షాల ప్రచారాన్ని తిప్పికొట్టనున్నారు. అనంతరం వైఎస్సార్ సున్నావడ్డీ మూడో విడత పంపిణీ రాష్ట్రస్ధాయి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఆ కార్యక్రమం అనంతరం బందర్ రోడ్‌లోని రవిప్రియ మాల్ అధినేత కంది రవిశంకర్ నివాసానికి వెళ్లి, వారి కుటుంబంలో ఇటీవల వివాహమైన నూతన వధూవరులను ఆశీర్వదించనున్నట్లు తెలుస్తోంది.
ప్రభుత్వ, వ్యక్తిగత కార్యక్రమాలే కాకుండా.. స్థానిక నేతలను కూడా జగన్ కలుసుకోనున్నారు. ఏబీఎం గ్రౌండ్‌లోనే స్థానిక నాయకులతో, అధికారులతో పరిచయ కార్యక్రమం ఏర్పాటు చేశారు. వైఎస్సార్ సున్నావడ్డీ మూడో విడత పంపిణీ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 2021–22 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి స్వయం సహాయక సంఘాలకు సున్నా వడ్డీ ల్యాప్‌టాప్‌లో బటన్ నొక్కటం ద్వారా నేరుగా డ్వాక్రా గ్రూపుల బ్యాంకు అకౌంట్లకు జమ చేయనున్నారు జగన్.
కొత్తగా మంత్రి వర్గ విస్తరణ.. అనంతరం వరుసగా జిల్లాల పర్యటనలు విపక్షాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. జగన్ దూకుడుకు బిత్తరపోతున్నాయి. అధికారిక, రాజకీయ కార్యకలాపాలు రెండింటిలోనూ దూసుకెళ్తుండడంతో జగన్ వ్యూహం వారికి అంతుపట్టడం లేదు.