Idream media
Idream media
సస్యశ్యామల ఆంధ్రప్రదేశ్‌కు వరం పోలవరం. కీలకమైన ఈ ప్రాజెక్టుపై ఏపీ భవిష్యత్ ఆధారపడి ఉంది. అందుకే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రోజునే ఈ ప్రాజెక్టు పూర్తి తన ప్రధాన లక్ష్యం అని జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఫలానా సమయానికి పోలవరం పూర్తిచేస్తానని మాటిచ్చి మరీ ప్రాజెక్టు పనులను పరుగులు పెట్టిస్తున్నారు. పనులకు అడ్డంకులు కలగకుండా సీజన్, సమయానుగుణంగా దిశానిర్దేశం చేస్తూ ప్రాజెక్టు పనులు ముందుకుసాగేలా చూస్తున్నారు. ఇప్పటికే ప్రాజెక్టు నిర్మాణాన్ని సుమారు ఎనభై శాతం పూర్తి చేశారు. 2023 జూన్ నాటికి పూర్తి చేసేలా యుద్ధప్రాతిపదికన పనులు చేపడుతున్నారు. కానీ.. వైసీపీ ప్రభుత్వ హయాంలో పనుల జరగడం లేదని విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. ప్రాజెక్టు ఆలస్యానికి ఏపీ సర్కారే కారణమనే వాదనను తెస్తున్నారు. ఈ వాదనలను తిప్పికొడుతూ ఏపీ ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు వాస్తవాలను వివరించే ప్రయత్నం చేశారు.
ఆగే ప్రసక్తే లేదు..
చంద్రబాబు హయాంలో ప్రాధాన్యత ఉన్న కీలక పనులేవీ చేయలేదు. టీడీపీ పాలనలో కాంట్రాక్టర్లకు బాగా మిగిలే పనులు మాత్రమే చేశారు. వైసీపీ ప్రభుత్వంలో కీలకమైన పనులే టేకప్ చేశాం. రెండుసార్లు కోవిడ్ వచ్చినా పనులు ఆగకుండా చిత్తశుద్ధితో పనిచేశాం అన్నారు అంబటి. ఈ జలయజ్ఞాన్ని వైఎస్సార్ ప్రారంభించారు. ఆగే ప్రసక్తే లేదు. మేము అధికారంలోకి వచ్చాక ప్రాధాన్యత క్రమంలో 6 ప్రాజెక్టులను ఎంచుకున్నాం. తక్కువ ఖర్చుతో వాటిని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఉపద్రవం కోవిడ్ వచ్చింది.. తేదీలు కొంచెం అటు ఇటు అవ్వొచ్చు. 14 ఏళ్ళు సీఎంగా ఉన్నప్పటికీ.. చంద్రబాబు తన చరిత్రలో ఒక్క ప్రాజెక్టుకైనా రిబ్బన్ కట్ చేశారా..? అని అంబటి ప్రశ్నించారు.
అందుకు కారణం ఆయనే..
పోలవరం ఆలస్యం కావడానికీ కారణం చంద్రబాబు. టీడీపీ చేసిన పాపం వల్ల డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. ప్రపంచంలో డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడం ఎక్కడా లేదు. దీనివల్ల రూ. 400 కోట్లు వృధా అయ్యింది.. మళ్లీ కట్టాలంటే అదనపు ఖర్చు. దాని నుంచి నీటిని తోడి మళ్లీ కట్టాలంటే రూ. 2 వేల కోట్లు కావాలి.. ఈ పాపం టీడీపీది కాదా..? అన్నారు. చంద్రబాబు చేసిన తప్పుల వల్ల నిపుణుల కమిటీ వచ్చి రీ డిజైన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.
చంద్రబాబుకు సవాల్..
గత రెండేళ్లలో అందరికీ సాగు నీరు అందజేశాం. నీరు చెట్టు కింద ఎన్ని నిధులు కాజేశారో అందరికీ తెలుసు. నెల్లూరు సంగం బ్యారేజీ పూర్తిచేసి జులైలో రైతులకు అందజేసేలా ప్రయత్నం చేస్తున్నాం. అవుకు రెండో టన్నెల్లో చంద్రబాబు సగం పనులు వదిలేసారు. అవుకు టన్నెలును మా ప్రభుత్వం చిత్తశుద్ధితో పూర్తి చేస్తున్నాం. పోలవరం నుంచి శాస్త్రీయంగా రెండు దశల్లో నీరు ఇస్తారు. ముందు కనీస నిల్వ సామర్ధ్యం నుంచి నీళ్ళు ఇస్తారు.. ఆ తర్వాత పెంచుకుంటూ వెళ్తారు. ఎవరు అపరిచితుడో అందరికీ తెలుసు. స్పీల్ వే నష్టంపై చంద్రబాబు చర్చకు సిద్ధమా..? అని సవాల్ విసిరారు మంత్రి అంబటి రాంబాబు.