Idream media
Idream media
కేసీఆర్ సర్కారుపై గవర్నర్ తమిళి సై తీవ్రమైన అసహనంతో ఉన్నారు. తనను పదే పదే అవమానిస్తున్నారని ఆమె ఉద్వేగానికి లోనయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో తన బాధను వెలిబుచ్చడానికి తమిళి సై మోడీని కలిసిన విషయం తెలిసిందే. అయితే.. ఈ సందర్భంగా కేసీఆర్ వ్యవహార శైలిపై ఫిర్యాదు చేయడమే కాకుండా సర్కారుకు వ్యతిరేకంగా తమిళి సై ఓ నివేదిక ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఆ నివేదికలో టీఆర్‌ఎస్ సర్కారుపై తెలంగాణ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, అఖిల భారత సర్వీసుల అధికారుల వ్యవహారశైలి సరిగాలేదనే విధంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
కేసీఆర్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు గవర్నర్ తమిళి సై చెప్పినట్లు తెలుస్తోంది. తనను అవమానించిన తీరును కూడా ఆమె వివరించినట్లు సమాచారం. ప్రభుత్వ పనితీరు, అఖిల భారత అధికారుల వ్యవహార శైలి, శాంతి భద్రతలపై కీలక నివేదిక సమర్పించినట్లు తెలిసింది. గవర్నర్ నివేదికను పరిశీలించిన మోడీ, అమిత్ షా ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. ముఖ్యంగా గవర్నర్‌ను అవమానిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. నివేదిక ఆధారంగా ఏం చర్యలు తీసుకోవాలనే విషయాన్ని పరిశీలిస్తామని అమిత్ షా చెప్పినట్లు సమాచారం.
రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్‌ల వ్యవహారశైలిని గవర్నర్ తీవ్రంగా ఆక్షేపించినట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నట్లు ప్రచారంలో ఉంది. ప్రొటోకాల్‌ను పాటించకపోవడం,రాజ్‌భవన్ నిర్వహించే అధికారిక కార్యక్రమాలకు రాకపోవడం, జిల్లాల్లో గవర్నర్ పర్యటనల సమయంలో కలెక్టర్, ఎస్పీలు పాల్గొనక పోవడం వంటి వివరాలన్నింటినీ నివేదికలో పొందుపర్చారని తెలిసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ కూడా పద్ధతులను పాటించడం లేదని ఫిర్యాదు చేసినట్లు సమాచారం. డ్రగ్స్ అంశంపైనా నివేదిక ఇచ్చినట్లు తెలిసింది.
ప్రధానంగా విద్యా, వైద్య రంగాలను రాష్ట్ర ప్రభుత్వం విస్మరిస్తోందంటూ గవర్నర్ నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. ఇటీవల ఎంజీఎం ఆస్పత్రిలో ఎలుకలు కొరికి వ్యక్తి మరణించిన విషయాన్నీ ప్రస్తావించినట్లు తెలిసింది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కనీస మౌలిక సదుపాయాలు లేవని, ఆ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టడం లేదని వివరించడంతో పాటు ఆయా ఆస్పత్రులను సందర్శించినప్పుడు తనకు ఎదురైన అనుభవాలనూ నివేదికలో పొందుపర్చినట్లు సమాచారం. వైద్య శాఖలో భారీ సంఖ్యలో ఉన్న ఖాళీలను భర్తీ చేయడంలో ప్రభుత్వం తాత్సారం చేస్తోందని.. ఆస్పత్రులను మెరుగుపర్చడానికి, మౌలిక సదుపాయాల కల్పనకు ఎన్ని సూచనలు చేసినా పట్టించుకోవడం లేదని పేర్కొన్నట్లు సమాచారం. మరోవైపు, రాష్ట్ర ఉన్నత విద్యా వ్యవస్థ పూర్తి స్థాయిలో నిర్వీర్యమైందని నివేదికలో ప్రస్తావించినట్లు తెలిసింది. నిజానిజాలు తేలాల్సి ఉంది.