ఆ ప్రచారం అవాస్తవం.. జీవితకాలం జగన్‌ సైనికుడినే : మాజీ మంత్రి

ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి కొత్త మంత్రివర్గం ప్రకటించగానే..అసంతృప్తి జ్వాలలు అంటూ ఓ వర్గం మీడియా లో వార్తలు వెల్లువెత్తాయి. ఆ జాబితాలో ఉన్నవారిని, లేనివారిని కూడా చాలామందిని చేర్చేసి ప్రచారం సాగించాయి. అనివార్య కారణాల వల్ల మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకాలేని నేతలపై కూడా కథనాలు వెలువరించారు. జగన్‌పై అసంతృప్తితో కార్యక్రమానికి రాలేదని ఆరోపణలు గుప్పించాయి. అదే వరుసలో మాజీ మంత్రి, నెల్లూరు నగర ఎమ్మెల్యే పి.అనిల్‌కుమార్‌ యాదవ్‌ గురించి కూడా ప్రసారాలు వచ్చాయి. ఇలాంటి వార్తలను ఆయనతో పాటు మరికొందరు మాజీ మంత్రులు ఖండించారు.

మంత్రి పదవి నుంచి తొలగించినందుకు తనకు బాధలేదని, జగన్‌ ముందే చెప్పారని, జిల్లాలో సీఎం ఏ బాధ్యతలు అప్పగిస్తే వాటిని నెరవేర్చేందుకు సిద్ధంగా ఉన్నానని పి.అనిల్‌కుమార్‌ యాదవ్‌ చెప్పారు. మీడియాలో జరిగిన ప్రచారం అవాస్తవమన్నారు. మంత్రి పదవి తీసేశారనే బాధతోనో.. అసంతృప్తితోనో నేను ఆగలేదు. ఆరోగ్య పరీక్షలు ఉన్నందున చెన్నైలో ఉన్నా. నా జీవితకాలం జగనన్న సైనికుడినే’ అని ఆయన వెల్లడించారు. 2024 ఎన్నికల్లో పార్టీని గెలిపించి జగన్‌ను మళ్లీ సీఎం చేసి తాము మంత్రులవుతామని ఆశాభావం వ్యక్తం చేశారు.

మంత్రి పదవి తొలగించడంతో అనిల్‌ డల్‌ అయ్యాడంటూ కొంతమంది మాట్లాడుతున్నారని, తనకు పదవితో పనిలేదని, ఎప్పటికీ తన వాయిస్‌ తగ్గదని, డబుల్‌ ఫోర్స్‌తో దూసుకెళ్తానని చెప్పారు. మంత్రి కాకాణి సేవలు తన నియోజకవర్గంలో అవసరమైతే ఆహ్వానిస్తానని చెప్పారు. ‘ఇచ్చింది తిరిగి ఇవ్వకుండా దాచుకునే అలవాటు నాకు లేదు. నేను మంత్రిగా ఉన్న మూడేళ్లలో కాకాణి అన్న నాపై చూపిన ప్రేమ.. నాకిచ్చిన సహకారం.. వాత్సల్యానికి రెండింతలు తిరిగి ఇస్తా.’ అని చెప్పారు.

Show comments