Idream media
Idream media
రాజ్యసభలో బీజేపీ మరింత బలాన్ని పుంజుకుంది. తాజాగా ఆరు రాష్ట్రాల్లో 13 సీట్లకు జరిగిన ఎన్నికల్లో 5 సీట్లను గెలుచుకోవడంతో సభలో 97గా ఉన్న బీజేపీ ఎంపీల సంఖ్య 102కు చేరింది. ఇది ఆ పార్టీ చరిత్రలోనే తొలిసారి కావడం విశేషం. 1990లో కాంగ్రెస్ రాజ్యసభలో 108 సీట్లు దక్కించుకుంది. ఆ తర్వాత ఇన్నేళ్లకు మళ్లీ బీజేపీ 100సీట్ల ఘనతను సాధించి చరిత్ర సృష్టించింది. మొత్తం ఆరు రాష్ట్రాల్లో ఎన్నికలకు గాను.. అసోంలో 2, త్రిపురలో ఒకటి, నాగాలాండ్, హిమాచల్ ప్రదేశ్‌లలో చెరొక సీటును బీజేపీ దక్కించుకోగలిగింది.
ఇక పంజాబ్‌లో మొత్తం ఐదు సీట్లనూ ఆమ్ ఆద్మీ పార్టీయే గెలుచుకోవడం గమనార్హం. గెలుపు లెక్కల్ని రాజ్యసభ వెబ్‌సైట్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. 2014లో రాజ్యసభలో బీజేపీకి 55 సభ్యులున్నారు. అప్పటి నుంచి ఆ పార్టీ నేతల సంఖ్య సభలో క్రమేపీ పెరుగుతూ ఇప్పుడు 100కు చేరింది. త్వరలోనే మరో 52 సీట్లకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ఈ సంఖ్య మారొచ్చని.. పరిశీలకులు పేర్కొంటున్నారు. ఇక ఉత్తరప్రదేశ్‌లోనూ 11 సీట్లకు గాను ఎనిమిదింటిలో బీజేపీ గెలవచ్చని అంచనా వేస్తున్నారు. రాజ్యసభ నుంచి పదవీ విరమణ చేస్తున్న 11మందిలో ఐదుగురు బీజేపీకి చెందినవారుండటం గమనార్హం.
అసోం నుంచి ఎన్‌డీఏ కూటమి తరపున ఇద్దరు ఎంపీలు రాజ్యసభకు ఎన్నికయ్యారు. వారిలో ఒకరు బీజేపీకి చెందిన పబిత్ర మార్గరీటా కాగా మరొకరు యూపీపీఎల్ పార్టీకి చెందిన ర్వంగ్రా నార్జరీ. రాష్ట్రం నుంచి సిటింగ్ ఎంపీలుగా ఉన్న కాంగ్రెస్ నేతలు రిపున్ బోరా, రనీ నరా ఓటమిపాలయ్యారు. గురువారం జరిగిన ఎన్నికల లెక్కింపు.. అదేరోజు రాత్రి 10.30 గంటలకు మొదలై అర్ధరాత్రి దాటేవరకూ కొనసాగింది. మార్గరీటాకు 46 ఓట్లు రాగా. నార్జరీకి 44 ఓట్లు లభించాయి. 126మంది సభ్యుల రాష్ట్ర అసెంబ్లీలో అందరూ తమ ఓటును వినియోగించుకున్నారు.
ఎన్‌డీఏకు అసోం అసెంబ్లీలో 79సీట్లు ఉన్నాయి. వీటిలో 63 బీజేపీవి కాగా.. ఏజీపీకి 9, యూపీపీఎల్‌కు ఏడు ఉన్నాయి. ఇక మొత్తం ప్రతిపక్షాల బలం 47 సీట్లు. వాటిలో కాంగ్రెస్‌వి 27, ఏఐయూడీఎఫ్‌వి 15, బీపీఎఫ్‌వి 3 సీట్లు కాగా సీపీఐ(ఎం)కు ఒక సీటు ఉంది. ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శశికాంత దాస్, షర్మన్ అలీ అహ్మద్‌లు ఎన్‌డీఏకే ఓటేస్తామని ప్రకటించడంతో వారిని నాయకత్వం పార్టీ నుంచి బహిష్కరించింది. ఇంకా కూటమిలో చేరకపోయినా.. బీపీఎఫ్ సైతం ఎన్‌డీఏకే మద్దతు తెలిపింది. ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ సిటింగ్ ఎంపీ రిపున్ బోరాకు ఓటేస్తామని ప్రకటించినప్పటికీ.. ఆయనకు ఓట్లు మాత్రం 35 మాత్రమే దక్కాయి. దీంతో ప్రతిపక్షాల్లో ఏడుగురు ఎమ్మెల్యేలు ఎన్‌డీఏ కూటమి వైపే మొగ్గు చూపినట్లు తేలింది.
కాగా.. కాంగ్రెస్ తమ కరీంగంజ్ ఎమ్మెల్యే సిద్దిఖీ అహ్మద్‌ను గురువారం పార్టీ నుంచి సస్పెండ్ చేసి ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేసింది. పార్టీ చీఫ్ విప్ జారీ చేసిన ఆదేశాలను ఆయన అతిక్రమించారని పేర్కొంది. సంఖ్య రూపంలో ఓటేయాల్సి ఉండగా.. అహ్మద్ కావాలనే పదాలను ఉపయోగించి ఓటేశారని కాంగ్రెస్ తెలిపింది. పదాలను వినియోగించడంతో ఆయన ఓటు చెల్లలేదు. మరోవైపు.. ఏఐయూడీఎఫ్‌కు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు, తమ అభ్యర్థికి నమ్మకద్రోహం చేసిన అనంతరం ముఖ్యమంత్రి హిమంత ఇంటికి వెళ్లి భేటీ అయ్యారని కాంగ్రెస్ ఆరోపించింది. కాగా.. గెలిచిన అభ్యర్థులకు పడిన ఓట్లు, సభ్యులు మనస్సాక్షితో వేసినవని రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ పేర్కొన్నారు. అసోం మరోసారి ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంపై నమ్మకాన్ని ఉంచుతూ.. ఇద్దరు ఎన్‌డీఏ అభ్యర్థుల్ని గెలిపించిందని అభిప్రాయపడ్డారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు సహకరించిన అందరికీ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి నితిన్ ఖడే కృతజ్ఞతలు తెలిపారు.