‘పాపులర్‌ ఫ్రంట్‌’పై నిషేధం..!

సుమారు 16 ఏళ్ల కిందట 2006లో ఏర్పడిన ‘పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా(పీఎఫ్‌ఐ)’ ఇస్లామిక్‌ సంస్థను నిషేధించాలని కేంద్ర హోం శాఖ నిర్ణయించింది. దీనికి సంబంధించి వచ్చేవారం ప్రకటన జారీచేయనున్నట్టు హోం శాఖ వర్గాలు తెలిపాయి. ఈ సంస్థపై నిశిత నిఘాపెట్టిన కేంద్ర ప్రభుత్వం, ఇది సామాజిక వ్యతిరేక, జాతి వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నట్టు నిర్ధారణకు వచ్చింది.

పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా రాజకీయ పార్టీగా అవతరించి 2009లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసింది. అయితే,తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో పాపులర్‌ ఫ్రంట్‌ను నిషేధించాలని కేంద్ర హోం శాఖ నిర్ణయించింది. ఈ క్రమంలో పలు ఆధారాలను సేకరించినట్టు అధికార వర్గాలు తెలిపాయి. 2021, ఏప్రిల్‌లోనే సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా సుప్రీంకోర్టుకు ఈ విషయాన్ని వెల్లడించారు. పీఎఫ్‌ఐని నిషేధించే విషయం పరిశీలనలో ఉందన్నారు.

దీనిపై స్పందించిన అప్పటి యూపీ డీజీపీ ఓపీ సింగ్‌.. ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు చెప్పారు. సీఏఏ నిరసనల్లో పీఎఫ్‌ఐ పాత్రే కీలకమని చెప్పారు. ఇక, బీజేపీ నేతలు కూడా పీఎఫ్‌ఐపై నిషేధం విధించాలని డిమాండ్‌ చేశారు. భీమా కోరేగావ్‌, కరౌలి ఘటనల్లో పీఎఫ్‌ఐ పాత్ర ఉందని ఆరోపించారు. ఇదిలావుంటే, పీఎఫ్‌ఐ రాజస్థాన్‌ శాఖ కార్యదర్శి తాజ్‌ మహమ్మద్‌ పఠాన్‌ మాట్లాడుతూ.. నిషేధానికి సంబంధించి తమకు ఎలాంటి అధికారిక పత్రం అందలేదన్నారు.

ఒకవేళ పీఎఫ్‌ఐపై నిషేధమే విధిస్తే ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రభుత్వంపై పోరాటం చేస్తామన్నారు. మరోవైపు.. ఎన్‌ఐఏ తన నివేదికలో పీఎఫ్‌ఐని నిషేధిత స్టూడెంట్స్‌ ఇస్లామిక్‌ మూమెంట్‌ ఆఫ్‌ ఇండియా(సిమీ)కి అనుబంధ సంస్థగా పేర్కొంది. అదేవిధంగా పీఎఫ్‌ఐపై ఈడీ ఇచ్చిన నివేదికలో సీఏఏ ఆందోళనలకు ఈ సంస్థే నిధులు సమకూర్చినట్టు పేర్కొంది.

Show comments