బండి పాద‌యాత్ర.. బీజేపీ వ్యూహం ఇదేనా?

వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో అధికారంలోకి రావ‌డ‌మే ల‌క్ష్యంగా భార‌తీయ జ‌న‌తా పార్టీ పావులు క‌దుపుతోంది. ఇందుకు హై క‌మాండ్ నుంచి రాష్ట్ర నేత‌ల వ‌ర‌కూ అంద‌రూ దీనిపైనే దృష్టి పెడుతున్నారు. కానీ.. బీజేపీ ఓ అడుగు ముందుకేస్తే..కేసీఆర్ నాలుగు అడుగులు ముందుకేస్తున్నారు. ప‌రిణామాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు మార్చేస్తూ టీఆర్ఎస్ ను స్ట్రాంగ్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలో రాష్ట్రంలో బీజేపీ చీఫ్ బండి సంజ‌య్ ప్రారంభించిన రెండో ద‌శ పాద‌యాత్ర‌పై పార్టీ శ్రేణులు న‌మ్మ‌కం పెట్టుకున్నారు. ఈ పాద‌యాత్ర ద్వారా రాజ‌కీయంగా మ‌రింత హీట్ పెంచి బీజేపీ ని క్షేత్ర‌స్థాయిలోకి తీసుకెళ్లాల‌ని వ్యూహం ర‌చిస్తున్నారు.

అంబేద్కర్ జయంతి రోజు అంటే నిన్న‌నే బండి సంజ‌య్ రెండో ద‌శ పాద‌యాత్ర ప్రారంభించారు. గద్వాల జోగులాంబ ఆలయం నుంచి రెండో దశ ప్రజా సంగ్రామ యాత్ర మొదలు పెట్టారు. 31 రోజుల పాటు 386 కిలోమీటర్ల మేర ఈ యాత్ర కొనసాగుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి. అయిదు జిల్లాలు మూడు పార్లమెంట్ 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ యాత్ర సాగుతుంది. తెలంగాణలో బలోపేతంపై దృష్టి సారించిన బీజేపీ ఆ దిశగా తీవ్రంగా శ్రమిస్తోంది. అధిష్ఠానం నుంచి మద్దతు లభించడంతో రాష్ట్ర బీజేపీ నేతలు సీఎం కేసీఆర్ పై, టీఆర్ఎస్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు.

ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం గతేడాది ఆగష్టు 28న బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర మొదలెట్టారు. చార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయం నుంచి పాదయాత్ర ప్రారంభించిన ఆయన 36 రోజుల పాటు 438 కిలోమీటర్లు తిరిగారు. ఎనిమిది జిల్లాల్లో ఆరు పార్లమెంట్ 19 అసెంబ్లీ నియోజకవర్గాలను ఆయన కవర్ చేశారు. ఇప్పుడికి రెండో దశ పాదయాత్రలో రెట్టించిన ఉత్సాహంతో సాగేందుకు సంజయ్ సిద్ధమయ్యారు. ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలు మారుతున్నాయి. అసెంబ్లీలో బీజేపీ బలం మూడుకు పెరిగింది. ఈ నేపథ్యంలో సంజయ్ మరోసారి చేప‌ట్టే పాదయాత్ర ద్వారా వ‌చ్చే ఎన్నిక‌ల్లో బ‌లం మ‌రింత పెంచుకునేలా ప్ర‌య‌త్నిస్తున్నారు. వేసవి కావడంతో ఉదయం సాయంత్రం పాదయాత్ర ఉండేలా.. మధ్యాహ్నం పార్టీ నాయకులతో సమావేశాలు ఉండేలా కార్యచరణ రూపొందించారు. మరి ఈ పాదయాత్ర ద్వారా బీజేపీ మైలేజీ మ‌రింత పెరుగుతుందో , లేదో చూడాలి.

Show comments