BCCI . Virat Kohli, World Cup – కోహ్లీకి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది..?

ఐసీసీ ట్రోఫీ గెలవకపోతే టీమిండియాలో ఏ ఆటగాడికయినా విలువ ఉండదా…? ఎన్ని విజయాలు సాధించినా ఐసిసి ప్రపంచ కప్ గెలవడం కీలకమా…? తాజాగా విరాట్ కోహ్లీ ఉదంతంతో ఇదే నిజమనే స్పష్టత చాలా మందికి వచ్చింది. టెస్ట్ టీమ్ లో నెంబర్ వన్ గా నిలబెట్టిన… ఎన్నో సిరీస్ లో గెలిచినా సరే ఐసీసీ ప్రపంచకప్ గెలవక పోతే మాత్రం అవమానం తప్పదనే సంకేతాలు భవిష్యత్తు కెప్టెన్లకు టీమిండియా యాజమాన్యం ఇచ్చేసింది. ఆటగాడిగా ఎన్నో ఘనతలు కెప్టెన్ గా ఎన్నో విజయాలు అందుకున్న విరాట్ కోహ్లీని అనూహ్యంగా వన్డే కెప్టెన్ గా తప్పించడం వెనుక ప్రధాన కారణం ఏమిటి అనేదానికి ఇప్పటివరకు స్పష్టత రాలేదు.

ప్రస్తుతం వైట్ బాల్ క్రికెట్ కు పూర్తి స్థాయిలో రోహిత్ శర్మకు యాజమాన్యం బాధ్యతలు అప్పగించగా రెడ్ బాల్ క్రికెట్ కు… విరాట్ కోహ్లీని సారధి గా కొనసాగిస్తోంది. వచ్చే సౌత్ఆఫ్రికా సిరీస్ గెలవక పోతే మాత్రం టెస్టు కెప్టెన్గా కూడా విరాట్ కోహ్లీని పూర్తిస్థాయిలో పక్కన పెట్టే అవకాశం ఉండవచ్చు అనే సంకేతాలు కూడా ఇప్పటికే టీమిండియా యాజమాన్యం ఇచ్చేసింది.

దీంతో కోహ్లీ ఆటగాడిగా అలాగే కెప్టెన్ గా ఎంతవరకు సౌత్ఆఫ్రికా పర్యటనలో రాణిస్తాడు అనే దానిపైనే చాలామంది ఆశగా ఎదురుచూస్తున్నారు. పూర్తిస్థాయిలో జట్టు బలంగా ఉన్నా సరే కోహ్లీ ఐసీసీ ప్రపంచకప్ గెలవకపోవడం వెనుక ప్రధాన కారణం ఏంటనేది తెలియకపోయినా జట్టులో ఉన్న కొంత మంది ఆటగాళ్లు కావాలనే సహకరించలేదనే వ్యాఖ్యలు కూడా ప్రధానంగా వినబడుతున్నాయి. 2019 ప్రపంచ కప్ లో న్యూజిలాండ్ తో సెమీ ఫైనల్లో ఓటమి 2021 టీ20 ప్రపంచ కప్ లో ప్రారంభ మ్యాచ్ లో దాయాది పాకిస్థాన్ తో ఓటమి కోహ్లీ కెరీర్ ఇబ్బందికర మ్యాచ్ లుగా నిపుణులు చెబుతున్నారు.

1999 వన్డే ప్రపంచకప్ లో టీమ్ ఇండియా ఓటమి కి అప్పటి కెప్టెన్ అజారుద్దీన్ ను బాధ్యుడిగా చేస్తూ అతనిని జట్టు నుంచి పక్కన పెట్టారు. నేరుగా పక్కన పెట్టకుండా ఫిక్సింగ్ ఆరోపణలు అలాగే వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ టీమ్ లోని కొంతమంది సీనియర్ ఆటగాళ్లు సహకరించకుండా అతన్ని దూరం పెట్టడం వంటి చర్యల ద్వారా జట్టు నుంచి సాగనంపారు. అంతర్జాతీయ క్రికెట్లో అజారుద్దీన్ తనదైన మార్కు వేసినా సరే ప్రపంచకప్ గెలవకపోవడం తో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు అతనిని ఏమాత్రం కూడా లెక్క చేయలేదు.

Also Read : రెండో టెస్ట్.. భారీ స్కోర్‌ దిశగా ఆస్ట్రేలియా

ఆ తర్వాత 2003 ప్రపంచ కప్ ఫైనల్ వరకు టీమ్ ను తీసుకెళ్లిన మాజీ కెప్టెన్ ప్రస్తుత బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ విషయంలో కూడా ఇదే జరిగింది. 2003 ప్రపంచ కప్ తర్వాత సౌరవ్ గంగూలీ ఎన్నో ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నాడు. అప్పటి కోచ్ గ్రెగ్ చాపెల్ తో ఉన్న విభేదాల కారణంగా జట్టు నుంచి అతని టీమిండియా యాజమాన్యం తప్పించడం ఆ తర్వాత జట్టులో స్థానం కోసం గట్టిగా పోరాటం చేయడం వంటివి అభిమానులను ఇంకా వేధిస్తూనే ఉన్నాయి.

ఇక 2007 ప్రపంచ కప్ ఓటమికి బాధ్యుడు గా చేస్తూ ప్రస్తుత టీమిండియా కోచ్ రాహుల్ ద్రావిడ్ ను టీమిండియా యాజమాన్యం పక్కన పెట్టింది. ఆటగాడిగా జట్టులో కొనసాగించిన కెప్టెన్ గా అప్పటి యువ ఆటగాడు మహేంద్రసింగ్ ధోని ని నియమించడంతో ద్రావిడ్ మనస్థాపానికి గురయ్యాడు అనే వార్తలు కూడా వచ్చాయి. ఆ తర్వాత వెంటనే 2007 టి20 ప్రపంచ కప్ గెలవడంతో మహేంద్ర సింగ్ ధోనీకి జట్టులో ప్రాధాన్యత పెరిగింది.

అప్పటివరకు ద్రావిడ్ కు ఏమాత్రం సహకరించని సీనియర్లు ధోనికి సహకరించడంతో టీమ్ వరుస వరుస విజయాలు సాధించింది. ఆ తర్వాత 2011 ప్రపంచకప్ గెలవడంతో ధోనీకి టీమిండియాలో తిరుగులేకుండా పోయింది. అయితే 2015 ప్రపంచకప్ ఓడిపోయిన తర్వాత అతనిపై కాస్త ఒత్తిడి పెరిగింది అని ప్రచారం కూడా జరిగింది. ఇక అప్పటికే టీం లో కీలక ఆటగాడిగా మారిన విరాట్ కోహ్లీని భవిష్యత్తు కెప్టెన్గా టీమిండియా యాజమాన్యం దశలవారీగా ప్రకటిస్తూ వచ్చింది.

టెస్ట్ కెప్టెన్ గా నియమించడం ఆ తర్వాత కొన్నాళ్లకు పూర్తిస్థాయిలో కెప్టెన్గా నియమించడంతో విరాట్ కోహ్లీ హవా క్రమంగా పెరిగింది. అయితే 2019 ప్రపంచ కప్ ఓటమి ఒక్క ఐసీసీ టోర్నీ కూడా గెలవకపోవడం, టెస్టు చాంపియన్షిప్ ఓటమి, టి 20 ప్రపంచకప్ లో పాకిస్తాన్ తో ఓటమి న్యూజిలాండ్ తో ఓటమితో… టీమిండియా యాజమాన్యం అతని పై సీరియస్ గా ఉందని వార్తలు వచ్చాయి. ఇక వ్యాపార వ్యవహారాల మీద దృష్టిపెట్టి ఆట మీద దృష్టి పెట్టడం లేదని ఆరోపణలు రావడంతో అతనిని కెప్టెన్గా క్రమంగా పక్కన పెట్టడం మొదలు పెట్టారు. టి20 కెప్టెన్ గా తప్పకున్న మూడు నెలల తర్వాత కోహ్లీ ని వన్డే కెప్టెన్ గా కూడా పక్కన పెట్టారు. దీంతో ఎంతటి ఆటగాడికి అయినా సరే ఐసీసీ టోర్నీ గెలవక పోతే మాత్రం ఖచ్చితంగా జట్టు నుంచి ఉద్వాసన తప్పదు అనే సంకేతాలను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఇచ్చేసింది. మరి ఎన్నో ఆశలు పెట్టుకుని టీమిండియా కెప్టెన్గా బాధ్యతలు చేపడుతున్న రోహిత్ శర్మ 2023 ప్రపంచకప్ గెలుస్తాడా అనేది చూడాలి.

Also Read : అసలు టీం ఇండియాలో ఏం జరుగుతోంది..?

Show comments