AP BJP, YCP, Prajagraha Meeting – వేడెక్కిన రాజ‌కీయం : ఏపీ బీజేపీకి వైసీపీ స్ట్రాంగ్ కౌంట‌ర్‌

ఢిల్లీ అధిష్ఠానం ఒత్తిడితో ఏపీలో హ‌డావిడి మొద‌లుపెట్టింది బీజేపీ. నేత‌లంద‌రూ క‌లిసి జాకీలు పెట్టి లేపుతున్నా.. రెండున్న‌రేళ్లుగా పార్టీకి ఏ ప్రాంతంలోనూ అతీగ‌తీ లేదు. మ‌రోవైపు ప‌క్క రాష్ట్రం తెలంగాణ‌లో అనూహ్యంగా పుంజుకుంటోంది. దీంతో ఏపీ బీజేపీపై అగ్ర‌నాయ‌క‌త్వం గుర్రుగా ఉంది. తిరుప‌తిలో భేటీ అయిన కేంద్ర‌ హోం మంత్రి అమిత్ షా కూడా.. రాష్ట్ర నేత‌ల‌ను సున్నితంగా హెచ్చ‌రించారు. పుంజుకునేలా దిశా నిర్దేశం చేశారు. దీనిలో భాగంగా కొద్ది రోజులుగా ఏపీ బీజేపీ నేత‌లు తెర‌పైకి వ‌చ్చి వైసీపీ స‌ర్కారుపై విమ‌ర్శ‌ల బాణాలు ఎక్కుపెడుతున్నారు. ఈ రోజు విజ‌య‌వాడ‌లో బ‌హిరంగ స‌భ కూడా నిర్వ‌హించారు. ప్ర‌జాగ్ర‌హ స‌భ వేదిక నుంచి బీజేపీ నేత‌లు ఏపీ స‌ర్కారుపై చేసిన విమ‌ర్శ‌ల‌కు వైసీపీ నేత‌లు కూడా స్ట్రాంగ్ కౌంట‌ర్లు ఇవ్వ‌డంతో రాజ‌కీయం వేడెక్కింది.

చంద్ర‌బాబు ఎజెండా అమ‌లు

బీజేపీ నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, బీజేపీ నేతలవి ఓట్ల రాజకీయాలు అంటూ నిప్పులు చెరిగారు. బీజేపీ నేతలు.. చంద్రబాబు ఎజెండా అమలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ‘‘పెరుగుతున్న డీజిల్‌, పెట్రోలు ధరలపై బీజేపీ నేతలు బాధపడాలి. పెరుగుతున్న ఎరువుల రేట్లపై బీజేపీ నేతలకు బాధలేదా?. ఎక్కడ్నుంచో పిలుపు వస్తే.. ఇక్కడ సభ పెడతారు. ప్రజా సమస్యలపై బీజేపీకి దృష్టి లేదు. ప్రజాగ్రహ సభలో పెట్రోల్‌, డీజీల్‌ రేట్లపై మాట్లాడాలని’’ మంత్రి పేర్ని నాని హితవు పలికారు.

‘‘ఏపీ బీజేపీ ప్రజాగ్రహ సభ అంటూ పెద్ద ప్రహసనానికి తెరలేపింది. బీజేపీకి ఏపీలో ఒక అజెండా, ఒక సిద్ధాంతం, ప్రజా సమస్యలపై దృష్టి ఏమీలేవు. ప్రజలు ఎవరి మీద ఆగ్రహంగా ఉన్నారు…? మీకు చంద్రబాబు ఎజెండా తప్ప మరో ఎజెండా ఉందా..? వాళ్లు ప్రభుత్వం రాగానే బ్రాందీ బుడ్డి 75 రూపాయలకే ఇస్తామని సిగ్గు లేకుండా చెప్తున్నారు. మీరు బ్రాందీ బుడ్డి గురించి బాధపడటం కాదు.. డీజిల్, పెట్రోల్ ధరల గురించి బాధ‌ప‌డండి. పెరిగిన ఎరువుల ధరలు గురించి మీరు ఏ రోజైనా బాధ పడ్డారా…?. 2014లో ఎరువుల బస్తా రూ.800 ఉన్న ధర ఇవాళ రూ.1700కి వెళ్ళింది. రైతుల ధాన్యం కొనేది లేదంటారు…ఆంక్షలు పెడతారు. నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతున్నందుకు మీరు బాధపడరా…?. కేంద్రమే కదా ధరలు నియంత్రణ చేయాల్సింది. రాష్ట్రాలు కేవలం బ్లాక్ మార్కెట్ పై మాత్రమే చర్యలు తీసుకోగలదు..” అని నాని బీజేపీ నేతల తీరును ఎండగట్టారు.

ఉనికి కోస‌మే బ‌హిరంగ స‌భ‌

ఏపీలో ఉనికి‌ కోసమే బీజేపీ విజయవాడలో బహిరంగ సభ నిర్వహిస్తోందని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బోత్స సత్యనారాయణ ఎద్దేవా చేశారు. దేశంలో బీజేపీ అధికారంలో ఉన్నా.. ఏపీలో ఆ పార్టీ లేదన్నారు.రాజకీయ పార్టీ కాబట్టి బహిరంగ సభ నిర్వహించుకుంటోందన్నారు. విజయవాడలో మంత్రి బోత్స మీడియాతో మాట్లాడుతూ, ఏపీలో మేము కూడా ఉన్నామని చెప్పుకోవడానికి తాపత్రయపడుతూ బీజేపీ ఈ రోజు సభ నిర్వహిస్తోందన్నారు. నాలుగురోజులుగా బీజేపీ నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఆధ్వర్యంలోనే నీతి ఆయోగ్ రాష్ట్రాలకి ర్యాంకులు ఇచ్చిందని.. బీజేపీ పరిపాలిస్తున్న ఉత్తరప్రదేశ్ ఏ ర్యాంకులో ఉంది.. మన రాష్ట్రం ఏ ర్యాంకులో ఉందో చూశారా అని బోత్స ప్ర‌శ్నించారు.

స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడ‌రేం..

ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా బీజేపీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాగ్రహ‌ సభలో విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ఎందుకు చెప్ప‌లేద‌ని అన్నారు. స్టీల్ ప్లాంట్ కోసం ఎందరో యోధులు అమరులైయ్యారని చెప్పారు. విద్యార్థి నాయకుడిగా పనిచేసిన తన గుండె రగిలిపోతుందని అన్నారు. మహానీయుల త్యాగాలు ప్రైవేట్ పరం చేయడానికా ఈ సభ అంటూ ప్రశ్నించారు. ఖచ్చితంగా ఏపీకి జరిగిన అన్యాయంపై మాట్లాడాలని డిమాండ్ చేశారు. ఏపీ నాయకులంతా మోడీ, నిర్మలా సీతారామన్‎ ను క‌లిసి స్టీల్ ప్లాంట్‎పై మాట్లాడాలని కోరారు. రాజకీయపార్టీలకు ఎజెండా ప్రాధాన్యతలు ఉంటాయని, సభలు పెట్టుకోవడంలో త‌ప్పులేదు కానీ, రాష్ట్రానికి అన్యాయం జ‌రుగుతుంటే మాట్లాడ‌క‌పోవ‌డం దారుణ‌మ‌న్నారు. స్టీల్ ప్లాంట్ ఉద్యమనేతగా తను మాట్లాడాల్సి వ‌స్తోంద‌ని చెప్పారు.

Show comments