Political party, Mudragada Padmanabham – ఏపీలో తెరపైకి మరో పార్టీ..?

మాజీ మంత్రి, కాపు రిజర్వేషన్‌ ఉద్యమ మాజీ నేత ముద్రగడ పద్మనాభం నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్‌లో మరో రాజకీయ పార్టీ ఏర్పాటు కానుందా..? 2024లో జరిగే ఎన్నికల్లో రాజకీయ సమీకరణాలు మారబోతున్నాయా..? అంటే అవుననే సంకేతాలు వస్తున్నాయి. ఆదివారం ముద్రగడ స్వగ్రామం తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడిలో బీసీ, దళిత నేతలు ఆయనతో సమావేశం కావడం, ఆ సమావేశంలో పార్టీ ఏర్పాటుపై చర్చిండంతో కొత్త పార్టీ ఏర్పాటుకు రంగం సిద్ధమైందనే సంకేతాలు వచ్చాయి.

ఈ విషయంలో ముద్రగడ పద్మనాభం ఏ విషయమూ చెప్పకపోయినా.. ఆయనతో సమావేశమైన దళిత సామాజికవర్గ నేత ఆర్‌ఎస్‌ రత్నాకర్, బీసీ నేత, ఉభయగోదావరి జిల్లాలో బలమైన శెట్టిబలిజ సామాజికవర్గానికి చెందిన కుడుపూడి సూర్యనారాయణలు పార్టీ ఏర్పాటు చేసేందుకు యత్నిస్తున్నామని చెప్పడంతో కొత్త పార్టీ ఏర్పాటుపై చర్చ మొదలైంది.

కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని చంద్రబాబు ఇచ్చిన హామీని అమలు చేయాలని 2016లో ముద్రగడ పద్మనాభం ఉద్యమం చేసిన తర్వాత.. కాపులు, దళితులు కలసి రాజకీయ పార్టీని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ముద్రగడ వద్దకు వచ్చింది. అయితే ఆయన మాత్రం తనకు రాజకీయపరమైన లక్ష్యాలు లేవని, కాపు జాతి సంక్షేమమే తనకు ముఖ్యమని చెబుతూ వచ్చారు.

Also Read : వంగ‌వీటి రంగా త‌ర‌హాలో రాధా హ‌త్య‌కు కుట్ర‌..? త్వ‌ర‌లో పేర్లు బ‌య‌ట‌పెడ‌తా..

2017లో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ పార్టీ నేత చింతా మోహన్‌.. రాజమహేంద్రవరంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఏపీలో ఓ సరికొత్త సూర్యుడు తూర్పున ఉదయించబోతున్నాడని చెప్పారు. మాజీ ఎంపీ హర్షకుమార్, ముద్రగడ పద్మనాభంలు కలసి కాపులు, దళితులకు రాజ్యాధికారం లక్ష్యంగా పార్టీని ఏర్పాటు చేయబోతున్నట్లు చింతా మోహన్‌ చెప్పారు. ఈ వ్యాఖ్యలకు బలం చేకూరేలా.. కిర్లంపూడిలో డాక్టర్‌ బి.ఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహాన్ని ముద్రగడ పద్మనాభం ఆవిష్కరించారు. అయితే ఆ తర్వాత పార్టీ ఏర్పాటు అంశం మరుగునపడిపోయింది.

2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడం, ఎన్నికల ప్రచారంలోనే కాపు రిజర్వేషన్ల అంశం రాష్ట్ర పరిధిలో లేదని, చంద్రబాబు మాదిరిగా తాను మోసం చేయలేనని వైఎస్‌ జగన్‌ జగ్గంపేట సభలోనే క్లారిటీ ఇవ్వడంతో.. కాపు రిజర్వేషన్‌ అంశంపై ముద్రగడ మాట్లాడడం మానేశారు. ముద్రగడ మాట్లాడాలంటూ ఒత్తిడి చేసినా, విమర్శలు చేసినా ఆయన స్పందించలేదు. తనపై టీడీపీ అనుకూల మీడియాలో కొంత మంది పరుష వ్యాఖ్యలు చేయడంతో.. ఉద్యమం నుంచి తప్పుకుంటున్నట్లు ముద్రగడ ప్రకటించారు. ఆ బాధ్యతను ఎవరైనా తీసుకోవచ్చని చెప్పారు.

ఉద్యమ బాట నుంచి తప్పుకున్న తర్వాత ముద్రగడ.. వివిధ అంశాలపై ప్రభుత్వానికి లేఖలు రాయడం చేస్తున్నారు. పలు విషయాలపై స్పందిస్తున్నారు. ఇటీవల సంక్రాంతి సందర్భంగా కోడిపందేలకు అనుమతి ఇవ్వాలంటూ సీఎం వైఎస్‌ జగన్‌కు లేఖ రాశారు. ఇది ఉభయ గోదావరి జిల్లాల సాంప్రదాయమని ఆ లేఖలో ముద్రగడ చెప్పారు. ఈ తరహాలో ముద్రగడ స్పందించడం ఇదే తొలిసారి. ఈ పరిణామాలన్నీ కూడా ముద్రగడ రాజకీయ సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించబోతున్నారనే సందేహాలకు తావిచ్చాయి. తాజా సమావేశం కూడా దీనికి కొనసాగింపే. మరి ఈ సారైనా రాజకీయ పార్టీ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చుతాయా..? లేదా..? చూడాలి.

Also Read : ఆ ఇద్దరు, ముగ్గురు హీరోలు ఎవరు సోమిరెడ్డి?

Show comments