Idream media
Idream media
ఏపీ శాసన మండలి రద్దు అంశం మరోసారి తెరపైకి వచ్చింది. 2020 జనవరిలో శాసన మండలిని రద్దు చేస్తూ వైసీపీ ప్రభుత్వం కేంద్రానికి తీర్మానం పంపింది. అయితే శాసన మండలి రద్దు అంశము పై కేంద్రం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.తాజాగా ఈ అంశంపై టిడిపి ఎంపీ కనకమేడల రాజ్యసభలో కేంద్రాన్ని ప్రశ్నించారు. దీనికి కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు రాతపూర్వక సమాధానమిస్తూ ఏపీ శాసన మండలి రద్దు తీర్మానం కేంద్రానికి అందిందని…ప్రస్తుతం ఇది న్యాయశాఖ పరిధిలో ఉందని సమాధానమిచ్చారు.
రెండు నెలల కిందటి వరకు మండలిలో టీడీపీకి బలం ఉoడడంతో అధికార పార్టీకి అడుగడుగునా అడ్డుపడింది టీడీపీ. మండలిలో టీడీపీకి 22 మంది సభ్యుల బలం ఉండడంతో అధికార వైసీపీని ఇరుకున పెట్టసాగింది టీడీపీ. సలహాలివ్వాల్సిన పెద్దల సభను రాజకీయ వేదికగా మార్చుకుని అడ్డంకులు సృష్టించింది.
జగన్ ప్రభుత్వం పరిపాలన వికేంద్రీకరణ కేంద్రంగా ప్రవేశపెట్టిన మూడు రాజధానులు బిల్లును,ఆంధ్రప్రదేశ్ లో ఆంగ్ల మాధ్యమంలో విద్యను అమలు చేసేందుకు ప్రవేశపెట్టిన బిల్లు కూడా అసెంబ్లీ ఆమోదం పొందినా , మండలిలో బలం లేకపోవడంతో ఆమోదం పొందలేకపోయింది.మూడు రాజధానుల బిల్లును చైర్మన్ షరీఫ్ తనకున్న విశేషాధికారాలతో సెలెక్ట్ కమిటీకి పంపడంతో ప్రభుత్వం చైర్మన్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం తీసుకు వస్తున్న నిర్ణయాలపై పెద్దల సభ అడ్డుపడడంతో,ప్రజాభిప్రాయానికి అనుగుణంగా పాలన జరగనీయకుండా ఉద్దేశ్యపూర్వకంగానే మండలిలో బిల్లులు అడ్డుకుంటున్న టీడీపీ వైనంతో విసుగు చెందిన జగన్ సర్కార్ మండలి రద్దు చేయాలని 27 జనవరి,2020 నాడు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి సిఫార్సు చేసింది. మండలి రద్దు తీర్మానం చేసిన వైసీపీ ఎమ్మెల్సీ కోటలో మంత్రులైనా మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ లను మంత్రి పదవికి రాజీనామా చేపించి రాజ్యసభకు పంపించింది.
అయితే మండలి రద్దును తీవ్రంగా వ్యతిరేకించిన టీడీపీ ఇప్పుడు టీడీపీ బలం 22 నుండి 15కు పడిపోవడంతో పాటు వచ్చే ఏడాదిలో చాలామంది టీడీపీ ఎమ్మెల్సీల పదవీ కాలం కూడా ముగుస్తుండడంతో టీడీపీ మండలి రద్దు చేయాలని డిమాండ్ చేస్తుంది.
అయితే ఇటీవల వైసీపీకి కొత్త ఎమ్మెల్సీలు రావడంతో మండలి లో వైఎస్ఆర్ సిపి బలం మిత్రపక్షాలతో కలిపి 27కు చేరింది.14 ఖాళీలలో స్థానిక సంస్థలు,ఎమ్మెల్యే కోటాలో కూడా వైసీపీ సభ్యులు ఎన్నికయ్యే అవకాశం ఉంది.దింతో మండలి రద్దు విషయంలో వైసీపీ ఎలాంటి ఒత్తిడి తీసుకురాలేదు. కేంద్రం తీసుకునే నిర్ణయం మీదనే మండలి భవిషత్తు ఆధారపడి ఉంటుంది.
శాసన మండలి గురించి క్లుప్తంగా..
58 మంది సభ్యులున్న మండలిలో 50 మంది వివిధ పద్ధతుల్లో ఎన్నుకోబడగా, ఎనిమిది మంది గవర్నర్ కోటలో నామినేట్ చేయబడతారు. మండలిలో అధికార వైఎస్సార్సీపీకి 19 మంది సభ్యులు, పిడిఎఫ్ ఐదుగురు, ప్రతిపక్ష టీడీపీ 15 మంది సభ్యులు, బిజెపి ఇద్దరు సభ్యుల బలం ఉంది. 14 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి.
శాసన మండలి రద్దు సాధ్యమేనా…
1958 లో ఏర్పడిన శాసన మండలి 1985 వరకు కార్యకలాపాలు నిర్వహించింది.అయితే 1985లో ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని పెద్దల సభలో మెజారిటీ ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇరకాటంలో పెట్టడంతో శాసన మండలి రద్దుకు సిఫార్సు చేస్తూ కేంద్రానికి తీర్మానం పంపడం కేంద్రం కూడా ఈ తీర్మానాన్ని ఆమోదించింది.దింతో మండలి రద్దు అయింది. ఆ తరువాత 1989 లో మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో శాసనమండలిని పునరుద్ధరించాలని జనవరి 22 1999 లో అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. రాజ్యసభలో ఈ తీర్మానం ఆమోదం పొందినప్పటికీ లోక్సభలో గడప దాటలేక పోయింది.
అయితే 2004లో ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో 8 జూలై 2004 సంవత్సరంలో శాసనమండలిని పునరుద్ధరిస్తూ అప్పటి వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. రాష్ట్ర తీర్మానాన్ని పార్లమెంట్ ఇరుసభలు ఆమోదించడంతో 10 జనవరి 2007 నాడు శాసనమండలి పునరుద్ధరిస్తూ రాష్ట్రపతి సంతకం చేశారు. దీంతో 30 మార్చి 2007 నుంచి మళ్లీ శాసనమండలి తిరిగి ప్రారంభమైంది.
అయితే ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రతిపాదించిన మండలి రద్దుపై కేంద్రం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.మండలిలో బలం పెరగడంతో వైసీపీ రద్దు డిమాండ్ ను వెనక్కి తీసుకుంటుందా.. బలం కోల్పోయిన టీడీపీ మండలి రద్దుకు డిమాండ్ చేస్తుందో చూడాలి. ఏదేమైనా పెద్దల సభకు రాజకీయా పునరావాస పదవులకు నిలయంగా చూసారే తప్ప నిర్మాణాత్మక చర్చలు చేసి ప్రజా సమస్యల పరిష్కరం కోసం చూడలేదు.పెద్దల సభకు ఎన్నికయ్యే వారిలో విద్యావంతులు, రాజకీయ అనుభవం కలిగిన వారు ఉండాలని కోరుతున్నారు. మండలికి అధికారలు లేనప్పటికీ ప్రభుత్వం తీసుకువచ్చిన బిల్లును 90 రోజులు ఆపే అధికారం ఉండడంతో 90 రోజులలో బిల్లు లోపాలు సవరించుకునే అవకాశం ఉందని,మరియు ప్రభుత్వాలు ఏకపక్షంగా నిర్ణయం తీసుకోకుండా తాత్కాలికంగా అడ్డుకునే అధికారం మండలికి ఉంది.
ఒక ప్రభుత్వం రద్దు చేయమని ఒక ప్రభుత్వం పునరుద్ధరించమనడం కొంత రాజకీయ గందరగోళనికి దారి తీస్తుంది. అయితే ఇప్పుడు మండలిపై పూర్తిస్థాయిలో రాజకీయ చర్చ జరగాలి.