Idream media
Idream media
ఎప్పుడూ కూడా అమరావతి ప్రశస్తం గురించి చెప్పే చంద్రబాబు.. అక్కడ జరిగిన భూముల కుంభకోణంపై మాత్రం ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు. ఈ రోజు తిరుపతిలో జరిగిన అమరావతి జేఏసీ సభలోనూ మరోసారి చంద్రబాబు ఇన్‌సైడర్ ట్రేడింగ్ గురించి ప్రస్తావించారు. రాజధానిగా అమరావతిని ప్రకటించక ముందు అక్కడ టీడీపీలోని కొంత మంది ప్రముఖులు భారీగా భూములు కొన్నారనేది అభియోగం. దాన్ని ఇన్‌సైడర్ ట్రేడింగ్ అంటున్నారు. సభలో మాట్లాడిన చంద్రబాబు.. ఇన్‌సైడర్ ట్రేడింగ్ అంటున్నారని, అసలు భూ సేకరణలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ అనే పదమేలేదన్నారు. ఈ విషయం హైకోర్టు, సుప్రీం కోర్టులు కూడా చెప్పాయని తన మాటలకు బలం చేకూర్చే ప్రయత్నం చేశారు.
ఆ మాట ఎందుకు చెప్పడం లేదు..?
ఇన్‌సైడర్ అనే పదం స్టాక్ మార్కెట్‌కు సంబంధించినది. ఇది భూ సేకరణ చట్టంలో లేదని టీడీపీ వాదిస్తోంది. కోర్టులు కూడా అదే చెప్పాయని టీడీపీ నేతలు అంటున్నారు. అయితే ఇన్‌సైడర్ ట్రేడింగ్ అనే పదం భూ సేకరణ చట్టంలో ఉందా..? లేదా..? అనే విషయం పక్కనబెడితే.. రాజధానిగా అమరావతిని ప్రకటించక ముందే అక్కడ భూములు కొన్నారా..? లేదా..? అనే విషయం చంద్రబాబు ఎందుకు చెప్పలేకపోతున్నారో అమరావతియే ఏకైక రాజధాని కావాలనుకుంటున్న వారికి కూడా అర్థం కావడం లేదు. తమపై వచ్చిన అభియోగాలు నిజం కాకపోతే.. అవన్నీ వట్టి ఆరోపణలు, కావాలనే అమరావతిని బద్నాం చేసేందుకు మాపై ఆరోపణలు చేస్తున్నారని చంద్రబాబు ప్రజలకు ఎందుకు చెప్పలేకపోతున్నారు..? కోర్టులకు వెళ్లి విచారణలపై స్టే ఎందుకు తెచ్చుకున్నారు..? అనే సందేహాలు సామాన్యుల్లోనూ కలుగుతాయి.
Also Read : తప్పు చేస్తే అరెస్ట్ చేయరా లోకేశ్..?
చెప్పకనే చెప్పారు కదా..
రాజధానిగా అమరావతిని ప్రకటించక ముందే సీఆర్‌డీఏ పరిధిలోనూ, పరిధి ఆనుకుని వేలాది ఎకరాల భూములను చంద్రబాబు సన్నిహితులు, కొంత మంది టీడీపీ నేతలు కొనుగోలు చేశారనే విషయం పలు సందర్భాల్లో పరోక్షంగా టీడీపీ నేతలు తమ మాటల ద్వారా, ఆ పార్టీ అనుకూల పత్రికలైన ఈనాడు, ఆంధ్రజ్యోతిలు తమ రాతల ద్వారా ఒప్పుకున్నాయి. అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ మంత్రుల కమిటీ నిర్ధారించిన సమయంలో.. ఈ విషయం నుంచి ప్రజలను పక్కదారి పట్టించేందుకు టీడీపీ నేతలు.. విశాఖలో ఒన్‌సైడ్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపణలు చేశారు. ఇన్‌సైడ్ – అవుట్ సైడ్ ట్రేడింగ్ చేసి విశాఖలో భూములు వైసీపీ నేతలు కొనుగోలు చేశారని ఆరోపణలు చేసిన టీడీపీ నేతలు.. అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని చెప్పకనే చెప్పారు.
ఈనాడు ఇలా ..
‘‘ల్యాండ్ పూలింగ్ విధానంలో ప్రభుత్వం అమరావతి కోసం 33 ఎకరాలు సేకరించింది. అందులో ఏడు వేల ఎకరాలు బయట వ్యక్తులు రైతుల వద్ద కొనుగోలు చేసి ఇచ్చారు. మంచి ధర వస్తుందని ఏడు వేల ఎకరాలు కొనుగోలు చేసి ఇచ్చిన వారు.. ఇప్పుడు మూడు రాజధానుల వల్ల నష్టపోతున్నారు’’ అంటూ గత ఏడాది నవంబర్‌లో మూడు రాజధానులకు వ్యతిరేకంగా రాసిన కథనంలో ఈనాడు పేర్కొంది. రాజధాని ఎక్కడ వస్తుందో ఎవరికీ తెలియనప్పుడు.. జాతీయ రహదారికి 20 కిలోమీటర్ల దూరంలోని గ్రామాలకు వెళ్లి కేవలం కొంత మంది ఏడు వేల ఎకరాల భూములు ఎలా కొనుగోలు చేస్తారు..? పైగా మంచి ధర వస్తుందని కొనుగోలు చేశారంటున్నారు. ఆ విషయం రైతులకు తెలిసి ఉంటే.. తమ భూములు ఎందుకు బయట వ్యక్తులకు అమ్ముకుంటారు..?
Also Read : మూడు రాజధానులకు మద్ధతుగా మంత్రి సీదిరి శంఖారావం
ఏబీఎన్ రాధాకృష్ణ కూడా పలికారు..
ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ కూడా ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని గత ఏడాది నవంబర్ లో రాసిన తన కొత్త పలుకులో ఒప్పుకున్నారు. ‘బరితెగించి బెదిరింపులు’ పేరున రాసిన కొత్తపలుకులో.. “ప్రభుత్వ నిర్ణయం వెలువడడానికి కొద్దిగా ముందు భూములు కొని ఉంటే అది అనైతికం అవుతుంది కానీ చట్ట విరుద్ధం అని చెప్పలేం” అని రాసుకొచ్చారు. ఈ మాటల ద్వారా.. “అక్కడ భూములు కొన్నారు. అయితే అది అనైతికం అవుతుంది కానీ చట్టవిరుద్ధం కాదు. ప్రభుత్వం దర్యాప్తు చేయజాలదు. కోర్టులు విచారించలేవు..” అని చెప్పడమే రాధా కృష్ణ ఉద్దేశం కాబోలు.
విచారణలపై స్టే తెచ్చుకున్నంత మాత్రాన..
2015లో భూముల కుంభకోణం వెలుగులోకి వచ్చినప్పుడు.. ‘కొంటే తప్పేంటి.. డబ్బులు ఉన్నోళ్లు కొనుక్కుంటారు..’ అంటూ సీఎంగా ఉన్న చంద్రబాబు మాట్లాడారు. ఇలా పలు సందర్భాల్లో భూములు కొన్నామని చంద్రబాబు, టీడీపీ నేతలు. ఆ పార్టీ అనుకూల పత్రికలు ఒప్పుకుని.. ఇప్పుడు ఇన్‌సైడర్ ట్రేడింగ్ అనే పదం భూ సేకరణలో లేదు. కోర్టులు చెప్పాయంటే నేరం చేయనట్లా..? ఏడు వేల ఎకరాలు అమ్మిన రైతులు నష్టపోనట్టా..? ఏడు వేల ఎకరాలే కాదు.. సీఆర్‌డీఏ పరిధి తర్వాత ఎన్ని వేల ఎకరాలు కొనుగోలు చేశారన్నది విచారణ జరిగితేనే తెలుస్తుంది. కోర్టులకు వెళ్లి విచారణలపై స్టేలు తెచ్చుకున్నంత మాత్రాన.. తప్పు ఒప్పు అవుతుందా..? నేరం చేయనట్లు అవుతుందా..?
Also Read : అమరావతి సభకు సీపీఎం ఝలక్, అందుకే రాలేకపోతున్నామంటూ బహిరంగ లేఖ