iDreamPost
iDreamPost
రాజధాని తో పాటుగా అనేక అంశాలు ముడిపడి ఉంటాయి. ముఖ్యంగా రాజకీయ పార్టీల కార్యకలాపాలకు కేంద్రాలుగా రాజధాని ఉంటుంది. దాంతో గడిచిన నాలుగైదేళ్లుగా అన్ని పార్టీలన్నీ విజయవాడ చుట్టూ తమ కార్యకలాపాలకు కూడా కార్యాలయాలు తెరిచాయి. తొలుత సీపీఎం, సీపీఐ వంటి తమకు చాలాకాలంగా ఉన్న పార్టీ ఆఫీసులను రాష్ట్ర కార్యాలయాలుగా మార్చుకుని హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలివచ్చాయి. ఆ తర్వాత కాంగ్రెస్ ఆంధ్రరత్న భవన్ ని కేంద్రంగా చేసుకుంది. బీజేపీ కూడా రాష్ట్ర కార్యాలయం విజయవాడ నుంచి నడుపుతోంది.
ఇక ఎన్నికల ఫలితాల తర్వాత వైఎస్సార్సీపీ కూడా లోటస్ పాండ్ నుంచి తాడేపల్లికి తరలివచ్చింది. కేంద్ర కార్యాలయంగా సొంత భవనం నిర్మించి, అక్కడి నుంచే కార్యకలాపాలు సాగిస్తున్నారు. తాజాగా తెలుగుదేశం పార్టీ కూడా సొంత కార్యాలయం ఈనెలలోనే ప్రారంభించింది. మంగళగిరిలోని ప్రైమ్ లోకేషన్ లో గత ప్రభుత్వ కాలంలో కేటాయించిన భూముల్లో కార్యాలయం నిర్మించుకున్న తీరు పై విమర్శలు, న్యాయస్థానాలకు చేరిన వివాదాలు కూడా ఉన్నాయి. నాలుగేళ్లపాటు గుంటూరులోని పార్టీ ఆఫీసులో రాష్ట్ర కార్యాలయం నిర్వహించిన టీడీపీకి సొంత భవనం నిర్మించుకుని నెలరోజులు కూడా కాకముందే రాజధాని మార్పు పెద్ద సమస్యగా మారుతోంది.
ఈ పార్టీలన్నీ ఇప్పుడు విశాఖ వైపు మళ్లక తప్పదనే అంచనాలున్నాయి. ప్రస్తుతానికి అసెంబ్లీ కేంద్రంగా అమరావతి ఉన్నప్పటికీ భవిష్యత్తులో ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉండదని కొందరు భావిస్తున్నారు. అదే సమయంలో సెక్రటేరియేట్ , సీఎంవో వంటివి విశాఖలో ఉంటే రాజకీయ వ్యవహారాలకు కేంద్రంగా ఆ నగరమే మారుతుందని చెబుతున్నారు. దాంతో ఇప్పటికే విశాఖలో సీపీఎం, సీపీఐతో పాటుగా టీడీపీ, కాంగ్రెస్ కి కూడా సొంత భవనాలున్నాయి. విశాఖ టీడీపీ ఆఫీసు కూడా ఆక్రమిత స్థలంలో నిర్మించారంటూ గతంలోనే ఆరోపణలు వచ్చాయి. అది మరోసారి తెరమీదకు వచ్చినా ఆశ్చర్యం లేదు. అయినప్పటికీ సొంత కార్యాలయాలు కలిగిన ఆయా పార్టీలు అటువైపు దృష్టి పెట్టే అవకాశం ఉంది. అయితే ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా ఆయా నిర్మాణాలు ఉండవు కాబట్టి, కొంతకాలం పాటు అందరూ సర్థుకుపోక తప్పదు.
ఇక వైసీపీ సొంతంగా భవనం నిర్మించుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆపార్టీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ సొంతంగా కార్యాలయం నడుపుతున్నారు. ఎంపీ ఎంవీవీ సత్యన్నారాయణ వంటి వారు కూడా ఉన్న నేపథ్యంలో అది పెద్ద సమస్య కాబోదని పలువురు చెబుతున్నారు. ఇలాంటి మార్పులకు కొన్ని పార్టీలు సమయం తీసుకున్నప్పటికీ కొందరు మాత్రం వెంటనే మార్పు చేసుకోవడానికి తగ్గట్టుగా ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.