BJP, Varun Gandhi – బీజేపీ ఎంపీ చుర‌క‌లు : ప‌గ‌లు బ‌హిరంగ స‌భ‌లు.. రాత్రుళ్లు క‌ర్ఫ్యూలా..?

బీజేపీకి కంట్లో న‌లుసుగా మారాడు బీజేపీ నేత, ఫిలిబిత్ ఎంపీ వరుణ్ గాంధీ. సొంత పార్టీ ఎంపీయే అయిన‌ప్ప‌టికీ చాలా అంశాల్లో విభేదిస్తూ.. బ‌హిరంగంగా విమ‌ర్శిస్తూ అధిష్ఠానాన్ని ఇబ్బందుల‌కు గురి చేస్తున్నాడు. వ‌రుణ్‌ గాంధీ వ్యాఖ్య‌లు ఒక్కోసారి విప‌క్షాల‌కు కూడా ఆయుధంగా మారుతున్నాయి. వ‌చ్చే ఏడాది ఎన్నిక‌లు జ‌రిగే అవ‌కాశాలు ఉన్న ఉత్త‌రప్ర‌దేశ్ ప్ర‌భుత్వాన్ని కూడా ఇరుకున పెడుతున్నారు వ‌రుణ్ గాంధీ. ఉత్తరప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (UPTET)ని రద్దు చేస్తూ గత నెలలో యూపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వరుణ్ చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఆర్థిక, ఉపాధి సమస్యలను పరిష్కరించడంలో కేంద్రం విఫలమైందని ఆయన విమ‌ర్శ‌లు చేయ‌డాన్ని విప‌క్షాలు త‌మ‌కు అనువుగా మార్చుకున్నాయి.

‘యూపీ టెట్‌ పరీక్ష పేపర్ లీక్ అనేది లక్షలాది మంది యువత భవిష్యత్తుతో ఆడుకోవడం లాంటిది. కిందిస్థాయి అధికారులపై చర్య తీసుకోవడం ద్వారా దీనిని అడ్డుకోలేము. విద్యా మాఫియా, వారిని పోషిస్తున్న రాజకీయ నాయకులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. చాలా విద్యాసంస్థలు రాజకీయ పలుకుబడి కలిగిన వారి అజమాయిషిలో ఉన్నాయి. వాటిపై ఎప్పుడు చర్యలు తీసుకుంటారు?’ అని వరుణ్‌ గాంధీ ప్రశ్నించారు. కాగా, కేంద్ర ప్రభుత్వం ఇటీవల రద్దు చేసిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళనకు మద్దతుగా కూడా ఆయన గళం వినిపించిన సంగతి తెలిసిందే.

ఇలా అధిష్ఠానాన్నే లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తోన్న వరుణ్ గాంధీ.. తాజాగా కరోనా నిబంధనల విషయంలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కరోనా కట్టడికి రాత్రివేళ కర్ఫ్యూలు విధించడం వల్ల ఒనగూరే ప్రయోజనం ఏంటి? అని నిలదీశారు. ఓవైపు ఒమిక్రాన్ కేసులు పెరుగుతుంటే.. ఉత్తరప్రదేశ్‌ లో భారీ బహిరంగ సభలు, ర్యాలీలు ఏర్పాటు చేస్తుండటంపై విమర్శలు గుప్పించారు. రాత్రి వేళల్లో కర్ఫ్యూ విధించి, పగలు లక్షలాది మందితో బహిరంగ సభలను నిర్వహించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ‘రాత్రి పూట కర్ఫ్యూ విధించడం… పగటి సమయంలో లక్షలాది మందిని బహిరంగ సభలకు పిలుస్తుండటం… ఇది సామాన్యుడి అవగాహనా సామర్థ్యానికి అతీతమైంది’ అంటూ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు.

ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం డిసెంబరు 25 నుంచి రాత్రి కర్ఫ్యూలను అమలు చేస్తోంది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ నిబంధనలు అమల్లో ఉంటున్నాయి. దీనివల్ల ఉపయోగం ఏమిటని వరుణ్ గాంధీ ప్రశ్నించారు. ‘యూపీలో ప్రజారోగ్య సంరక్షణ వ్యవస్థ అంతంత మాత్రంగా ఉంది.. భయానకమైన ఒమిక్రాన్ వ్యాప్తిని ఆపడానికి ప్రాధాన్యమివ్వాలో? ఎన్నికల్లో బల ప్రదర్శనకు ప్రాధాన్యం ఇవ్వాలో? మనం నిజాయితీగా నిర్ణయించుకోవాలి’ అని వరుణ్ గాంధీ ఘాటుగా విమర్శించారు. ‘కరోనా వైరస్ గరిష్ఠ వ్యాప్తి సాధారణంగా పగటి పూటే జరుగుతుంది.. రాత్రివేళలో తక్కువ మంది రోడ్లపై తిరుగుతారు.. కోవిడ్ క్లస్టర్‌లుగా ఉద్భవించే సామాజిక సమావేశాలను తగ్గించాలి’ అని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా 2021 మార్చిలో మహారాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం రాసిన నోట్‌ను వరుణ్ ఉదహరించారు. రాత్రి కర్ఫ్యూలు, వారాంతపు లాక్‌డౌన్‌లు వంటి చర్యలు వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడంలో పరిమిత ప్రభావాన్ని చూపుతాయని అందులో పదాలను హైలెట్ చేశారు.

Also Read : బీజేపీలో కాంగ్రెస్‌ విలీనం ఖాయమ‌ట‌..!

Show comments