Omicron Cases, Andhra Pradesh – ఏపీలో మరో రెండు జిల్లాల్లో ఒమిక్రాన్‌ కేసులు

ప్రపంచీకరణ వల్ల లాభాలతోపాటు నష్టాలు కూడా ఉన్నాయని కరోనా వైరస్‌ వల్ల రుజువైంది. కరోనా వైరస్‌ ప్రభావం కొనసాగుతూనే ఉంది. కరోనా రూపం మార్చుకుంటూ పంజా విసురుతోంది. రూపం మార్చుకున్నది ఏ దేశంలోనైనా.. అది ప్రపంచం మొత్తం వ్యాపిస్తోంది. తాజాగా వెలుగులోకి వచ్చి, ప్రపంచాన్ని వణికిస్తున్న ఒమిక్రాన్‌ కూడా ప్రపంచ దేశాలకు వేగంగా విస్తరిస్తోంది. విదేశాల నుంచి వచ్చే వారి ద్వారా ఈ వైరస్‌ మన దేశంలోకి కూడా ప్రవేశిస్తోంది. దేశం మొత్తం మీద ఇప్పటి వరకు 354 మందికి ఒమిక్రాన్‌ వైరస్‌ సోకింది.

తాజాగా ఏపీలో మరో రెండు జిల్లాల్లో ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. అన్ని రంగాల్లో ముందు ఉన్న తూర్పు గోదావరి జిల్లాలో ఒమిక్రాన్‌ కేసు వెలుగులోకి వచ్చింది. కొనసీమలోని అయినవిల్లి మండలం నెదునూరివారి పాలెం గ్రామానికి చెందిన ఓ మహిళకు ఒమిక్రాన్‌ పాజిటివ్‌గా నిర్థారణ అయింది. ఆమె ఈ నెల 19వ తేదీన కువైట్‌ నుంచి వచ్చింది. విజయవాడ విమానాశ్రయంలో దిగిన ఆమె.. రోడ్డు మార్గాన స్వగ్రామానికి వచ్చింది.

మరో కేసు విశాఖపట్నం జిల్లాలో వెలుగుచూసింది. యూఏఈ నుంచి విశాఖకు వచ్చిన ఓ వ్యక్తికి ఒమిక్రాన్‌ సోకినట్లు నిర్థారించారు. విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికులకు విమానాశ్రయాల్లోనే పరీక్షలు నిర్వహిస్తున్నారు. జీనోవ్‌ సీక్వెన్స్‌కు పంపి.. ఒమిక్రాన్‌ సోకిందా..? లేదా..? తేలుస్తున్నారు. పాజిటివ్‌గా నిర్థారణ అయితే.. వెంటనే అప్రమత్తమవుతున్నారు. వైరస్‌ సోకిన వారిని ఆస్పత్రులకు తరలించి వైద్యం అందిస్తున్నారు. వారు కలిసిన వారికి పరీక్షలు నిర్వహించి.. వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేస్తున్నారు.

మొత్తంగా ఏపీలో ఇప్పటి వరకు నాలుగు కేసులు నమోదయ్యాయి. ఈ నలుగురు కూడా విదేశాల నుంచి వచ్చిన వారే కావడం గమనార్హం. విజయనగరం, తిరుపతి, తూర్పుగోదావరి, విశాఖల్లో ఒక్కొక్కటి చొప్పన ఒమిక్రాన్‌ కేసులు గుర్తించారు. విజయనగరం వాసి ఒమిక్రాన్‌ నుంచి కోలుకున్నారు. మిగతా ముగ్గురు చికిత్సలో ఉన్నారు. దేశం మొత్తం మీద ఇప్పటి వరకు 354 మందికి ఒమిక్రాన్‌ వైరస్‌ సోకింది. వీరందరూ విదేశాల నుంచి వచ్చినవారే. దేశంలో ఉన్న ఎవరికీ ఇప్పటి వరకు ఒమిక్రాన్‌ సోకలేదు. గడిచిన 24 గంటల్లో దేశంలో 6,650 మందికి కరోనా వైరస్‌ సోకింది.

Also Read : ఒమిక్రాన్ న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు మొదలు

Show comments