iDreamPost
android-app
ios-app

శభాష్ టాలీవుడ్ అంటున్నారు

  • Published Feb 03, 2021 | 9:10 AM Updated Updated Feb 03, 2021 | 9:10 AM
శభాష్ టాలీవుడ్ అంటున్నారు

ఈ మాట అంటోంది మేము కాదు. బాలీవుడ్ నుంచి కోలీవుడ్ దాకా అందరిదీ ఇదే మాట. పాండెమిక్ భయాల నుంచి ఇంకా పూర్తిగా కోలుకోకముందే థియేటర్ వ్యవస్థకు ఊపిరి ఊదేలా మన నిర్మాతలు చేస్తున్న ప్రయత్నాలు అందరి ప్రశంసలు దక్కించుకుంటున్నాయి. గత 15 రోజుల్లో సుమారు 36 సినిమాల విడుదల తేదీలను లాక్ చేయడం కన్నా శుభపరిణామం ఏముంటుంది. చిరంజీవితో మొదలుపెట్టి విశ్వక్ సేన్ దాకా చిన్నాపెద్ద అందరివీ కలిపి డేట్లు కన్ఫర్మ్ చేసుకుంటూ ఆయా యూనిట్లు అధికారికంగా ప్రకటనలు ఇవ్వడం ట్రేడ్ వర్గాలను సంతోషంలో ముంచెత్తుతోంది. రాబోయే నెల రోజుల్లో ఎంత లేదన్నా ఇంకో పది దాకా అనౌన్స్ మెంట్లు ఉంటాయి.

వంద శాతం సీటింగ్ కి ఇంకా అన్ని రాష్ట్రాలు అనుమతి ఇవ్వకపోవడంతో పాటు ఓవర్సీస్ పరిస్థితి అంతంత మాత్రంగా ఉండటంతో హిందీ ప్రొడ్యూసర్లు ఇప్పటికీ తమ రిలీజ్ డేట్లను నిర్ణయించేందుకు జంకుతున్నారు. అంతా పూర్తిగా సద్దుమణిగేవరకు వేచి చూసే ధోరణిని అవలంబిస్తున్నారు. ల్యాబులో మగ్గుతున్న సూర్యవంశీ, 83ల గురించి ఎలాంటి అప్ డేట్ ఇవ్వడం లేదు. షూటింగులు చివరి దశలో ఉన్న హీరోలు సైతం ఏమీ మాట్లాడ్డం లేదు. మన దగ్గర మాత్రం ఏకంగా ఆర్ఆర్ఆర్ అనౌన్స్ మెంట్ కూడా చేసేసాం. దీని మీద బోనీ కపూర్ లాంటి వాళ్ళు అనైతిక పోటీ అంటూ ఇప్పటికే గళమెత్తడం మొదలుపెట్టారు.

ఇదంతా ఎలా ఉన్నా మిగిలినవాళ్లకు మనం స్ఫూర్తినిస్తున్న మాట వాస్తవం. ఇలా భయపడుతూ కూర్చుంటే ఏళ్ళు గడిచిపోతాయి. జన జీవనం ఎప్పుడో సాధారణం అయిపోయింది. కరోనా కేసులు మునుపటిలా నమోదు కావడం లేదు. ప్రతి చోటా సింగల్ డిజిట్ కి పరిమితమయ్యాయి. అన్ని కార్యకలాపాలు యథావిధిగా సాగుతున్నాయి. మొన్న సంక్రాంతికి ధైర్యంగా మూడు స్ట్రెయిట్ సినిమాలు రిలీజ్ చేసిన ఇండస్ట్రీ తెలుగు ఒక్కటే. దాని ఫలితం ఎంత అద్భుతంగా వచ్చిందో కళ్లారా చూస్తూనే ఉన్నాం. ఈ ట్రెండ్ ఇకపై కూడా కొనసాగబోతోంది. సో మన ఇన్స్ పిరేషన్ తో బాలీవుడ్ బ్యాచ్ కూడా ముందుకు రావడం ఖాయం.