iDreamPost
iDreamPost
ఒక చిన్న హీరోగా కెరీర్ గా మొదలుపెట్టి దశాబ్దం పైగా కష్టపడి సూపర్ స్టార్ రజినీకాంత్ లాంటి వాళ్ళతో ధీటుగా మార్కెట్ ఏర్పరచుకోవడం అంటే మాటలా. అజిత్ ది అలాంటి కథే. ఇతను పుట్టింది హైదరాబాద్ లోనే. తండ్రి తమిళ్ తల్లి సింధీ ప్రాంతానికి చెందినవారు. పిజి స్థాయి చదువులు పూర్తి చేయకపోయినా అజిత్ జ్ఞానం అపారం. నటుడిగా కెరీర్ ని మొదలుపెట్టాలనుకున్న టైంలో అజిత్ తొలి ప్రయత్నాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. 1990లో చిన్న వేషం ద్వారా ‘ఎన్ వీడు ఎన్ కనవర్’తో డెబ్యూ చేశారు. రెండో సినిమా ‘అమరావతి’గొప్ప విజయం సాధించలేదు కానీ పేరు తెచ్చింది.
మూడో చిత్రం తెలుగు స్ట్రెయిట్ మూవీ ‘ప్రేమ పుస్తకం’. గొల్లపూడి గారి అబ్బాయి శ్రీనివాస్ దీనికి దర్శకత్వం వహిస్తూ మధ్యలో కాలం చేశారు. తర్వాత తండ్రే దీన్ని పూర్తి చేశారు. ఒకవేళ ఇది బ్లాక్ బస్టర్ అయ్యుంటే అజిత్ మనకే సొంతమయ్యేవాడేమో. కానీ అలా జరగలేదు. సినిమా ఫ్లాప్. తర్వాత అజిత్ తన లక్ష్యం కోలీవుడ్ లోనే ఉందని గుర్తించారు. వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోలేదు. 1995లో ‘ఆశై’ రూపంలో మొదటి బ్రేక్ వచ్చింది. దీన్ని ఇక్కడా ‘ఆశ ఆశ ఆశ’ పేరుతో డబ్బింగ్ చేశారు. 1996లో వచ్చిన కాదల్ కోట్టై(తెలుగు ప్రేమలేఖ)బ్లాక్ బస్టర్ సక్సెస్ అజిత్ ని ఒకేసారి పది మెట్లు ఎక్కించింది. ఇక అక్కడి నుంచి వెనుదిరిగి చూసుకొనవసరం పడలేదు.
1999లో వచ్చిన ‘వాలి’ తమిళ్ తెలుగులో ఘన విజయం సాధించి అజిత్ లోని వర్సటైల్ యాక్టర్ ని ప్రపంచానికి పరిచయం చేసింది. అమర్కలం, సిటిజెన్, రెడ్, విలన్, అట్టహాసం, తిరుపతి ఇలా వరసబెట్టి సక్సెస్ లు అజిత్ ట్రాక్ రికార్డుని పరిగెత్తించాయి. 2007లో చేసిన బిల్లా అజిత్ లోని స్టైలిష్ ఐకాన్ ని బయట పెట్టింది. అప్పటిదాకా ఊర మాస్ బాడీ లాంగ్వేజ్ కి అలవాటు పడ్డ అరవ హీరోల ఆలోచనా శైలిని మార్చేలా చేసింది అజితే. దీన్నే తెలుగులో బిల్లాగా ప్రభాస్ తో రీమేక్ చేశారు.
ఆరంభం, వీరం, వేదాలం, వివేగం, ఎన్నై అరిందాల్, విశ్వాసం ఇలా అజిత్ జైత్ర యాత్ర అప్రతిహతంగా కొనసాగుతూనే వచ్చింది. తెలుగులో భారీ మార్కెట్ లేకపోయినా అజిత్ ని విపరీతంగా ఇష్టపడే అభిమానులు ఇక్కడా లక్షల్లో ఉన్నారు. ఎంత స్థాయికి ఎదిగినా వ్యక్తిత్వంలో నిరాడంబరతను చూపించే అజిత్ అభిమాన సంఘాలను ఉపేక్షించడు. వాటికి తన నుంచి ఎలాంటి అధికారిక గుర్తింపు ఇవ్వకుండా ప్రత్యేకతను చాటుకున్నాడు. ఇవాళ అజిత్ పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఓ రేంజ్ లో రచ్చ చేస్తున్నారు