Teenmar Mallana, Controversial Poll, KTR Son – అన్ని హద్దులు దాటుతున్న తీన్మార్ మల్లన్న

తెలంగాణా రాజకీయాల్లో మరో వివాదం సంచలనంగా మారింది. కేటిఆర్ కుమారుడి లక్ష్యంగా తీన్మార్ మల్లన్న తన Q న్యూస్ ఛానల్ లో నిర్వహించిన ఒక పోల్ వివాదాస్పదమైంది. తెలంగాణా రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకోవాలనే ప్రయత్నంలో భాగంగా కనీసం వయసు, హోదాకు ఏ మాత్రం గౌరవం ఇవ్వకుండా వ్యాఖ్యలు చేసే తీన్మార్ మల్లన్న ఈసారి యూట్యూబ్ ఛానల్ పాపులారిటీ కోసం దిగజారిపోయాడు. తనను తాను ఒక వ్యవస్థగా, తిరుగులేని శక్తిగా ఊహించుకునే మల్లన్న అలియాస్ నవీన్ ఈసారి కుటుంబాలను కూడా టార్గెట్ చేయడం మొదలుపెట్టాడు.

ఎమ్మెల్సీ ఎన్నికల కోసం దాదాపు ఏడాది క్రితం ఇష్టం వచ్చినట్టు మాట్లాడి చట్ట పరంగా చర్యలు ఎదుర్కొన్న మల్లన్న, ఇటీవల కులాల మీద కూడా కామెంట్స్ చేసి జైలుకి వెళ్లి వచ్చాడు. ఆ తర్వాత ఒక ఎంపీ సహకారంతో బీజేపీలో చేరి టీఆర్‌ఎస్‌ మీద ఆరోపణలతో చెలరేగిపోతున్నాడు. బండి సంజయ్, ధర్మపురి అరవింద్ తరహాలో తనను తాను ఎక్కువ ఊహించుకుని ఈసారి రాజకీయాల్లో లేని వ్యక్తులను టార్గెట్ చేయడం మొదలుపెట్టాడు. ఇక తాజాగా వ్యవహారానికి వస్తే… తన ఛానల్ లో తెలంగాణా అభివృద్ధిని కేటీఆర్ కుమారుడిని పోలుస్తూ వివాదాస్పద పోల్ పెట్టాడు.

ఇది మంత్రి కేటిఆర్ దృష్టికి వెళ్ళడం, ఆ తర్వాత దీన్ని బిజెపి జాతీయ అధ్యక్షుడికి ట్వీట్ చేయడం జరిగాయి. ఈ వ్యవహారం పట్ల కేటిఆర్ సిరియస్‌గా రియాక్ట్ అయ్యారు. సోషల్ మీడియా… సంఘ విద్రోహక శక్తులకు అడ్డాగా మారిందన్న ఆయన… వాక్ స్వాతంత్రం ఉందని.. భావవ్యక్తీకరణ పేరుతో ఇతరులను అనడం సరైంది కాదని హితవు పలికారు. బిజెపి మీడియా థర్డ్ గ్రేడ్ నాయకులు నా పిల్లలపై నీచమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. మేము చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కొన్ని సమయాల్లో నేను ప్రజాజీవితంలో ఉండడం సరైనదేనా అని ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు.

Also Read : ఏపీ బీజేపీలో సీఎం రమేష్ పాత్ర ఏమిటి?

జర్నలిజం ముసుగులో అర్థం పర్థం లేని విషయాలు ప్రచారం చేసే చెత్త యూట్యూబ్ ఛానల్స్… పిల్లలను లాగడం సమంజసమేనా.? అని నిలదీశారు. బిజెపి జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు మీ బిజెపి నేతలకు నేర్పిన సంస్కారం ఇదేనా అని ప్రశ్నిస్తూ రాజకీయాల్లోకి నా కొడుకును లాగడం సరైనదేనా అని ఆవేదన వ్యక్తం చేసారు. ఇలాగే మీ అమిత్షా, మోడీ కుటుంబాలను లాగితే ఊరుకుంటారా అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇక కేటిఆర్ కు కుటుంబ సభ్యుల నుంచి మద్దతు వస్తుంది.

ఈ వ్యవహారంపై కేటిఆర్ సోదరి… ఎమ్మెల్సీ కవిత స్పందిస్తూ… మిమ్మల్ని విమర్శించడానికి ఎలాంటి కారణాలు లేనప్పుడు, వారు మీ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుంటారని మీకు తెలుసని, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో మనం చేయగలిగినది సున్నితంగా మరియు బాధ్యతాయుతంగా ఉండటమన్నారు. ద్వేషం మరియు అబద్ధాలను వ్యాప్తి చేయడానికి సోషల్ మీడియాను కొంతమంది చాలా కాలంగా ఉపయోగిస్తుండటం సిగ్గుచేటని ఆవేదన వ్యక్తం చేసారు.

మరోవైపు వైఎస్ షర్మిల కూడా స్పందిస్తూ… హిమన్ష్ పై బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలకు కెటిఆర్ కి మద్దతు తెలిపారు. పిల్లలను ఒక తల్లిగా, రాజకీయ పార్టీ నేత రాజకీయాల్లోకి గుంజడాన్ని ఖండిస్తున్నానని స్పష్టం చేసారు. కుటుంబ సభ్యులపై ఇలాంటి కించపరిచే ప్రకటనలను సహించేది లేదన్నారు. మహిళలను కించపరిచినా, పిల్లలను కించపరిచినా, మనం రాజకీయాలకు అతీతంగా కలిసి రావాలని కోరారు. ఇక ఇదిలా ఉంటే ఇటీవల బిజెపిలో జాయిన్ అయిన తీన్మార్ మల్లన్న బిజెపి నేతల సలహాలతోనే రేచ్చిపోయారని కొందరు తెరాస కార్యకర్తలు కామెంట్స్ చేస్తున్నారు.

బిజెపిలో కీలక పాత్ర పోషించడం ఏమో గాని… ఇదే తరహాలో నోరు జారితే మాత్రం లేనిపోని సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. జర్నలిజం, ప్రభుత్వంపై పోరాటం అనే ట్యాగ్ లను అడ్డం పెట్టుకుని చెలరేగిపోతే… ప్రజల్లో ఎటువంటి స్థానం ఉంటుంది అనేది గత చరిత్రను చూసి మల్లన్నతెలుసుకోవాల్సిన అవసరం ఉందనే కామెంట్స్ వినపడుతున్నాయి. తెలంగాణా రాజకీయాల్లో దూషణలు కామన్ అనే ధోరణిలో ఉన్న బిజెపి నేతలు, సంచలనాలే పెట్టుబడిగా రాజకీయాల్లో ఎదగాలనుకునే మల్లన్న లాంటి వ్యక్తులను ప్రోత్సహిస్తే ఆపార్టీ ప్రతిష్ఠదెబ్బ తినటం తప్ప ప్రజల్లో ఆదరణ దక్కదు .

Also Read : బాబు బాటలోనే ఏపీ బీజేపీ..

Show comments