TDP, Liquor Price – ఒకే అంశం.. రెండు మాటలు.. ఇలా ఎలా సాధ్యం..?

రాజకీయాల్లో ప్రతిపక్ష పార్టీకి గురుతర బాధ్యత ఉంది. ప్రభుత్వ నిర్ణయాలు, పనులను నిశితంగా గమనిస్తూ ప్రజల పక్షాన ప్రశ్నిస్తూ, సద్విమర్శలు చేయడం ప్రతిపక్ష పార్టీల ప్రధాన విధి. అయితే ఇందుకు భిన్నంగా ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం వ్యవహరిస్తోంది. వైఎస్‌ జగన్‌ సర్కార్‌ ఏ నిర్ణయం తీసుకున్నా.. వ్యతిరేకించడం, విమర్శలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆ పార్టీ వ్యవహరిస్తున్న తీరును బట్టి తెలుస్తోంది.

తాజాగా మద్యం విక్రయాలపై వైసీపీ ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. పొరుగు రాష్ట్రాలతో పోల్చితే మద్యం ధరల్లో భారీ వ్యతాస్యం లేకుండా ధరల్లో మార్పులు చేసింది. తద్వారా మద్యం అక్రమ రవాణా తగ్గుతుందని భావించింది. అన్ని రకాల బ్రాండ్లు విక్రయించాలని నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంపై టీడీపీ నేతలు అడ్డగోలు విమర్శలు చేస్తున్నారు. బాటిల్‌ రేటు తగ్గించింది అమ్మకాలు పెంచేందుకా..? అంటూ టీడీపీ సీనియర్‌ నేత, ఒకప్పుడు మద్యం వ్యాపారం చేసిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శలు గుప్పించారు. పేదలతో మద్యం తాగించేందుకే జగన్‌ ప్రభుత్వం ధరలు తగ్గించిందని టీడీపీ ప్రభుత్వంలో ఎక్సైజ్‌ శాఖ మంత్రిగా పని చేసిన కేఎస్‌ జవహర్‌ విమర్శించారు. మద్యం లేకపోతే ప్రభుత్వం నడిచే పరిస్థితి లేదన్న జవహర్‌.. అందుకే 20 శాతం మేర ధరలు తగ్గిస్తున్నారని విమర్శలు చేశారు. మద్యం ధరలు తగ్గించడం వెనుక ఉద్దేశం ఏమిటని తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత మైక్‌ అందుకున్నారు.

నిన్నటి వరకు ఇలా..

మద్యం అమ్మకాలు పెంచేందుకే ధరలు తగ్గించారని ఈ రోజు విమర్శలు చేస్తున్న టీడీపీ నేతలు.. నిన్న మొన్నటి వరకు ధరలు పెంచారని గగ్గొలు పెట్టారు. ధరలు పెంచి పేదలను దోపిడీ చేస్తున్నారని విమర్శలు చేశారు. కొన్ని బ్రాండ్లే అమ్ముతున్నారని, అన్ని బ్రాండ్లు అమ్మడం లేదని మాట్లాడారు. చంద్రబాబుతో సహా ఆ పార్టీ నేతలు శాసన సభ లోపల, బయట కూడా ఇదే విషయం మాట్లాడారు. ఆ పార్టీ మహిళా ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని.. అన్ని బ్రాండ్లు రాష్ట్రంలో దొరకడంలేదని అసెంబ్లీలో మాట్లాడారు. సాయంత్రం వరకు పని చేసి ఓ పెగ్గు వేసుకుని పడుకుందామనే వారిని దోపిడీ చేసేలా మద్యం ధరలు పెంచారని చంద్రబాబు మాట్లాడారు.

మద్యపాన నిషేధంలో భాగంగా దుకాణాల సంఖ్య, విక్రయాల సమయం కుదింపును వైసీపీ సర్కార్‌ చేసింది. ఫలితంగా విక్రయాలు తగ్గాయి. ఎన్నికల సమయంలోనే ఈ అంశాలను సీఎం వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. చెప్పిన వాటినే అమలు చేస్తే.. ధరలు పెంచారంటూ వ్యతిరేకిస్తూ విమర్శలు చేసిన టీడీపీ నేతలు.. ఇప్పుడు ధరలు తగ్గించినా విమర్శలు చేస్తుండడం విడ్డూరంగా ఉంది. ఒకే అంశంపై భిన్నమైన వాదనలు వినిపిస్తున్న టీడీపీ తీరు.. ఎవరికీ అర్థం కాకుండా ఉంది.

Also Read : అస‌లై న అమ‌రావ‌తి రైతులు ఈ విషయం తెలుసుకుంటే బాబును జన్మలో నమ్మరు..!

Show comments