Somu Veerraju , Pawan Kalyan, Vizag Steel – బాబూ త‌మ్ముడూ..! ప‌వ‌న్ పై సోము ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు..?

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ‌పై జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్  రాష్ట్ర ప్ర‌భుత్వాన్నే ప్ర‌ధానంగా టార్గెట్ చేస్తున్న‌ప్ప‌టికీ.. అమ్మ‌కానికి పెట్టిన కేంద్ర ప్ర‌భుత్వ పెద్ద‌ల‌కు కూడా ఎక్క‌డో త‌గులుతానే ఉన్న‌ట్లు క‌నిపిస్తోంది. స్టీల్ ప్లాంట్ పై ప‌వ‌న్ చేస్తున్న ఉద్య‌మం బీజేపీకి కూడా న‌ష్ట‌మ‌నే సంకేతాల‌ను ఆ పార్టీ పెద్ద‌లు గుర్తించిన‌ట్లు ఉన్నారు. ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు మాట‌ల ద్వారా ఆ అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. ప‌వ‌న్ ఉద్దేశించి నేరుగా ఏమీ అన‌క‌పోయిన‌ప్ప‌టికీ.. అంత‌రార్ధం లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ వ్య‌తిరేకంగా జ‌నసేన చేస్తున్న ద‌శ‌ల వారీ పోరాటం బీజేపీకి కూడా ఇబ్బంది క‌లిగిస్తోంద‌న్న‌ది తెలుస్తోంది.

అస‌లు కార‌ణాలేంటో కానీ.. సోము వీర్రాజు అంత‌గా యాక్టివ్ గా లేర‌నేది సుస్ప‌ష్టం. ఏపీలో బీజేపీకి కోర్ కమిటీని వేశాక మళ్లీ సుజనా చౌదరి, సీఎం రమేష్ , టీజీ వెంకటేష్ లాంటి ఎంపీల వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి కానీ.. గ‌తంలో మాదిరిగా వీర్రాజు పెద్ద‌గా హ‌డావిడి చేయ‌డం లేదు. పైగా రాజ‌కీయాలు ఇక చాలు అన్న‌ట్లుగా మాట్లాడుతున్నారు. అలాంటి సోము స‌డెన్ గా తమ మిత్రుడు అయిన పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్య‌లు ఆస‌క్తిక‌రంగా మారాయి. చేసింది సూచ‌న‌లే అయిన‌ప్ప‌టికీ కాస్తా గుచ్చేలాగానే క‌నిపిస్తున్నాయి. ఎంతసేపూ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మీద పవన్ మాట్లాడుతున్నారనే బాధ అయితే సోము కామెంట్స్ లో కనిపిస్తోంది. అందుకే ఒకింత బీజేపీకి ఫేవర్ గా మాట్లాడుతూనే పవన్ని ముగ్గులోకి లాగే ప్రయత్నం సోము చేశారు.

స్టీల్ ప్లాంట్ గురించి మాత్రమే కాదు ప్రస్తుత, గత ప్రభుత్వాలు అమ్మేసిన సంస్థల గురించి కూడా పవన్ మాట్లాడాలని సోము వీర్రాజు సూచించ‌డం వెనుక పెద్ద చ‌ర్చే జ‌రుగుతోంది. పవన్ కళ్యాణ్ సహా మెగా ఫ్యామిలీకి సన్నిహితుడుగా పేరు పొందిన సోము వీర్రాజు తాను ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ అయ్యాక అటు పవన్ని ఇటు చిరంజీవిని కలిసి వచ్చారు. అలాగే పవన్ తో కలిసి ఏపీలో బీజేపీ అధికారంలోకి వస్తుందని కూడా అప్పట్లో చాలా సార్లు చెప్పుకున్నారు. అయితే ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో జ‌న‌సేన కు స‌రైన ప్రాధాన్యం ఇవ్వ‌క‌పోవ‌డంతో పవన్ తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల ముందు నుంచే అసంతృప్తిగా ఉన్నారని వార్తలు వచ్చాయి. ఏకపక్షంగా తిరుపతిలో బీజేపీ అభ్యర్ధి పోటీ చేస్తారని అప్పట్లో సోము వీర్రాజు చెప్పడం జ‌నసేన‌కు ఆగ్రహం కలిగించింది అంటారు.

అదే విధంగా ఏపీలో బీజేపీ సొంతంగా కార్యక్రమాలు చేయడానికి చూడడం జనసేనను కనీసం కలుపుకుని పోయే ప్రయత్నం చేయడం వంటివి కూడా గ్యాప్ పెంచాయని అంటారు. దాంతో కేంద్ర బీజేపీ పెద్దల దాకా వ్యవహారం వెళ్లిందని ఆ పరిణామాలతోనే సోము వీర్రాజుని నామమాత్రుడిని చేసి ఏపీ బీజేపీలో సీనియర్లను కోర్ కమిటీ మెంబర్లుగా నియమించారనే వాద‌న‌లు కూడా లేక‌పోలేదు. పవన్ వంటి మిత్రుడు బీజేపీకి అవసరం. దాంతో ఆయన కోసం ఏమైనా చేసేందుకు కేంద్ర బీజేపీ రెడీగానే ఉంటుంది. అదే సమయంలో సోము వీర్రాజు అధ్యక్ష పదవి మీద కూడా సందేహాలు ఏర్పడుతున్నాయి. ఇవన్నీ మనసులో పెట్టుకున్నారో ఏమో కానీ సోము ఇండైరెక్ట్ గా రియాక్ట్ అయ్యారని అంటున్నారు.

అందుకే ఆయన పవన్ మీద చిన్నదో పెద్దదో కానీ ఒక బాణం వేశారని అంటున్నారు. టీడీపీ ప్రభుత్వం ఏపీలో ప్రభుత్వ రంగ సంస్థలను అప్పట్లో అమ్మేసింది. మ‌రి ఆ విష‌యాల‌ను ప్రస్తావించకుందా పవన్ ఎంతసేపూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మీద మాట్లాడడం ఏంటి అన్నదే సోము అంత‌రంగ‌మా అనే చ‌ర్చ అయితే జ‌రుగుతోంది.

Also Read :  పవన్ కు సోము సలహా .. బాబును ఇరకాటంలో పెట్టేశారుగా

Show comments