Skill Scam, CID, PV Ramesh – స్కిల్‌ స్కాం.. మాజీ ఐఏఎస్‌ పీవీ రమేష్‌ ఇంటికి సీఐడీ

టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌లో చోటు చేసుకున్న 241.79 కోట్ల రూపాయల కుంభకోణంపై సీఐడీ అధికారుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ రోజు సీఐడీ అధికారులు మాజీ ఐఏఎస్‌ అధికారి పీవీ రమేష్‌ ఇంటికి వెళ్లారు. పీవీ రమేష్‌ చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా పని చేశారు. ఆ సమయంలో పీవీ రమేష్‌ వద్ద ఉన్న సమాచారం తెలుసుకునేందుకు సీఐడీ అధికారులు హైదరాబాద్‌ జూబ్లిహిల్స్‌లోని ఆయన ఇంటికి వెళ్లారు. అయితే ఇంటి డెవలెప్‌మెంట్‌ పనులను కాంట్రాక్టర్‌కు ఇచ్చిన రమేష్‌ మరోచోట నివాసం ఉంటున్నారు.

అక్కడ విషయం తెలుసుకున్న సీఐడీ అధికారులు.. వెనక్కి వచ్చేశారు. పీవీ రమేష్‌ ప్రస్తుతం ఉన్న ఇంటికి ప్రశ్నావళిని పంపి సమాచారం తెలుసుకుంటామని సీఐడీ అధికారులు తెలిపారు. వెంటనే స్పీడ్‌ పోస్టులో ప్రశ్నావళిని పంపుతామని పేర్కొన్నారు.

విద్యార్థులకు శిక్షణ ఇవ్వకుండానే ఇచ్చినట్లుగా చూపి 241.79 కోట్ల రూపాయలను షెల్‌ కంపెనీలు, నకిలీ ఇన్వాయిస్‌లతో కాజేశారని అప్పటి సంస్థ ఎండీ మాజీ ఐఏఎస్‌ గంటా సుబ్బారావు, సలహాదారుడు మాజీ ఐఏఎస్‌ లక్ష్మీనారాయణ సహా 26 మందిపై సీఐడీ ఈ నెల 9వ తేదీన కేసు నమోదు చేసింది. ఇందులో భాగంగా అప్పటి ఎండీ, సీఈవో గంటా సుబ్బారావు సహా నలుగురిని సీఐడీ ఈ నెల 16వ తేదీన అరెస్ట్‌ చేసింది. గంటా సుబ్బారావుకు ఈ రోజు హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. లక్ష్మీ నారాయణ ముందుగానే హైకోర్టు నుంచి బెయిల్‌ పొందారు.

ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా పని చేసి పదవీ విరమణ తర్వాత.. పీవీ రమేష్‌ వైసీపీ ప్రభుత్వంలో ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శిగా నియమితులయ్యారు. 2019 జూన్‌లో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమితులైన పీవీ రమేష్‌.. వైద్య, ఆరోగ్య, విద్య శాఖల్లో పని చేశారు. జూలైలో ఆయా శాఖలను ఆయన నుంచి తప్పించారు. ఆ ఏడాది నవంబర్‌ 1న తన పదవికి పీవీ రమేష్‌ రాజీనామా చేయగా.. ప్రభుత్వం నవంబర్‌ 21వ తేదీన ఆమోదించింది.

Also Read : స్కిల్‌ స్కాం.. గంటాకు బెయిల్‌

Show comments