Omicron case, Andhra Pradesh – ఏపీలో మరో ఒమిక్రాన్‌ కేసు… ఆందోళనకు గురిచేస్తున్న బిల్‌గేట్స్‌ వ్యాఖ్యలు

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ వేరియంట్‌ ఒమిక్రాన్‌ భారత దేశంలోన మెల్లగా వ్యాపిస్తోంది. ఇప్పటికి 213 ఒమిక్రాన్‌ కేసులు భారత్‌లో నమోదయ్యాయి. అత్యధికంగా మహారాష్ట్ర, ఢిల్లీలో కేసులు వెలుగులోకి వచ్చాయి. వీరందరూ విదేశాల నుంచి వచ్చిన వారే కావడం గమనార్హం.

తెలుగు రాష్ట్రాలలోనూ ఒమిక్రాన్‌ కేసులు నమోదవుతున్నాయి. తెలంగాణలో ఇప్పటికే 25 కేసులు నమోదు కాగా.. ఏపీలో ఈ రోజు రెండో కేసు నమోదైంది. కెన్యా నుంచి వచ్చిన 39 ఏళ్ల తిరుపతి మహిళకు ఒమిక్రాన్‌ సోకినట్లు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ అధికారికంగా వెల్లడించింది. ఈ నెల 12వ తేదీన సదరు మహిళ కెన్యా నుంచి చెన్నై మీదుగా తిరుపతికి వచ్చింది. విదేశాల నుంచి వచ్చే ప్రతి ప్రయాణికుడికి అధికారులు పరీక్షలు చేస్తుండడంతో.. వైరస్‌ వ్యాప్తి తక్కువగా ఉంది. సదరు మహిళ నమూనాలను జీనోమ్‌ సీక్వెన్స్‌కు పంపగా.. ఫలితాల్లో ఒమిక్రాన్‌ సోకినట్లు తేలిందని అధికారులు వెల్లడించారు. అయితే ఆమె కుటుంబ సభ్యులకు వైరస్‌ సోకకపోవడం గమనార్హం.

ఏపీలో మొదటి కేసు విజయనగరంలో నమోదైంది. విదేశాల నుంచి వచ్చిన ఓ వ్యక్తికి ఒమిక్రాన్‌ సోకింది. అతను వైరస్‌ నుంచి పూర్తిగా కోలుకున్నాడు.

ప్రమాదం పొంచి ఉంది.. జాగ్రత్త అవసరం..

ఒమిక్రాన్‌ వైరస్‌పై బిల్‌గేట్స్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వైరస్‌ మునుపెన్నడూలేనంతగా వ్యాప్తి చెందే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే తన స్నేహితులు అనేక మంది ఈ వైరస్‌ బారిన పడ్డారని పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రయాణాలు వాయిదా వేసుకోవాలన్నారు. మూడు నెలల పాటు ఒమిక్రాన్‌ వైరస్‌ వ్యాప్తి కొనసాగే అవకాశం ఉందన్నారు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుంటే.. 2022లో కరోనా వైరస్‌కు చెక్‌ పెట్టవచ్చని అంచనా వేశారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ తీసుకోవాలని సూచించారు. కాగా, అమెరికాలో ఒమిక్రాన్‌ వైరస్‌ వల్ల తొలి మరణం నమోదైంది.

Also Read : ఒమిక్రాన్ న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు మొదలు

Show comments